తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Civils Results 2022: వంట కార్మికురాలి కొడుకు 'సివిల్స్' కొట్టాడు.. ఆసిఫాబాద్ బిడ్డ 'రేవయ్య' బ్యాక్‌గ్రౌండ్ ఇదే

Civils Results 2022: వంట కార్మికురాలి కొడుకు 'సివిల్స్' కొట్టాడు.. ఆసిఫాబాద్ బిడ్డ 'రేవయ్య' బ్యాక్‌గ్రౌండ్ ఇదే

24 May 2023, 11:01 IST

    • UPSC Civil Services Final Result 2022: యూపీఎస్సీ  ప్రకటించిన సివిల్ సర్వీసెస్‌ ఫలితాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులు మెరిశారు. ఆసిఫాబాద్ కు చెందిన డోంగ్రి రేవయ్య సివిల్స్‌లో 410 ర్యాంకు సాధించి.. శెభాష్ అనిపించారు.
డోంగ్రి రేవయ్య
డోంగ్రి రేవయ్య

డోంగ్రి రేవయ్య

UPSC Civil Services Final Result 2022:డోంగ్రి రేవయ్య ...కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన పేదింటి బిడ్డ. రేవయ్య చిన్నతనంలోనే తండ్రి మనహర్ చనిపోయాడు. తల్లి మాత్రం బిడ్డలు ఉన్నత చదువులను అభ్యసించాలని ఆకాంక్షించింది. ఇంటిపెద్ద దిక్కు కోల్పోయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా.. తల్లి విస్తారుబాయి పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పని చేస్తోంది. ఆ పనులు చేసుకుంటూనే పిల్లలను చదివించింది. కష్టాల కడలి నుంచి వచ్చిన రేవయ్య మాత్రం... సివిల్స్ టార్గెట్ గా అడుగులు వేశాడు. మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకొని సివిల్స్ వైపు కదిలాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో 410 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు.

ట్రెండింగ్ వార్తలు

TS Universities VCs : తెలంగాణలో 10 వర్సిటీలకు ఇన్ ఛార్జ్ వీసీల నియామకం, కేయూలో ఫైళ్ల మాయం కలకలం!

NGT On Manair Sand Mining : మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు, తెలంగాణ ప్రభుత్వానికి భారీగా జరిమానా!

Deepthi Jeevanji : వరంగల్ బిడ్డ ప్రపంచ రికార్డు, పారా అథ్లెటిక్స్ లో దీప్తి జివాంజీకి గోల్డ్

TS Paddy Bonus : రూ.500 బోనస్ సన్న ధాన్యం నుంచి మొదలుపెట్టాం- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గురుకులంలో చదివి...

రేవయ్య పదో తరగతి వరకు ఆసిఫాబాద్‌ గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. ఇంటర్‌ చిలుకూరు సాంఘిక సంక్షేమ వసతిగృహంలో పూర్తి చేయగా.... 2012లో ఐఐటీ ప్రవేశ పరీక్ష రాసి 737 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఫలితంగా మద్రాసు ఐఐటీలో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఓఎన్‌జీసీలో అయిదేళ్ల పాటు ఉద్యోగం కూడా చేశాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడే సివిల్స్ ప్రిపేర్ కావటం మొదలుపెట్టాడు. అయితే ఓవైపు ఉద్యోగం చేస్తూ సివిల్స్ సాధించటం కష్టమని భావించి సివిల్స్ పై దృష్టిపెట్టాడు. ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టాడు. గతేడాది కేవలం రెండు మార్కులతో అవకాశాన్ని కోల్పోయాడు. ఈసారి మాత్రం విజయం అతన్ని వరించింది. రేవయ్య సివిల్స్ ర్యాంక్ సాధించటంతో తల్లి ఆనందం వ్యక్తం చేస్తోంది. నా కష్టానికి దక్కిన ఫలితమే ఈ విజయం అని చెప్పుకొచ్చింది. ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కర్నాటిపేటకు చెందిన అజ్మీరా‌ సంకేత్ కూడా సివిల్స్ లో సత్తా చాటాడు. ఏకంగా 35వ ర్యాంకు సాధించాడు.

ఉమా హారతికి 3వ ర్యాంక్..

ఉమా హారతి

సివిల్స్ ఫలితాల్లో తెలంగాణకు చెందిన యువతి నూకల ఉమా హారతి మూడో ర్యాంకుతో మెరిశారు. ఆమె నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె. ఉమా హారతి సాధించిన విజయానికి ప్రశంసల జల్లు కురుస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగితేలారు. ఈ సందర్భంగా ఉమా హారతి మీడియాతో మాట్లాడారు. తాను సివిల్స్‌లో విజేతగా నిలవడానికి గల కారణాలను పంచుకున్నారు. ‘‘ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నాను. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. రోజూ 7 నుంచి 8 గంటల పాటు చదివేదాన్ని. ముందుగా జాగ్రఫీ ఆప్షనల్‌ సబ్జెక్టు ఉండేది. ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారాను. ఐదేళ్లుగా నేను ప్రిపేర్‌ అవుతున్నాను. ఈ ప్రాసెస్‌లో కుటుంబ సభ్యుల సపోర్టు, ఎమోషనల్‌ సపోర్టు చాలా అవసరం. అది ఉంటే చాలు. సమాచారం, పుస్తకాలు.. అన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయి. కానీ ఎమోషనల్‌, ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదు కదా.. అదే చాలా అవసరం. మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. కుటుంబం సపోర్టు చేస్తే సాధించవచ్చు " అని ఉమా హారతి చెప్పారు.

‘‘ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్‌ అయినా నిరాశ పడొద్దు. ఎవరి నుంచైనా మనం స్ఫూర్తిపొందవచ్చు. నేను ఐదేళ్ల నుంచి ప్రిపేర్‌ అవుతున్నా. ఈ పరీక్ష ప్రక్రియలో చాలా ఫెయిల్యూర్స్‌ చూశాను. అదే పనిగా విశ్వాసంతో చదువుతూ వెళ్లాను.. నేను ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ తర్వాత ఉద్యోగంలో చేరలేదు. సివిల్స్‌ వైపు వెళ్లాలని ముందునుంచీ ఉండటంతో దానిపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టాను. నా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్టు ఇచ్చారు. సివిల్స్‌ సాధించే వరకు రాద్దామని నిర్ణయించుకొని రాశాను. నా ఫ్రెండ్స్‌ చాలా సపోర్టు చేశారు. నూటికి నూరు శాతం మా నాన్నే నాకు స్ఫూర్తి, ప్రేరణ" అని చెప్పుకొచ్చారు.

తదుపరి వ్యాసం