తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Cyclone Loss: ఉమ్మడి వరంగల్‌లో మిగ్‌జాం తుఫానుతో అపార నష్టం

Warangal Cyclone loss: ఉమ్మడి వరంగల్‌లో మిగ్‌జాం తుఫానుతో అపార నష్టం

HT Telugu Desk HT Telugu

07 December 2023, 6:23 IST

    • Warangal Cyclone loss: మిగ్‌జామ్‌ తుపాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ముసురు వానలు కురుస్తుండగా.. వాతావరణం చల్లబడి చలి తీవ్రత పెరిగింది. కాగా జిల్లాలో కొన్నిచోట్లా ఓ మోస్తరు వర్షాలు కురవగా.. మరికొన్నిచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.
ఉమ్మడి వరంగల్‌లో అపార పంట నష్టం
ఉమ్మడి వరంగల్‌లో అపార పంట నష్టం (PTI)

ఉమ్మడి వరంగల్‌లో అపార పంట నష్టం

Warangal Cyclone loss: తెలంగాణలో భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో మిచౌంగ్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కళ్లాల్లోకి తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దవడంతో తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. వర్షాల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలెక్టర్ శశాంక బుధవారం సెలవు ప్రకటించారు. భూపాలపల్లి లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లోకి నీళ్లు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

ట్రెండింగ్ వార్తలు

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

అన్నదాతలకు తీవ్ర నష్టం

మిచౌంగ్ తుపాను ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో చాలా చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని గూడూరు, కేసముద్రం,ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో కోతకు వచ్చిన వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చాలాచోట్లా కళ్లాల్లోకి తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు తడిసిముద్దయ్యాయి. ధాన్యం రాసులపై కప్పేందుకు సరిపడా టార్పాలిన్లు లేక అన్నదాతలు అవస్థలు పడాల్సి వచ్చింది.

మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా డోర్నకల్ నియోజక వర్గంలో గాలి వాన బీభత్సం సృష్టించడంతో నియోజక వర్గ వ్యాప్తంగా చేతికొచ్చిన మిర్చి, వరి పంట నీటి పాలయ్యాయి.

లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే పంట కళ్ల ముందే వర్షార్పణమవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే వివిధ తెగుళ్లతో మిర్చి పంటకు నష్టం వాటిల్లగా.. కొద్దిపాటి దిగుబడితోనైనా పెట్టుబడి ఖర్చులు వెళ్లదీయాలనుకున్న రైతులకు మిచౌంగ్ తుపాను తీవ్ర దు:ఖాన్ని మిగిల్చినట్లయ్యింది.

పెరిగిన చలితో.. గజగజ

మిగ్‌జామ్ తుపాన్ కారణంగా ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడి పోయాయి. 28 డిగ్రీలకు పైగా నమోదయ్యే ఉష్ణోగ్రతలు రెండ్రోజులుగా కురుస్తున్న ముసురువానలకు సడెన్ గా తగ్గిపోయాయి. బుధవారం చాలాచోట్లా కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల వరకు నమోదు కాగా.. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు నమోదు అయ్యింది. ఒక్కసారిగా టెంపరేచర్ పడిపోవడంతో జనాలు చలితో గజగజ వణుకుతున్నారు. ఓ వైపు వర్షాలు, మరోవైపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనాలు చాలావరకు ఇళ్లకే పరిమితం అయ్యారు.

‘చేతికొచ్చిన పంట నీటిపాలైంది’

అకాల వర్షాల వల్ల కోతకు వచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ములుగు జిల్లా కన్నాయిగూడెం జంగాలపల్లికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిచోట్లా కోసిన వరి మొత్తం తడిసిపోయాయన్నారు. చేతికొచ్చిన పంట మొత్తం నీటిపాలైందని, కనీసం అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేకుండాపోయిందని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం