తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bitcoin Price : 22,400 డాలర్లకు పతనం.. క్రిప్టో కరెన్సీపై సెల్సియస్ దెబ్బ

Bitcoin price : 22,400 డాలర్లకు పతనం.. క్రిప్టో కరెన్సీపై సెల్సియస్ దెబ్బ

14 June 2022, 9:21 IST

    • బిట్‌కాయిన్ గడిచిన 24 గంటల్లో మరో 16 శాతం డౌన్ అయి 22,400 డాలర్లకు పడిపోయింది. 
బిట్ కాయిన్ సహా క్రిప్టోకరెన్సీల భారీ పతనం
బిట్ కాయిన్ సహా క్రిప్టోకరెన్సీల భారీ పతనం (REUTERS)

బిట్ కాయిన్ సహా క్రిప్టోకరెన్సీల భారీ పతనం

న్యూయార్క్, జూన్ 14: తీవ్రమైన మార్కెట్ పరిస్థితులను ఉటంకిస్తూ విత్‌డ్రాయల్స్ నిలిపివేస్తున్నట్టు ఓ క్రిప్టోకరెన్సీ ప్రకటించిన తరువాత సోమవారం సాయంత్రం బిట్‌కాయిన్ సహా అన్ని క్రిప్టోకరెన్సీలు మరింత దిగువకు పతనమయ్యాయి.

క్రిప్టోకరెన్సీ ఇండస్ట్రీలో ఓ ప్రధాన పిల్లర్ కుప్పకూలినట్టుగా భావిస్తున్నారు. ఇన్వెస్టర్ల వందల కోట్ల సంపదను తుడిచిపెట్టుకుపోయిన ఈ పరిస్థితి నియంత్రణ లేని ఈ పరిశ్రమలో ఇప్పుడు నియంత్రణ అవసరాన్ని గుర్తుకు తెచ్చేలా చేసింది.

సోమవారం సాయంత్రం (న్యూయార్క్ కాలమానం ప్రకారం) బిట్‌కాయిన్ 22,400 డాలర్లకు పతనమైంది. గడిచిన రోజులో దాదాపు 16 శాతం ఈ క్రిప్టో కరెన్సీ సంపద ఆవిరైపోయింది.

మరొక పాపులర్ కరెన్సీ అయిన ఇథీరియం సుమారు 17 శాతం పతనమైంది. డిజిటల్ కరెన్సీ, టెక్నాలజీ స్టాక్స్ తదితర రిస్కీ అసెట్స్‌ను ఇన్వెస్టర్లు తెగనమ్ముతున్నారు. ద్రవ్యోల్భణాన్ని నిలువరించేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో ఇన్వెస్టర్లు తమ రిస్కీ అసెట్స్ అమ్మేస్తున్నారు.

విత్‌డ్రాయల్ బాధ్యతలను దీర్ఘకాలంలో నిలబెట్టుకునేందుకు ప్రస్తుతం విత్‌డ్రాయల్స్, ట్రాన్స్‌ఫర్స్ నిలిపివేస్తున్నట్టు ఆదివారం క్రిప్టోకరెన్సీ లెండింగ్ ప్లాట్‌ఫామ్ సెల్సియస్ నెట్‌వర్క్ ప్రకటించింది. సెల్సియస్ క్రిప్టోకరెన్సీలో 1.7 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు. 10 బిలియన్ డాలర్లకు పైగా అసెట్స్ ఉన్నాయి. భవిష్యత్తులో యూజర్లు తమ ఫండ్స్ ఎప్పుడు వినియోగించుకోవచ్చో కూడా సెల్సియస్ ప్రకటించకపోవడం క్రిప్టో మార్కెట్లో ఆందోళన రేకెత్తించింది.

కస్టమర్స్ చేసిన డిపాజిట్లపై కంపెనీ ఉదారమైన రాబడినిచ్చింది. కొన్ని ఖాతాల్లో ఇది 19 శాతం వరకూ ఉంది. సెల్సియస్ ఈ డిపాజిట్లను సేకరించి వాటిని రుణాలుగా ఇచ్చి రాబడి పొందుతుంది.

సాధారణ మార్కెట్లు ఇవ్వలేనంతగా రాబడులను ఆఫర్ చేయడంతో సెల్సియస్ వంటి లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ ఇటీవల స్క్రుటినీకి వచ్చాయి. విమర్శకులు వీటిని పోంజీ స్కీమ్స్‌గా కూడా అభివర్ణించారు.

ఏడాది క్రితమే తన క్రిప్టో హోల్డింగ్స్‌పై అధిక రాబడులు ఇస్తానన్న సెల్సియస్‌ హామీలకు ఆకర్షితుడిని అయ్యానని 36 ఏళ్ల ఫ్రాన్సికో ఒర్డునా తెలిపారు.

‘యూజర్లు వారం వారం వడ్డీ రాబడులు పొందుతున్నందన ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఉన్న రిస్క్‌ను పెద్దగా పట్టించుకోలేదు..’ అని ఫ్రాన్సికో అన్నారు. గత వారమే ఆయన తన నిధులను సెల్సియస్ నుంచి వెనక్కి తీసుకున్నారు. అయితే కొన్ని నిధులు ఇప్పటికీ ఆ ప్లాట్‌ఫామ్‌లో ఇరుక్కుపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.

రెండు నెలల కాలంలో ఇలా కుప్పకూలిన క్రిప్టోకరెన్సీలో ఇది రెండోది. మే మాసం ఆరంభంలో స్టేబుల్‌కాయిన్ టెర్రా కూడా కుప్పకూలింది. ఇన్వెస్టర్ల వందల కోట్ల సంపద కొన్ని గంటల వ్యవధిలో ఆవిరైపోయయింది. కరెన్సీ, గోల్డ్ తదితర అసెట్స్‌ వెన్నుదన్నుగా ఉండే స్టేబుల్‌కాయిన్స్ కాస్త సేఫ్ అని భావించినప్పటికీ టెర్రా కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల ఆలోచన మారింది.

టెర్రా మాదిరిగానే సెల్సియస్ కూడా క్రిప్టోకరెన్సీ హోల్డర్స్‌కు సేఫ్ ప్లేస్ అని చెబుతూ డిపాజిట్లు సేకరించింది. సెల్సియస్ కూడా విఫలమవుతుండడంతో కంపెనీ వెబ్‌సైట్ యూజర్లకు ఓ ప్రకటన ఇచ్చింది. ‘మీ కాయిన్స్‌ ఎప్పుడైనా పొందండి.. వాటిని శాశ్వతంగా సురక్షితంగా ఉంచుకోండి..’ అని ప్రకటించింది.

‘మేం విభిన్న ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. ఈ ప్రక్రియకు కొంత సమయం అవసరం. కొంత జాప్యం జరగవచ్చు..’ అని సెల్సియస్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇన్వెస్టర్లును, డిపాజిటర్లను ఈ చర్య ఆశ్చర్యపరిచింది. తమ ఇన్వెస్ట్‌మెంట్లను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదని వారు ఆన్‌లైన్ చాట్‌లో ప్రశ్నించారు.

టెర్రా కుప్పకూలిపోవడంతో తాను సెల్సియస్ నుంచి కొంత నగదు ఉపసంహరించుకున్నట్టు ఫ్రాన్సికో చెప్పారు. సెల్సియస్ కొంత నగదును టెర్రాలో ఇన్వెస్ట్ చేశారని కొన్ని వార్తలు వెలువడ్డారు. అలాగే సెల్సియస్ డిపాజిటర్ల నిధులతో బాగా రిస్క్ చేస్తోందన్న ఆందోళన కూడా ఉండేది.

‘వారు ఇచ్చే ప్రతిఫలం దీర్ఘకాలంలో సుస్థిరంగా ఉంటుందా? అన్న ఆందోళన నాలో ప్రారంభమైంది..’ అని ఫ్రాన్సికో తెలిపారు.

అసలు సెల్సియస్ డిపాజిటర్లు తమ నిధులను వెనక్కి పొందుతారా లేదా అన్న అనిశ్చితి ఉంది. బ్యాంకు తరహాలో క్రిప్టోకరెన్సీపై ఎలాంటి నియంత్రణ లేదు. దీనికి డిపాజిట్ ఇన్సూరెన్స్ గానీ, ఎలాంటి చట్టబద్ధమైన ఫ్రేమ్ వర్క్ గానీ లేదు. దివాళా తరహాలో ఎవరు ముందుగా తమ నిధులు వెనక్కి పొందవచ్చు? తదితర అంశాలకు కూడా చట్టబద్ధమైన రక్షణ లేదు.

తదుపరి వ్యాసం