తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adhar Problems: ఆరు గ్యారంటీలకు 'ఆధార్​' తిప్పలు..ఆధార్​ నమోదు కేంద్రాల వద్ద జనం బారులు

Adhar Problems: ఆరు గ్యారంటీలకు 'ఆధార్​' తిప్పలు..ఆధార్​ నమోదు కేంద్రాల వద్ద జనం బారులు

HT Telugu Desk HT Telugu

29 December 2023, 6:27 IST

    • Adhar Problems: తెలంగాణ ప్రభుత్వం అభయహస్తం ఆరు గ్యారంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంతో జనాలు ఆధార్​ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.
ఆరు గ్యారంటీలకు ఆధార్ కష్టాలు
ఆరు గ్యారంటీలకు ఆధార్ కష్టాలు

ఆరు గ్యారంటీలకు ఆధార్ కష్టాలు

Adhar Problems: ఆరుగ్యారంటీల అమలుకు ఆధార్‌ కీలకంగా మారింది. గతంలో ఎప్పుడో తీసుకున్న ఆధార్​ కార్డులు కావడం, ఆ తరువాత వాటిని అప్​ డేట్​ చేసుకోకపోవడంతో చాలామంది అప్​ డేట్‌ చేయడంతో పాటు మార్పులు, చేర్పుల కోసం ఆధార్​ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం గురువారం నుంచి ప్రజాపాలన అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. ఆయా కౌంటర్ల వద్దకంటే ఆధార్​ సెంటర్లలోనే జనం ఎక్కువగా కనిపించారు. ఒక్కసారిగా జనం మార్పులు, చేర్పుల కోసం క్యూ కట్టడంతో ఆధార్​ సెంటర్ల సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

అధార్​ నెంబర్​ కీలకం

రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరున ఆరు పథకాలు అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మహాలక్ష్మీ స్కీంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం..

మహిళలకు ప్రతినెలా రూ.2,500, రూ.500 కే గ్యాస్​ సిలిండర్​, రైతులకు పెట్టుబడి సాయానికి రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు కోసం గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ పెంపు​ కోసం చేయూత పథకాల అమలుకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమాన్ని గురువారుం నుంచే ప్రారంభించింది.

దరఖాస్తులో అధార్​ కార్డు నెంబర్​ ను కీలకం చేశారు. తప్పనిసరిగా ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేయాల్సిందిగా అప్లికేషన్​ ఫారమ్​ లో మెన్షన్​ చేశారు. ఇప్పుడు అన్నింటికీ ఆధాన్​ అనుసంధానం చేస్తుండటంతో ఆరు గ్యారంటీలకు కూడా అదే ఆధార్​ కీలకంగా మారింది.

ఇప్పటికీ పాత జిల్లా.. పాత రాష్ట్రమే..

2014లో పది జిల్లాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా.. ఆ తరువాత 2016లో జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టి, 2019 వరకు మొత్తంగా 33 జిల్లాలను ఏర్పాటు చేసింది. ఆ తరువాత కొత్త మండలాలు కూడా ఏర్పడ్డాయి.

తెలంగాణ రాష్ట్రం, నూతన జిల్లాలు, మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పడి ఏండ్లు అవుతున్నా.. చాలామంది గతంలో తీసుకున్న ఆధార్ కార్డులను ఇంతవరకు అప్​ డేట్​ చేసుకోలేదు. ఇప్పటికీ చాలామంది కార్డుల మీద పాత అడ్రస్సులే ఉన్నాయి.

రాష్ట్రం మారినా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్​ అడ్రస్​ లతో ఉన్న కార్డులే లక్షల్లో ఉన్నాయి. ఇక జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీల పేర్లు అప్​ డేట్​ చేసుకోనివాళ్లు కోకొల్లలు. దీంతో అలాంటివారంతా ఇప్పుడు అభయహస్తం పథకాల్లో లబ్ధిపొందేందుకు అడ్రస్​ ఛేంజ్​ చేసుకోవడానికి ఆధార్​ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు.

వారం రోజులుగా ఫుల్​ రష్​

బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహిళలను స్థానికులుగా గుర్తించేందుకు ఆధార్​ తప్పనిసరి చేయగా.. ఇప్పుడు మిగతా పథకాలకు కూడా ఆధార్​ నెంబర్​ సేకరిస్తున్నారు.

దీంతో అన్ని పథకాలను ఆధార్​ కు అనుసంధానం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పథకాలకు దరఖాస్తులు తీసుకుంటామని ముందుగానే ప్రచారం చేయడంతో గత వారం నుంచి ఆధార్​ నమోదు కేంద్రాల వద్ద సందడి పెరిగినట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు.

పేరు, మండలం, జిల్లా, రాష్ట్రం మార్పుల కోసం జనాలు పెద్ద ఎత్తున ఆధార్​ సెంటర్లకు వస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో గత వారం, పది రోజుల నుంచి ఆధార్​ సెంటర్లన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. కాగా అభయహస్తం గ్యారంటీలకు ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో జనాలు గురువారం పెద్ద ఎత్తున ఆధార్​ సెంటర్ల వద్ద క్యూ కట్టారు. దీంతో అక్కడి సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఆన్ లైన్ లో మార్చుకునే వెసులుబాటు ఉన్నా.. సమస్యలే

వేలి ముద్రలు, ఐరిస్​ అప్​ డేట్​ కోసం తప్పనిసరిగా ఆధార్​ నమోదు కేంద్రానికే వెళ్లాల్సి ఉండగా.. అడ్రస్​ ఛేంజ్​ లాంటి కొన్ని సేవలు ఆన్​ లైన్​ లో చేసుకునే వెసులు బాటు ఉంది.

ఆన్​ లైన్​ లో అప్​ డేట్​ చేసుకుందామనుకున్నా.. కొంతమందికి తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రంలో జిల్లాల విభజన జరగగా.. గ్రామాలు, మండలాల మార్పుల విషయంలో ఆధార్​ సైట్​ లో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు తెలిసింది. ఉదాహరణకు ఉమ్మడి వరంగల్ ను ఆరు జిల్లాలుగా విభజించిన విషయం తెలిసిందే.

ఇందులో వరంగల్ అర్బన్​, రూరల్ జిల్లాలు ఉండగా.. 2021 జూన్​ లో ఈ రెండు జిల్లాల్లోని మండలాల మార్పులు చేర్పులతో హనుమకొండ, వరంగల్​ జిల్లాలు ఏర్పాటు చేశారు. కాగా ఈ రెండు జిల్లాల్లోని ప్రాంతాల ప్రజలు ఆధార్​ లో అడ్రస్​ ఛేంజ్​ చేసుకుందామనుకున్నా సమస్యలు ఏర్పడుతున్నాయి.

ఆధార్​ సైట్ లో అడ్రస్​ ఛేంజ్​ ఆప్షన్​ లోకి వెళ్లి అక్కడ జిల్లాలు, మండలాలు, గ్రామాలు మార్చుకునే ప్రయత్నం చేసినా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆధార్ సైట్​ లో వరంగల్ అర్బన్​, రూరల్ జిల్లాల కూడా కనిపిస్తుండగా.. వాటితో పాటు హనుమకొండ జిల్లా కూడా చూపిస్తోంది. కానీ హనుమకొండ జిల్లాను సెలెక్ట్​ చేసి, పిన్​ కోడ్​ మార్చినా అందులోని గ్రామాల పేర్లు చూపించకపోవడంతో పలువురు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

ఇలాంటి సమస్య ఇతర జిల్లాల్లో కూడా నెలకొన్నట్లు తెలిసింది. దీంతో ఆన్​ లైన్​ లో అడ్రస్​ ఛేంజింగ్​ కు వెసులుబాటు ఉన్నా.. ఆప్షన్లు మారకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. సైట్​ లో సరైన మార్పులు జరగకపోవడం కూడా సమస్యగా మారిందనే అభిప్రాయాలు వినిపించాయి.

ఇదిలాఉంటే మాన్యువల్​ గా మార్పులు చేసుకుందామనుకుంటే ఆధార్​ కేంద్రాల వద్ద రష్​ తో ఇబ్బందులు పడాల్సి వస్తోందని, సమస్య తీరేంత వరకు ఆధార్​ నమోదు కేంద్రాలను పెంచాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.

(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం