తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Gifts 2023: మీ ప్రియమైన వారికి దీపావళికి ఏం బహుమతి ఇద్దామా? అని ఆలోచిస్తున్నారా?

Diwali Gifts 2023: మీ ప్రియమైన వారికి దీపావళికి ఏం బహుమతి ఇద్దామా? అని ఆలోచిస్తున్నారా?

HT Telugu Desk HT Telugu

08 November 2023, 18:00 IST

  • Diwali Gifts 2023: దీపావళి రోజున మీ బంధువులకు, స్నేహితులకు ఏ బహుమతి ఇవ్వాలా అనే సందేహంలో ఉన్నారా? అయితే ఈ మంచి ఆప్షన్లేంటో చూసేయండి. మీకిష్టమైన వాళ్ల ముఖంలో ఆనందం చూసేయండి.

దీపావళి కానుకలు
దీపావళి కానుకలు (pexels)

దీపావళి కానుకలు

దీపావళి అంటేనే టపాకాయలు.. కొత్త దుస్తులు.. బహుమానాలు.. తీపి వంటకాలు.. వీటిలో ఏది లేకపోయినా వెలితిగానే ఉంటుంది. ఇక బహుమతుల విషయానికి వచ్చేస్తే దీపావళి సందర్భంగా అటు మిఠాయి దుకాణాలు, ఇటు దుస్తుల దుకాణాలు, ఇంకా సూపర్‌ మార్కెట్లలోనూ రకరకాల ఆఫర్లు పెడుతుంటారు. అయితే వాటిలో మంచి బహుమతుల జాబితా ఇక్కడుంది. మీ ప్రియమైన వారు మీరిచ్చిన బహుమతి చూసి వావ్‌ అనాలంటే వీటినీ ఒకసారి చెక్‌ చేసి అప్పుడు షాపింగ్‌కి వెళ్లండి.

చాక్లెట్లు:

బహుమతుల ప్రస్తావన వస్తే చాక్లెట్లు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. మీరు బహుమతి ఇవ్వాలనుకున్న వారు చిన్న వయసు వారు అయి ఉంటే గనుక మంచి చాక్లెట్ల ప్యాక్‌ని బహుకరించండి. వారి ముఖం దీపావళి మతాబులా వెలిగిపోతుంది. అయితే వారి ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధ వహించండి. తక్కువ చక్కెర ఉండే డార్క్ చాక్లెట్ల లాంటి వాటిని ఇచ్చే ప్రయత్నం చేయండి.

నాణేలు :

మీరు కాస్త ఖరీదైనా విలువైన బహుమతిని ఇవ్వాలనుకుంటున్నట్లయితే బంగారం లేదా వెండి నాణేన్ని దీపావళి కానుకగా ఇవ్వండి. ఈ సమయంలో బంగారం కొనుక్కునే అలవాటు చాలా మందికి ఉంటుంది. నాణేలు కొని ఇస్తే తర్వాత వారు వాటిని ఎలా కావాలంటే అలా డిజైన్‌ చేయించుకుంటారు. వారి ఇష్టానికీ మీరు ప్రాధాన్యతను ఇచ్చినట్లుగా ఉంటుంది. వారి అభిరుచి మీకు బాగా తెలిసి ఉంటే మాత్రం నేరుగా ఆభరణాలనే కానుకగా ఇవ్వవచ్చు.

డ్రై ఫ్రూట్‌ బాక్స్‌:

మీకు ఇష్టమైన వారు తీపిని తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారా? అయితే మార్కెట్లలో రకరకాల డ్రై ఫ్రూట్లన్నీ కలిపి పెట్టిన నట్స్‌ హ్యాంపర్లు అందుబాటులో ఉంటున్నాయి. ఇవి తీపి తినాలన్న కోరికనూ తగ్గిస్తాయి. ఆరోగ్యాన్నీ కలిగిస్తాయి.

మేకప్ కిట్‌:

పండుగ సమయంలో మహిళలు, అమ్మాయిలు అందంగా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకోసం మీరు వారికి మంచి బ్రాండ్ల మేకప్ కిట్‌ని ఇచ్చి చూడండి. వారి ఆనందానికి అవధులు ఉండవు. వాటితో చక్కగా ముస్తాబై కనువిందు చేస్తారు.

డిన్నర్‌ సెట్లు:

దీపావళి సందర్భంగా రకరకాల డిన్నర్‌ సెట్లపై మంచి మంచి ఆఫర్లను పెడుతూ ఉంటారు. నిజానికి పింగాణీ వాటిలో తినడం వల్ల భోజనం మరింత రుచి పెరిగినట్లు మనకు అనిపిస్తుందట. మనం ఇంకా ఎక్కువ ఆనందంగా భోజనం చేస్తామని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అందుకనే ఇంట్లో అవసరం ఉంది అనుకుంటే మంచి సిరామిక్‌ డిన్నర్‌ సెట్లను ఎంపిక చేసి బహుకరించండి. బంధువులు ఎవరైనా దీపావళికి భోజనానికి వచ్చినా వీటిల్లో వడ్డించడానికి ఎంతో బాగుంటుంది.

తదుపరి వ్యాసం