తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  తాలిబన్లపై అఫ్గాన్​ మహిళల తిరుగుబాటు​..! ఆ రూల్​పై కోపంతోనే..

తాలిబన్లపై అఫ్గాన్​ మహిళల తిరుగుబాటు​..! ఆ రూల్​పై కోపంతోనే..

HT Telugu Desk HT Telugu

22 May 2022, 19:08 IST

    • Afghan tv presenter | తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్​ మహిళలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రకరకాల ఆంక్షలతో తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. న్యూస్​ రీడర్లు.. ముఖానికి హిజాబ్​ కప్పుకుని వార్తలు చదవాలన్న ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా అక్కడి మహిళల్లో తీవ్ర ఆగ్రహం నెలకొంది. 'పోరాడతాము' అంటూ వారు నినాదాలు చేస్తున్నారు.
అఫ్గాన్​ న్యూస్​ రీడర్​
అఫ్గాన్​ న్యూస్​ రీడర్​ (AFP)

అఫ్గాన్​ న్యూస్​ రీడర్​

Afghan tv presenter | అఫ్గానిస్థాన్​ను దక్కించుకున్న తాలిబన్లు.. ఇష్టానుసారంగా ఆదేశాలు జారీ చేస్తూ.. అక్కడి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై ఆంక్షలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. మహిళలు.. బహిరంగ ప్రదేశాల్లో ముఖాలు కప్పుకోవాలని ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది తాలిబన్​ ప్రభుత్వం. ఇది.. అఫ్గాన్​ వార్తా సంస్థల్లో పనిచేస్తున్న న్యూస్​ రీడర్లకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ వ్యవహారంపై మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. తమ హక్కుల కోసం పోరాడతామని న్యూస్​ రీడర్లు తేల్చిచెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Gratuity limit: డీఏ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త; గ్రాట్యుటీ పరిమితిని కూడా పెంచిన ప్రభుత్వం

Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు ప్రణాళిక; పాక్ నుంచి ఏకే-47 ఆర్డర్; నిందితుల అరెస్ట్

JEE Advanced 2024 : రేపు.. జేఈఈ అడ్వాన్స్​డ్​ ఆన్సర్​ కీ విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Manipur floods : మణిపూర్​లో వరద బీభత్సం.. లక్షలాది మందిపై ప్రభావం!

‘బలంవంతం చేశారు..’

న్యూస్​ రీడర్లు ముఖానికి హిజాబ్​ వేసుకోవాలని ఇటీవలే ఆదేశాలు అందాయి. శనివారం వరకు ఎవరు వేసుకోలేదు. కానీ ఆదివారం నాడు.. అన్ని ప్రముఖ వార్తా సంస్థల్లోని మహిళా న్యూస్​​ రీడర్లు పూర్తి హిజాబ్​తో కనిపించారు. కేవలం కళ్లు మాత్రమే కనిపించే విధంగా హిజాబ్​ ధరించి.. న్యూస్​ చదివారు.

దీనిపై న్యూస్​ రీడర్లు తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

"మా మీద ఈరోజున ఆంక్షలు రుద్దారు. కానీ మేము వెనకడుగు వేయము. మా హక్కుల కోసం పోరాడతము. ఈ ఆదేశాలతో నేను ఏడవను. అఫ్గాన్​ బాలికల గంతుగా నిలిచి పోరాడతాను. ఇలా చేస్తే.. మహిళా జర్నలిస్టులు ఉద్యోగాలు వదిలేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. కానీ అలా జరగదు. బలవంతంగా మమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే తప్ప.. మేము మా పని చేసుకుంటూనే ఉంటాము," అని టీఓఎల్​ఓ న్యూస్​ రీడర్​ సోనియా నైజి వెల్లడించారు.

Taliban new rules | "మా ఇష్టంతో హిజాబ్​ వేసుకోలేదు. బలవంతం చేశారు కాబట్టే ధరించాము. తాలిబన్ల పాలనలో పని చేయడం చాలా కష్టంగా ఉంది. కానీ మేము పోరాడతాము," అని మరో న్యూస్​ ప్రెజంటర్​ తెలిపారు.

గతంలో మహిళా న్యూస్​ రీడర్లు కేవలం హెడ్​స్కార్ఫ్​లు మాత్రమే ధరించే వారు. ఇక ఇప్పటి నుంచి పూర్తిగా హిజాబ్​ ధరించడం తప్పడం లేదు.

కాగా.. మహిళా జర్నలిస్టులకు సానుభూతిగా.. పురుషులు మాస్క్​ వేసుకునే న్యూస్​ చదివారు.

'మాకు ఆ ఉద్దేశం లేదు..'

ఈ వ్యవహారంపై తాలిబన్ల ప్రతినిధి అకీఫ్​ సాదిఖ్​ స్పందించారు. మీడియా ఛానెళ్లు.. తమ ఆదేశాలను పాటిస్తుండటం సంతోషకరం అన్నారు. మహిళా న్యూస్​ రీడర్లకు తాము వ్యతిరేకం కాదని తెలిపారు. మహిళల హక్కులను హరింపజేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.

కాగా ఈ ఆదేశాలు మీడియాలోనే కాకుండా.. ప్రభుత్వ కార్యాలయాలకు కూడా జారీ అయ్యాయి. మహిళలు కచ్చితంగా.. పూర్తిగా హిజాబ్​ ధరించాలని చెబుతున్నారు. ఒక వేళ ఆదేశాలను అతిక్రమిస్తే.. వారి భర్తలు, తండ్రులపై.. సస్పెన్షన్​ వేటు పడుతుందని హెచ్చరిస్తున్నారు.

'మహిళలు.. పురుషులు వేరువేరుగా..'

Afghanistan crisis | ఆకలి, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగంతో విలవిలాడుతున్న అఫ్గానిస్థాన్​​.. తాలిబన్ల ఆంక్షలు, కఠిన నిబంధనలతో ఉక్కిరిబిక్కరి అవుతోంది. తాజాగా.. తాలిబన్లు విధించిన ఓ నిబంధన వెలుగులోకి వచ్చింది. హోటళ్లకు వెళితే, పురుషులు- మహిళలు కలిసి కూర్చోకూడదని ఆదేశాలు జారీ చేసింది తాలిబన్​ ప్రభుత్వం.

పురుషులు.. కుటుంబసభ్యులతో రెస్టారెంట్లకు వెళ్లొచ్చని, కానీ వారితో కలిసి భోజనం చేయకూడదని తాలిబన్​ మినిస్ట్రీ ఆఫ్​ ప్రమోషన్​ ఆఫ్​ వర్చ్యూ అండ్​ ప్రివెన్షన్​ ఆఫ్​ వైస్​ శాఖ.. ఆదేశాలిచ్చింది. అది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. భార్యభర్తలే అయినప్పటికీ.. ఇద్దరు కలిసి ఒకేచోట కూర్చోకూడదని తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని అఫ్గాన్​లోని ఖామ్​ ప్రెస్​ వార్తా సంస్థ వెల్లడించింది.

"హెరాత్​ రాష్ట్రంలోని ఓ రెస్టారెంట్​కు.. నేను నా భర్తతో కలిసి వెళ్లాను. మా ఇద్దరిని వేరువేరు చోట్ల కూర్చోబెట్టారు. తాలిబన్ల ఆదేశాలని చెప్పారు," అని ఓ మహిళ వెల్లడించింది.

అంతేకాదు.. హెరాత్​లోని పార్కుల్లో కూడా పురుషులు, మహిళలను వేరుచేసేసింది తాలిబన్​ ప్రభుత్వం. మహిళలు గురువారం, శుక్రవారం, శనివారం మాత్రమే పార్కులకు వెళ్లాలి. అప్పుడు పురుషులకు అనుమతి ఉండదు. మిగిలిన రోజుల్లో పురుషులు ఎప్పుడైనా పార్కులకు వెళ్లొచ్చు.

తదుపరి వ్యాసం