తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro's Aditya-l1: ఆదిత్య ఎల్ 1 ప్రయోగం సక్సెస్; ఆదిత్య ఎల్ 1 లక్ష్యాలు ఇవే..

ISRO's Aditya-L1: ఆదిత్య ఎల్ 1 ప్రయోగం సక్సెస్; ఆదిత్య ఎల్ 1 లక్ష్యాలు ఇవే..

HT Telugu Desk HT Telugu

06 January 2024, 18:09 IST

  • ISRO's Aditya-L1: భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఉపగ్రహం ‘ఆదిత్య-ఎల్1’ విజయవంతంగా లాగ్రాంజ్ పాయింట్ 1 వద్ద నిర్దేశించిన కక్ష్యలోకి చేరుకుంది. ఈ మైలురాయిని సాధించినందుకు ఇస్రోను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

ఆదిత్య ఎల్ 1 ప్రయోగం (ఫైల్ ఫొటో)
ఆదిత్య ఎల్ 1 ప్రయోగం (ఫైల్ ఫొటో) (PTI)

ఆదిత్య ఎల్ 1 ప్రయోగం (ఫైల్ ఫొటో)

ISRO's Aditya-L1: అంతరిక్ష ప్రయోగ చరిత్రలో మరో మైలురాయిని ఇస్రో (ISRO) శనివారం అందుకుంది. సూర్యుడిని అధ్యయనం చేయడానికి ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహం విజయవంతంగా, సురక్షితంగా నిర్దేశిత లాగ్రేంజ్ పాయింట్ కక్ష్యలోకి చేరుకుంది. ఈ కక్ష్యలో ఆదిత్య ఎల్ 1 దాదాపు ఐదేళ్ల పాటు ఉంటుంది.

శుభవార్త..

ఈ ఘనతను సాధించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. ‘‘భారత్ మరో మైలురాయిని సృష్టించింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 (Aditya-L1) గమ్యస్థానానికి చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష ప్రయోగాలను సాకారం చేయడంలో మన శాస్త్రవేత్తల అలుపెరగని అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధారణ విజయాన్ని సాధించిన ఇస్రోకు అభినందనలు. మానవాళి ప్రయోజనాల కోసం సైన్స్ ను వినియోగించడాన్ని మేము కొనసాగిస్తాము" అని ప్రధాని మోడీ ట్వీటర్ లో పోస్ట్ చేశారు.

ఏమిటీ లాగ్రేంజ్ పాయింట్..?

భూమికి, సూర్యుడి మధ్య ఉన్న మొత్తం దూరంలో 1% దూరంలో లాగ్రేంజ్ పాయింట్ ఆర్బిట్ ఉంది. ఈ ఆర్బిట్ పాయింట్ వద్ద నుంచి సూర్యుడిని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతరం అధ్యయనం చేయవచ్చు. సూర్యుడిపై చోటు చేసుకునే వివిధ దృగ్విషయాలను, అంతరిక్ష వాతావరణంపై అవి చూపే ప్రభావాలను ఇక్కడి నుంచి స్పష్టంగా రికార్డు చేయవచ్చు.

శనివారం సాయంత్రం

శనివారం సాయంత్రం సరిగ్గా 4 గంటలకు ఆదిత్య ఎల్ 1 (Aditya-L1) ఉపగ్రహం విజయవంతంగా, సురక్షితంగా నిర్దేశిత లాగ్రేంజ్ పాయింట్ కక్ష్యలోకి చేరుకుంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా వెల్లడించింది. పీఎస్ఎల్వీ-సీ57 ద్వారా గత ఏడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఆదిత్య-ఎల్1 ను ఇస్రో ప్రయోగించింది. అనంతరం, అంతరిక్షంలో సూర్యుడి దిశగా 63 నిమిషాల 20 సెకన్ల పాటు ప్రయాణించి, భూమి చుట్టూ 235×19500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వ్యోమనౌక వరుస విన్యాసాలు చేసి, భూమ్యాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని సన్-ఎర్త్ లాగ్రేంజ్ పాయింట్ 1 (L1) కు చేరుకుంది.

7 పేలోడ్స్ తో..

విద్యుదయస్కాంత, కణ, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లను ఉపయోగించి ఫోటోస్ఫియర్, క్రోమోస్పియర్, సూర్యుడి బాహ్య పొరలను (కరోనా) పరిశీలించడానికి ఈ ఆదిత్య ఎల్ 1 లో ఏడు పేలోడ్లను అమర్చారు. వీటిలో నాలుగు పేలోడ్లు సూర్యుడిని ప్రత్యక్షంగా అధ్యయనం చేస్తాయి. మిగిలిన మూడు పేలోడ్లు లాగ్రేంజ్ పాయింట్ సౌర వాతావరణంపై అంతర్గత అధ్యయనాలను నిర్వహిస్తాయి. ఈ పేలోడ్స్ కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ-ఫ్లేర్, ఫ్లేర్ కార్యకలాపాలను, వాటి లక్షణాలను, ప్రభావాలను అధ్యయనం చేస్తాయి.

ప్రధాన లక్ష్యం

సౌర ఎగువ వాతావరణం (క్రోమోస్పియర్ మరియు కరోనా) డైనమిక్స్ అధ్యయనం, క్రోమోస్ఫెరిక్ మరియు కరోనల్ హీటింగ్ అధ్యయనం, పాక్షిక అయనీకరణ చెందిన ప్లాస్మా అధ్యయనం, కరోనల్ మాస్ ఎజెక్షన్స్, కరోనల్ మాస్ ఫ్లేర్స్ పరిశీలన, ప్లాస్మా వాతావరణాన్ని పరిశీలించడం, సూర్యుడి నుంచి కణ డైనమిక్స్ అధ్యయనానికి డేటాను అందించడం.. మొదలైనవి ఆదిత్య-ఎల్ 1 మిషన్ ప్రధాన లక్ష్యాలు .

టాపిక్

తదుపరి వ్యాసం