తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : గాంధీ చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారమైంది - సీఎం కేసీఆర్

CM KCR : గాంధీ చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారమైంది - సీఎం కేసీఆర్

01 September 2023, 19:48 IST

    • CM KCR Latest News:స్వతంత్ర సమరయోధుల గొప్పతనం నేటి తరానికి సమగ్రంగా తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రం కూడా సాకారమైందన్నారు.
సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

Swatantra Bharata Vajrotsavalu: స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుక కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో కన్నుల పండువగా జరిగింది. హెచ్ ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి,వందనం సమర్పించారు. జాతీయ గీతాలాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ సాకారమైందన్నారు. భారత వజ్రోత్సవాలలో స్వాతంత్య్ర పోరాట చరిత్ర ను, తమ కోసం ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని అన్నారు.

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భం విశిష్టమైనదని అన్నారు సీఎం కేసీఆర్. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రనూ ఆదర్శాలనూ, నేటి తరానికి తెలియజేయాలనే సత్సంకల్పంతో గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజులపాటు నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. ముగింపు ఘట్టానికి చేరుకున్నామని, ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు. వజ్రోత్సవాల సందర్భంగా 30 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులకు మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని చూపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాచార ప్రజా సంబంధాల శాఖ, విద్యాశాఖల అధికారులు, సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని . వారికి అభినందనలు తెలిపారు.

భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు, ఉన్నతమైన నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లని అన్నారు. అతి ప్రాచీన కాలంలోనే యావత్ ప్రపంచానికీ మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిదని సీఎం కొనియాడారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్ర్య సమరం ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయిందని, అనేక మంది మేధావులు దేశ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారన్నారు. గాంధీజీ చరఖా చేత బట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికి వాడలు శుభ్రం చేసినా, ఉప్పు వండినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయిందన్నారు. ‘‘ ఈశ్వర్ అల్లా తేరే నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్ ’’ అంటూ మత సామరస్యం కోసం యావజ్జీవం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం చారిత్రిక విషాదమన్నారు. గాంధీజీ ఒక్క భారతదేశం మీదనే కాదు, యావత్ ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారని అన్నారు.

గాంధీయవాదమే ఆదర్శం…

మార్టిన్ లూథర్ కింగ్ నుంచి, నెల్సన్ మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచిందని, గాంధీని ఎంతగానో ఆరాధించిన నెల్సన్ మండేలా గాంధీజీ గురించి గొప్ప విషయాలు చెప్పారని సీఎం అన్నారు. “నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమలో మహత్మాగాంధీ యొక్క స్థాయిని నేనెన్నటికీ అందుకోలేకపోయానని, గాంధీ ఏ బలహీనతలు లేని మనిషి. నేను అనేక బలహీనతలున్నవాడిని..” అని మండేలా చెప్పుకున్నారని గుర్తు చేశారు. నేటికీ యావత్ ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తున్నదని, గాంధీ చూపిన అహింసామార్గంలో స్వాతంత్రోద్యమం విజయతీరం చేరిందని తెలిపారు. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల వంటి అనేకమంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని చెప్పారు.

గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు సీఎం కేసీఆర్. పోరాటం గమ్యాన్ని ముద్దాడిందని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేదని, టీఆర్‌ఎస్‌ను స్థాపించినపుడు అహింసాయుత ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని స్పష్టంగా ప్రకటించానని పునరుద్ఘాటించారు. మొదట కొందరు ఏకీభవించలేదు. కానీ రానురాను అందరూ తాను ఎంచుకున్న మార్గమే సరైనదని అంగీకరించి వెంట నడిచారని తెలిపారు.

తదుపరి వ్యాసం