తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wrestlers: రెజ్లర్లను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. పార్లమెంటు నూతన భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో నిర్బంధం

Wrestlers: రెజ్లర్లను ఈడ్చుకెళ్లిన పోలీసులు.. పార్లమెంటు నూతన భవనానికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో నిర్బంధం

28 May 2023, 17:20 IST

    • Wrestlers - New Parliament Building: నూతన పార్లమెంటు భవనానికి ర్యాలీకి వెళ్లేందుకు సిద్ధమైన రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా నిర్బంధించారు.
సాక్షి మాలిక్‍ను బలవంతంగా తీసుకెళుతున్న పోలీసులు
సాక్షి మాలిక్‍ను బలవంతంగా తీసుకెళుతున్న పోలీసులు (PTI)

సాక్షి మాలిక్‍ను బలవంతంగా తీసుకెళుతున్న పోలీసులు

Wrestlers - New Parliament Building: దేశానికి ప్రతిష్టాత్మక పతకాలను సాధించిన టాప్ రెజర్లను ఢిల్లీలో పోలీసులు నిర్భందించారు. పార్లమెంటు కొత్త భవనానికి ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించిన రెజర్లను నేడు (మే 28).. ఢిల్లీ పోలీసులు అడ్డుకొని నిర్బంధించారు. ఒలింపిక్స్, కామన్వెల్త్ లాంటి పతకాలను సాధించిన రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‍ను బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. ర్యాలీ చేసేందుకు ప్రతిఘటించిన రెజర్లను ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. మరికొందరు రెజర్లను కూడా పోలీసులు నిర్భందించి వేరే ప్రాంతానికి తీసుకెళ్లారు. జంతర్ మంతర్ వద్ద రెజర్ల ఆందోళన శిబిరాన్ని ఖాళీ చేశారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

లైగింక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‍ను అరెస్టు చేయాలని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సుమారు నెలకుపైగా ఆందోళన చేస్తూనే ఉన్నారు రెజర్లు. కాగా, ప్రభుత్వం స్పందించకపోవటంతో పార్లమెంటు నూతన భవనం ఎదుట మహిళా సమ్మాన్ పంచాయత్‍ను నేడు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పార్లమెంటు భవనం వైపు వెళుతుండగా.. ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు.

పార్లమెంటు కొత్త భవనం ఎదుట మహిళా సమ్మాన్ పంచాయత్‍ను నిర్వహిస్తామని చెప్పటంతో ఢిల్లీ పోలీసులు.. జంతర్ మంతర్ వద్ద ముందుగానే భారీగా మోహరించారు. మధ్యాహ్నం సమయంలో పార్లమెంటు వద్దకు వెళ్లేందుకు రెజర్లు సిద్ధమవుతుండగా.. జంతర్ మంతర్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. వినేశ్ ఫొగాట్, సంగీత ఫొగాట్.. బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించటంతో ఉద్రిక్తత పెరిగింది. వారితో పాటు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ సహా మరికొందరు రెజర్లను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి వేరే ప్రాంతాలకు పోలీసులు తీసుకెళ్లారు.

“ఆందోళనకారులందరినీ పోలీసులు బలవంతంగా బస్సుల్లో ఎక్కించి నిర్బంధించారు. శాంతి భద్రతల నిబంధనలను ఉల్లంఘించినందుకే వారిని (రెజర్లు) నిర్బంధించాం. విచారణ తర్వాత లీగల్ చర్యలు తీసుకుంటాం” అని శాంతి భద్రతల స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దీపేంద్ర పాఠక్ వెల్లడించారు.

రెజర్ల నిర్బంధాన్ని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీతో పాటు పలు ప్రతిపక్షాలకు చెందిన నేతలు ఖండించారు. “పట్టాభిషేకం అయిపోయింది. ఇక మోసపూరిత రాజు.. ప్రజల స్వరాన్ని నడివీధుల్లో నొక్కేస్తున్నారు” అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మరికొంత మంది కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

బీజేపీ ఎంపీగా ఉన్న డబ్ల్యూఎఫ్‍ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్‍పై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జనవరిలోనే రెజర్లు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. అయితే.. హామీ లభించటంతో విరమించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ఏప్రిల్ 23న జంతర్ మంతర్ వద్దే మరోసారి ఆందోళన ప్రారంభించారు రెజర్లు. అప్పటి నుంచి నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. బ్రిజ్ భూషణ్‍ను అరెస్ట్ చేసే వరకు ఉద్యమం ఆపబోమని స్పష్టం చేస్తున్నారు. రెజర్లకు చాలా పార్టీలు మద్దతు ప్రకటించాయి. రైతు సంఘాలు కూడా మద్దతునిచ్చాయి.

పార్లమెంటు నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.

తదుపరి వ్యాసం