తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Spices: లవంగాలు, ఫూల్ మఖానా, దాల్చిన చెక్క..ఎక్కడినుంచి వస్తాయో తెలుసా?

spices: లవంగాలు, ఫూల్ మఖానా, దాల్చిన చెక్క..ఎక్కడినుంచి వస్తాయో తెలుసా?

22 May 2023, 14:33 IST

  • spices: లవంగాలు, ఫూల్ మఖానా, దాల్చిన చెక్క చెట్టులోని ఏ భాగం నుంచి వస్తుంది. వాటిని ఎలా తయారీ చేస్తారో.. ఆసక్తికర విషయాలు తెలుసుకోండి. 

తామర గింజలు
తామర గింజలు (pexels)

తామర గింజలు

మనం రోజూ చూసే కొన్ని దినుసులు ఎలా తయారు చేశారు? ఎక్కడి నుంచి వస్తాయివీ అనే సందేహాలుంటాయి. ఫూల్ మఖానా, లవంగం, దాల్చిన చెక్క.. ఇవన్నీ చెట్టులోని ఏ భాగం నుంచి వస్తాయో, ఎలా చేస్తారో చూద్దాం. వాటిని మన దగ్గరికి చేర్చేవరకు ఏం జరుగుతుందో తెలుసుకోండి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

లవంగాలు:

తాజా లవంగ మొగ్గలు

లవంగం అంటే మొగ్గ. అందుకే కొన్ని చోట్ల దాన్ని లవంగ మొగ్గ అని పిలుస్తారు కూడా. చెట్టు పెట్టిన ఆరేడేళ్లకు లవంగం చెట్టు పూతకొస్తుంది. మొగ్గల నుంచి ఊదారంగు పువ్వులు రాకముందే వీటిని చెట్టునుంచి తెంపేస్తారు. ముదురు ఆకుపచ్చగా ఉన్నమొగ్గలు కాస్త పసుపు, గులాబీ రంగులతో కనిపిస్తే ఇక వాటిని చెట్టునుంచి తెంపేయొచ్చు. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. వాటిని ఒక్కొక్కటి తెంపి చేయితోనే మొగ్గలు తెంపుతారు. కనీసం నాలుగైదు రోజులు ఎండబెడితే మొగ్గ బ్రౌన్ రంగు లోకి మారిపోతుంది. దాంట్లో తేమంతా పోయే వరకు ఎండబెడితే తొందరగా విరిగిపోతాయి. కనీసం 8 నుంచి 10 శాతం తేమ ఉన్నప్పుడు వాటిని ప్యాకింగ్ చేసి మనదాకా చేరుస్తారు.

దాల్చిన చెక్క:

చెక్క వచ్చేది చెట్టు బెరడు నుంచే కదా.దాల్చిన చెక్క కూడా చెట్టు బెరడే. ముందుగా చెట్టు కాండం మీద ఉన్న ఒక పలుచని పొరను తొలగించడంతో దీని తయారీ మొదలవుతుంది. ఆ తరువాత మందంగా ఉన్న పొరే దాల్చిన చెక్క. మధ్యలో ఉన్నదంతా చెక్క మాత్రమే. దాల్చిన చెక్క పొరను తీయడానికి అక్కడక్కడా గాట్లు పెట్టుకుంటూ ఒకే పొడవులో బెరడు తీస్తారు. వాటిని ఎండలో ఆరబెడతారు. ఈ తయారీలో ముక్కలైన వాటిని పొడి చేసి దాల్చిన చెక్క పొడిగా మార్కెట్లోకి తీసుకొస్తారు. లేదా దాల్చిన చెక్క నూనె కోసం వాడతారు.

ఫూల్ మఖానా:

తెల్లగా, పాప్‌కార్న్ లాగా ఉండే ఈ గింజల సాగు, తయారీ చాలా కష్టం. వీటిని ఇంగ్లీషులో ఫాక్స్ నట్స్ అంటారు. ఇది చెరువుల్లో, నీటి మడుగుల్లో మాత్రమే పండించే పంట. తామర పూలలాగే ఉండే ఒక పూవు రకం నుంచి ఈ గింజలొస్తాయి. వీటి బరువు ఎక్కువగా ఉండటం వల్ల చెరువు కిందికి పడిపోతాయి. ఆ గిజంలన్నింటినీ ఏరి, ఎండబెడతారు. చాలా పనుల తరువాత శుభ్ర పరిచిన గింజల్ని ఎక్కువ వేడి మీద వేయిస్తారు. ఆ వేడికి పాప్ కార్న్ లాగే పగిలి బయట ఉన్న నల్లటి పొర పోతుంది. తెల్లటి గింజల్ని మనదాకా చేరుస్తారు. చాలా మంది వీటిని తామర పువ్వు నుంచి వచ్చిన గింజలని అనుకుంటారు. పేరులో తామర ఉంది కానీ.. ఇది తామర లాగే ఉండే ఒక రకం వాటర్ లిల్లీ నుంచి వచ్చిన గింజలు. తామర గింజలు వేరు, ఫూల్ మఖానా వేరు.

టాపిక్

తదుపరి వ్యాసం