తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  New York Flash Floods: భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిన అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్; నగరంలో ఎమర్జెన్సీ

New York Flash Floods: భారీ వర్షాలు, వరదలతో నీట మునిగిన అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్; నగరంలో ఎమర్జెన్సీ

HT Telugu Desk HT Telugu

30 September 2023, 12:00 IST

  • శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభ వృష్టి అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ను ముంచెత్తింది. న్యూయార్క్ నగరం దాదాపు నీట మునిగిన పరిస్థితి తలెత్తింది.

న్యూయార్క్ లో వరద పరిస్థితి
న్యూయార్క్ లో వరద పరిస్థితి (AP)

న్యూయార్క్ లో వరద పరిస్థితి

అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి నగరంలోని సబ్ వేలు నీట మునిగాయి. దాంతో సబ్ వే సిస్టమ్ కు అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలోనూ భారీగా వరద నీరు చేరింది. పలు విమానాలను రద్దు చేశారు. న్యూయార్క్ లోని లాగార్డియా ఏర్ పోర్ట్ లో పలు టర్మినల్స్ ను క్లోజ్ చేశారు. అక్కడి పరిస్థితులను ప్రయాణికులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఎమర్జెన్సీ

మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున వరద ముప్పు నేపథ్యంలో నగరంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని నగర ప్రజలకు సూచించారు. బ్రూక్లిన్ సహా పలు సబ్ వే స్టేషన్లు నీట మునిగాయని, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్ నిలిచిపోయిందని తెలిపారు. న్యూయార్క్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు తమ ప్రాంతంలోని వరద పరిస్థితిని వీడియోల ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్స్ ఏర్పడ్డాయి. లోతట్టు ప్రాంతాల్లోని దుకాణాల్లోకి వరద నీరు చేరింది.

ఇళ్లల్లోనే ఉండండి..

‘మీరు ఇళ్లల్లో ఉంటే ఇళ్లల్లోనే ఉండండి. ఆఫీస్ ల్లో ఉంటే సురక్షితమైన షెల్టర్ చూసుకోండి. కొన్ని సబ్ వేస్ వరద నీటిలో మునిగాయి. ప్రస్తుతం నగరంలో ప్రయాణాలు అంత సురక్షితం కాదు’ అని మేయర్ ట్వీట్ చేశారు. న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ జూ లో కి కూడా భారీగా వరద నీరు చేరింది. న్యూయార్క్ లో సుమారు 85 లక్షల మంది పౌరులు ఉంటారు. న్యూయార్క్ లో ప్రపంచంలోెనే అతిపెద్ద సబ్ వే సిస్టమ్ ఉంది. ఈ వరదలతో అందులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

తదుపరి వ్యాసం