తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Scrubs For Soft Feet: అందమైన పాదాల కోసం ఈ 4 స్క్రబ్‌లను ప్రయత్నించండి

Scrubs for soft feet: అందమైన పాదాల కోసం ఈ 4 స్క్రబ్‌లను ప్రయత్నించండి

31 October 2023, 18:30 IST

  • Scrubs for soft feet: శీతాకాలం మొదలవగానే పాదాల్లో పగుళ్లు ఎక్కువవుతాయి. ఇంట్లోనే కొన్ని స్క్రబ్స్ తయారు చేసుకుని వాడితే నున్నటి పాదాలు మీసొంతం. అవేంటో చూసేయండి. 

పాదాలకు స్క్రబ్స్
పాదాలకు స్క్రబ్స్ (freepik)

పాదాలకు స్క్రబ్స్

మనం నిలబడాలన్నా, నడవాలన్నా.. మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవాలు పాదాలు. అయితే కాళ్లను ఎవ్వరూ సరిగ్గా పట్టించుకోరనే చెప్పాలి. అందుకనే మృత కణాలు అక్కడ ఎక్కువగా పేరుకుపోతాయి. ఫలితంగా పాదాలు దుర్వాసన రావడం, దళసరిగా అయిపోవడం, పగుళ్లు రావడం లాంటి అనేక సమస్యలు వస్తుంటాయి. మరి సున్నితంగా, అందమైన పాదాలను సొంతం చేసుకోవాలంటే కొన్ని సహజమైన స్క్రబ్‌లను ప్రయత్నించవచ్చు. అవేంటో వాటి వల్ల ప్రయోజనాలేంటో ఇక్కడున్నాయి చదివేయండి.

ఫూట్‌ స్క్రబ్స్‌ వల్ల ప్రయోజనాలు :

పాదాల్లోకి రక్త ప్రసరణ మెరుగ్గా అవుతుంది. నొప్పుల్లాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయి. పాదాల్లో పేరుకున్న మురికి, మృత కణాలు తొలగిపోతాయి. పాదాలకు కొద్దిపాటి మర్దనా వల్ల మెదడూ ప్రశాంతంగా మారుతుంది. అస్తమానూ నడవడం, నొప్పి కలిగించే చెప్పులను వేసుకోవడం వల్ల వచ్చే బాధల నుంచి విముక్తి కలుగుతుంది. సూర్యరశ్మి తగిలి నల్లగా ట్యాన్‌ అయిన పాదాలు కాస్త తెలుపు రంగులోకి మారతాయి.

స్క్రబ్‌ 1 :

మనం కాఫీ తాగిన తర్వాత వచ్చే కాఫీ పొడి ఉంటుంది కదా. దానికి సమ పాళ్లలో పంచదారను కలపండి. కొద్దిగా కొబ్బరి నూనెనుగాని, ఆలివ్‌ ఆయిల్‌ని గాని కలిపి పేస్ట్‌లా చేసి పాదాలకు పట్టించండి. గుండ్రగా మర్దనా చేస్తూ పాదాలు, మడమల దగ్గర ఎక్కువగా దృష్టి పెట్టండి. పది నిమిషాల తర్వాత కడిగేసుకోండి. కాళ్లు, పాదాలూ సున్నితంగా మారడాన్ని మీరే గమనిస్తారు.

స్క్రబ్‌ 2 :

బ్రౌన్‌ షుగర్‌ని తీసుకోండి. మామూలు పంచదారతో పోలిస్తే బ్రౌన్‌ షుగర్‌ తొందరగా కరిగిపోతుంది. అలాగే మృదువుగానూ ఉంటుంది. దీనికి కాస్త ఆలివ్‌ నూనెను చేర్చి కాళ్లకు మసాజ్‌లా చేసుకుని స్క్రబ్‌ చేసుకోండి. దీని వల్ల పాదాలు మృదువుగా, కాంతివంతంగా తయారవుతాయి.

స్క్రబ్‌ 3 :

ఎప్సమ్‌ సాల్ట్, పంచదార, కొబ్బరి నూనె, టీ స్పూన్‌ తేనె, ఐదు చుక్కల తాజా నిమ్మరసాన్ని తీసుకోండి. వీటన్నింటినీ బాగా కలిపి పేస్ట్‌లా చేసుకోండి. వీలైతే రెండు చుక్కల లెమన్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌నీ వేసుకోండి. వాటిని పాదాలకు రాసుకుని కాసేపు అలా వదిలేయండి. తర్వాత స్క్రబ్‌ చేసుకుంటే పాదాలు సున్నితంగా మారతాయ

స్క్రబ్‌ 4 :

రోజులో చాలా ఎక్కువ సేపు నిలబడి ఉన్నప్పుడు పాదాలు నొప్పులు పుడతాయి. అలాంటప్పుడు బేకింగ్‌ సోడా స్క్రబ్‌ని ప్రయత్నించవచ్చు. రెండు స్పూన్ల బేకింగ్‌ సోడాకి సరిపడా నీటిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్ని పాదాలకు మెల్లిగా మసాజ్‌ చేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. లేదంటే గోరు వెచ్చని నీటిలో బేకింగ్ సోడా వేసి కాళ్లను పది నిమిషాల పాటు అందులో పెట్టుకోవాలి. తర్వాత కడిగేసుకోవాలి. నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా కాళ్లలో పేరుకుపోయిన మురికి వదిలిపోతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం