తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  శాలరీ ఇంక్రిమెంట్ సగటు 9 శాతం: రిపోర్ట్

శాలరీ ఇంక్రిమెంట్ సగటు 9 శాతం: రిపోర్ట్

HT Telugu Desk HT Telugu

07 April 2022, 12:30 IST

  • 2022లో వేతన పెరుగుదల సగటు 9 శాతం ఉండొచ్చని ఒక నివేదిక అంచనా వేసింది.

వేతన పెరుగుదల సగటు 9 శాతం ఉండొచ్చంటున్న నివేదిక
వేతన పెరుగుదల సగటు 9 శాతం ఉండొచ్చంటున్న నివేదిక (unsplash)

వేతన పెరుగుదల సగటు 9 శాతం ఉండొచ్చంటున్న నివేదిక

మరింత సానుకూల పెట్టుబడి వాతావరణం కారణంగా దేశంలోని సంస్థలు ఈ సంవత్సరం సగటున 9 శాతం జీతాల పెంపును ఇచ్చే అవకాశం ఉందని మైఖేల్ పేజ్ శాలరీ రిపోర్ట్ -2022  తెలిపింది.

2022లో సాధారణ జీతం పెరుగుదల సగటు 9 శాతం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు 2019 సంవత్సరంలో ఈ పెరుగుదల 7 శాతం ఉందని తెలిపింది.

స్టార్టప్‌లు, నూతన కార్పొరేట్ కంపెనీల్లో వేతన పెంపు 12 శాతం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం,  రియల్ ఎస్టేట్, తయారీ రంగం వృద్ధి చెందే రంగాల జాబితాలో ఉంటాయని తెలిపింది.

ఇ-కామర్స్, డిజిటలైజేషన్ దిశగా మారుతున్న ఇతర రంగాల వృద్ధి కారణంగా, కంప్యూటర్ సైన్స్ నేపథ్యం ఉండి అనుభవం ఉన్న నిపుణులు భారతదేశంలో అత్యధిక వేతనం పొందే అవకాశాలు విరివిగా కలిగి ఉంటారని తెలిపింది.

డేటా సైంటిస్టులు (ముఖ్యంగా మెషిన్ లెర్నింగ్ తెలిసిన వారు), వెబ్ డెవలపర్లు, క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లకు అధిక డిమాండ్ ఉంటుంది. ప్రత్యేకించి వారు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంటే మంచి డిమాండ్ ఉంటుందని నివేదిక పేర్కొంది.

టెక్ నిపుణుల సగటు జీతం ఇతర ఉద్యోగ విధుల్లో సమాన విద్యార్హతలు కలిగిన నిపుణుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది.

భారతదేశంలోని కంపెనీలు, నెట్‌వర్క్ నుంచి పొందిన సమాచారం, వాస్తవాలపై  ఆధారపడి మైఖేల్ పేజ్ శాలరీ రిపోర్ట్ 2022 రూపొందింది. ఇందులో ఉద్యోగ ప్రకటనలు, 2021లో ప్లేస్‌మెంట్‌లు, 2022కి సంబంధించిన జీతాల అంచనాలు ఉన్నాయి.

నైపుణ్యం ఉంటే ఇంక్రిమెంట్ల జోరు..

కంపెనీలు ఇప్పుడు అనేక ఆఫర్లతో టాప్ పర్ఫార్మర్లను కొనసాగించాలని చూస్తున్నాయని నివేదిక తెలిపింది. తక్కువ వ్యవధితో కూడిన అప్రయిజల్ సైకిల్స్, ప్రమోషన్లు, వేరియబుల్ పే-అవుట్‌, స్టాక్ ఇన్సెంటివ్‌లు, రిటెన్షన్ బోనస్‌ వంటి అనేక ఆఫర్‌లతో టాప్ పర్ఫార్మర్లను కొనసాగించాలని చూస్తున్నాయని నివేదిక పేర్కొంది.

మార్కెట్‌పై మహమ్మారి గణనీయమైన ప్రభావం ఉంటుందని సంస్థలు భావించడం లేదని, భవిష్యత్తు వ్యాపార ప్రణాళికల గురించి ఉత్సాహంగా ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.

మెరుగైన పనితీరు కనబరిచే వ్యక్తులు, సముచిత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు సగటు కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లను (కేస్-బై-కేస్ ప్రాతిపదికన 20-25 శాతం లేదా అంతకంటే ఎక్కువ) ఆశించవచ్చు. ఎందుకంటే చాలా సంస్థలు తమ అత్యుత్తమ ప్రతిభను నిలుపుకోవడంలో చురుగ్గా ఆలోచిస్తున్నాయని నివేదిక తెలిపింది.

‘అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడానికి, నియమించుకోవడానికి కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీపడటంతో రిక్రూట్‌మెంట్ మార్కెట్ అద్భుతంగా పుంజుకుంది. పెరుగుతున్న అట్రిషన్, టాలెంట్ కొరత, డిమాండ్‌కు తగ్గ నైపుణ్యాల కొరత వంటి అంశాలు ప్రధానంగా జీతాలను పెంచేందుకు దోహదపడుతున్నాయి..’ అని మైఖేల్ పేజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ తెలిపారు.

టాపిక్

తదుపరి వ్యాసం