'వన్​ కిడ్నీ విలేజ్​'.. ఆక్కడ అవయవాలు అమ్ముకుంటేనే పూటగడిచేది!-afghans sell kidneys to feed their children and survival ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Afghans Sell Kidneys To Feed Their Children And Survival

'వన్​ కిడ్నీ విలేజ్​'.. ఆక్కడ అవయవాలు అమ్ముకుంటేనే పూటగడిచేది!

Sharath Chitturi HT Telugu
Mar 01, 2022 09:02 PM IST

Afghan crisis | ప్రపంచవ్యాప్తంగా.. ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య ప్రతియేటా పెరిగిపోతోంది. ముఖ్యంగా యుద్ధ విచ్ఛిన్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ పతనమై, పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అఫ్గానిస్థాన్​ది సైతం ఇదే దుస్థితి. బ్రతుకుదెరువు కోసం, ఆకలితో అలమటిస్తున్న పిల్లల కడుపు నింపేందుకు.. అక్కడి ప్రజలు కిడ్నీలు అమ్ముకుంటున్నారు.

తనకు జరిగిన కిడ్నీ ఆపరేషన్​ను చూపిస్తున్న ఓ అఫ్గాన్​వాసి
తనకు జరిగిన కిడ్నీ ఆపరేషన్​ను చూపిస్తున్న ఓ అఫ్గాన్​వాసి (AFP)

Afghan humanitarian crisis | అఫ్గానిస్థాన్​ ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. బ్రతుకుదెరువు కోసం, ఆకలితో అలమటిస్తున్న పిల్లల కడుపు నింపడం కోసం.. ఆ దేశ ప్రజలు కిడ్నీలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రజాస్వామ్య పాలనను కూల్చేసిన తాలిబన్లు.. గతేడాది ఆగస్టులో అఫ్గాన్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటికే దారుణంగా ఉన్న అఫ్గాన్​ ఆర్థిక వ్యవస్థ.. ఆ తర్వాత మరింత పతనమైంది. ప్రపంచ దేశాలు తాలిబన్ల పాలనపై అంక్షలు విధించారు. అమెరికా సైతం కఠిన ఆంక్షలు వదిలింది. ఈ పరిణామాలు ఆ దేశంలో మానవతా సంక్షోభానికి దారితీసింది. తీవ్ర అప్పులు, పేదరికం, నిరుద్యోగం కారణంగా.. అవయవాలను అమ్ముకోవడం తప్ప అక్కడి ప్రజలకు వేరే ఆప్షన్​ కూడా కనిపించకుండా పోయిందంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

One kidney village | అఫ్గాన్​లో కిడ్నీ అమ్మకాలు అక్రమంగా సాగుతున్నాయి. హెరాత్​ ప్రాంతంలో అయితే అమ్మకాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాంతానికి 'వన్​ కిడ్నీ విలేజ్​'గా స్థానికులు పేరు పెట్టి జోకులు వేసుకుంటున్నారు. ఇలా కిడ్నీలు అమ్ముకుంటున్న వారిలో వేలాదిమంది నిరుద్యోగులే ఉన్నారు.

కిడ్నీలు అమ్ముకుని లక్షాధికారులు అయిపోతున్నారేమో! అనుకుంటే పొరబడినట్టే. చాలా మంది తమ కిడ్నీలను చాలా తక్కవకు.. రూ. 1,500కే అమ్మేస్తున్నారు.

"అవయవాల అమ్మకాలకు ఎలాంటి చట్టం లేదు. ఇచ్చేవారి అంగీకారం ఉంటే చాలు.. ఇష్టం వచ్చిన ధరకు కొనుగోలు చేయవచ్చు," అని ఓ ఆసుపత్రి వైద్యుడు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించాడు.

చట్టాలు లేకపోయినా.. కిడ్నీ అమ్మకాలకు మాత్రం అఫ్గానిస్థాన్​లో ఓ పెద్ద వ్యవస్థే ఉంది. ధనిక పేషెంట్లకు బ్రోకర్లు వల వేస్తారు. వారి అవసరాలకు తగ్గట్టుగా హెరాత్​లో కిడ్నీలు అమ్మేవారిని పట్టుకుంటారు. ఒక్కోసారి.. ఇండియా, పాకిస్థాన్​ నుంచి కూడా పేషెంట్లు వస్తుంటారు. ఆసుపత్రి ఖర్చులతో పాటు కిడ్నీ ఇచ్చినవారికి డబ్బులు కూడా పేషెంట్లే చెల్లిస్తారు.

సాధారణంగా.. కిడ్నీలు ఇచ్చిన వారు, తీసుకున్నవారు.. ఆపరేషన్​ తర్వాత వైద్య పర్యవేక్షణలో ఉంటారు. కానీ పేద అఫ్గాన్​లకు ఆ సదుపాయం కూడా లేదు. కిడ్నీలు అమ్ముకున్నా.. ఇంకా పేదరికంలోనే అలమటిస్తూ ఉంటారు. ఒక్కోసారి.. తీవ్ర అనారోగ్యం పాలవుతూ ఉంటారు.

అఫ్గాన్​లోని 38మిలియన్​ మంది జనాభాలో సగానికిపైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు 9మిలియన్​ మంది అఫ్గానీలు.. కరవుతో కొట్టుమిట్టాడుతున్నట్టు ఐరాస పేర్కొంది. వారిని ఆదుకునేందుకు ఐరాస చేపట్టిన కార్యక్రమాలు సైతం నిధులు లేక నిలిచిపోతున్న దుస్థితి ఏర్పడింది. తమను ఆ అల్లా రక్షించాలని ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

IPL_Entry_Point