తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gyanvapi Mosque Case: జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హై కోర్టు కీలక తీర్పు

Gyanvapi mosque case: జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హై కోర్టు కీలక తీర్పు

HT Telugu Desk HT Telugu

19 December 2023, 21:21 IST

  • Gyanvapi mosque case: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో గతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ హిందూ వర్గం దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ ముస్లిం వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది.

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు (HT_PRINT)

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు

Gyanvapi mosque case: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో గతంలో ఉన్న హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ హిందూ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదే అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం (1991 Places of Worship Act) ఈ కేసుకు వర్తించదని పేర్కొంది.

1991 చట్టం ఏం చెబుతుంది?

బాబ్రీ మసీదు వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు 1991 ప్రార్థన స్థలాల చట్టం రూపొందింది. ఈ చట్టం ప్రకారం.. 1947 ఆగస్ట్ 15 నాటికి భారతదేశంలోని అన్ని ప్రార్థన స్థలాలు ఏ విధంగా ఉన్నాయో.. వాటిని అదే విధంగా కొనసాగించాలి. దీనికి అయోధ్యలోని బాబరీ మసీదు - శ్రీ రామ జన్మభూమి ఆలయానికి మాత్రం మినహాయింపును ఇచ్చారు.

సర్వే కొనసాగించవచ్చు..

కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) లో సైంటిఫిక్ సర్వే పూర్తయింది. ఆ సర్వే నివేదికను వారణాసిలోని స్థానిక కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ పలు కీలక ఆదేశాలను వెలువరించారు. కేసు విచారణను వేగవంతం చేసి ఆరునెలల్లో ముగించాలని ట్రయల్ కోర్టును ఆదేశించారు. జ్ఞానవాపి మసీదు గోడ ఏ ఒక్క మతానికి చెందిన దానిగా నిర్ధారించలేమన్నారు. అవసరమని భావిస్తే, మసీదు సర్వేను పురాతత్వ శాఖ అధికారులు కొనసాగించేలా విచారణ కోర్టు ఆదేశాలు ఇవ్వవచ్చని స్పష్టం చేసింది.

ముస్లిం వర్గాల పిటిషన్ కొట్టివేత..

ప్రస్తుతం జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రదేశంలో గతంలో హిందూ దేవాలయం ఉండేదని, అందుకు సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ మసీదులో ఉన్నాయని, అందువల్ల మళ్లీ ఆ ప్రదేశంలో హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అనుమతించాలని కోరుతూ హిందూ వర్గాలు వారణాసిలోని సివిల్ కోర్టులో పిటిషన్ వేశాయి. 1991 ప్రార్థన స్థలాల చట్టం ప్రకారం.. ఆ పిటిషన్ విచారణార్హం కాదని, అందువల్ల ఆ పిటిషన్ ను కొట్టివేసేలా ఆదేశాలివ్వాలని జ్ఞానవాపి మసీదును నిర్వహించే అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ (AIMC), ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హై కోర్టును కోరాయి. అయితే, వీరి అభ్యర్థనను, తాజాగా, అలహాబాద్ హై కోర్టు కోర్టు తిరస్కరించింది. వారి పిటిషన్లను కొట్టివేసింది. హిందూ వర్గాలు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదే అని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం ఈ కేసుకు వర్తించదని పేర్కొంది. ఈ పిటిషన్ ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది కాదని, దేశ విశాల ప్రయోజనాలకు సంబంధించినదని వ్యాఖ్యానించింది.

తదుపరి వ్యాసం