తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australian Open 2024: ఆస్ట్రేలియన్ టైటిల్ కైవసం చేసుకున్న 22 ఏళ్ల సిన్నెర్: ఫైనల్‍లో సంచలన విజయం.. భారీ ప్రైజ్‍మనీ సొంతం

Australian Open 2024: ఆస్ట్రేలియన్ టైటిల్ కైవసం చేసుకున్న 22 ఏళ్ల సిన్నెర్: ఫైనల్‍లో సంచలన విజయం.. భారీ ప్రైజ్‍మనీ సొంతం

Published Jan 28, 2024 07:14 PM IST

google News
    • Australian Open 2024 - Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‍‍ను కైవసం చేసుకున్నాడు ఇటలీ యంగ్ ప్లేయర్ జానిక్ సిన్నర్. పురుషుల సింగిల్స్ ఫైనల్‍లో డానిల్ మెద్వెదెవ్‍పై గెలిచి సత్తాచాటాడు. ఓటమి అంచు నుంచి పుంజుకొని గెలిచాడు. 
Australian Open 2024: ఆస్ట్రేలియన్ టైటిల్ కైవసం చేసుకున్న 22 ఏళ్ల సిన్నర్.. ఫైనల్‍లో సంచలన విజయం (AFP)

Australian Open 2024: ఆస్ట్రేలియన్ టైటిల్ కైవసం చేసుకున్న 22 ఏళ్ల సిన్నర్.. ఫైనల్‍లో సంచలన విజయం

Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీలో కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటలీ యువ సంచలనం జానిక్ సిన్నెర్ ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ సాధించాడు 22ఏళ్ల సిన్నెర్. మెల్‍బోర్న్ వేదికగా నేడు (జనవరి 28) జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‍లో నాలుగో సీడ్ జానిక్ సిన్నెర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో రష్యా స్టార్ ప్లేయర్, మూడో సీడ్ డానిల్ మెద్వెదేవ్‍పై గెలిచాడు. తొలి రెండు సెట్లు కోల్పోయి ఓ దశలో సిన్నెర్ ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే, ఆ తర్వాత విజృంభించిన సిన్నెర్.. వరుసగా మూడు సెట్లు కైవసం చేసుకొని ఫైనల్‍లో సంచలన విజయం సాధించాడు.

3 గంటల 44 నిమిషాల పాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్‍లో మెద్వెదెవ్‍పై సిన్నెర్ గెలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచిన రెండో అత్యంత పిన్న వయస్కుడిగా సిన్నెర్ రికార్డు సృష్టించాడు. అలాగే, 1976 (అడ్రియానో పనట్టా) తర్వాత గ్రాండ్‍స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన ఇటలీ ప్లేయర్‌గానూ అతడు నిలిచాడు.

రెండు సెట్లు కోల్పోయి..

ఫైనల్‍లో తొలుత డానిల్ మెద్వెదెవ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. దీంతో సిన్నర్ వెనుకబడ్డాడు. తొలి సెట్‍లో ఓ దశలో 4-2కు దూసుకెళ్లిన మెద్వెదెవ్ 6-3తో సెట్ కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు ప్రదర్శించాడు. రెండో సెట్‍లో మెద్వెదెవ్ ఏకంగా 5-1 ఆధిక్యానికి వెళ్లాడు. అయితే, ఆ దశలో వరుసగా రెండు గేమ్‍లు గెలిచి పుంజుకున్నాడు సిన్నెర్. అయితే, ఆ తర్వాత మరో గేమ్ గెలిచి రెండో సెట్‍ను కూడా మెద్వెదెవ్ సొంతం చేసుకున్నాడు.

రెండు సెట్లు కోల్పోవడంతో ఇక ఫైనల్‍ను సిన్నెర్ గెలుస్తాడన్న ఆశలు అడుగంటాయి. ఆ తరుణంలో జానిక్ సిన్నర్ విజృంభించాడు. దూకుడైన ఆటతో సత్తాచాటాడు. మూడో సెట్‍లో 5-4తో ముందంజ వేసిన ఇటలీ యంగ్ ప్లేయర్ సిన్నెర్ ఆ దశలో మెద్వెదెవ్ సర్వీస్‍ను బ్రేక్ చేశాడు. మూడో సెట్ గెలిచాడు. దీంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది.

నాలుగో సెట్‍లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. మెద్వెదెవ్ సర్వీస్ బ్రేక్ చేసి సెట్ గెలిచాడు సిన్నెర్. దీంతో ఫైనల్ పోరు నిర్ణయాత్మక ఐదో సెట్‍కు చేరుకుంది. అత్యంత ఉత్కంఠ మధ్య జరిగిన చివరి సెట్‍లో సిన్నెర్ పైచేయి సాధించాడు. మొదటి నుంచి ఆధిపత్యం చూపాడు. దాన్నే కొనసాగిస్తూ ఐదో సెట్‍ను 6-3తో సొంతం చేసుకున్నాడు. దీంతో ఫైనల్‍లో విజయం సాధించి.. తన తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ దక్కించుకున్నాడు. తొలి రెండు సెట్లు కోల్పోయినా.. ఏ మాత్రం బెరకకుండా సత్తాచాటి వరుసగా మూడు సెట్లు గెలిచాడు సిన్నెర్.

సిన్నెర్‌కు భారీ ప్రైజ్‍మనీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన 22ఏళ్ల జానిక్ సిన్నెర్‌కు రూ.17.25 కోట్ల ప్రైజ్‍మనీ (31,50,000 ఆస్ట్రేలియా డాలర్లు) దక్కింది. రన్నరప్‍గా నిలిచిన డానిల్ మెద్వెదెవ్‍కు రూ.9.42 కోట్ల (17,25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు) ప్రైజ్‍మనీ సొంతమైంది.

తదుపరి వ్యాసం