తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tips To Get Pregnant । ఆ సమయంలో కలిస్తే.. గర్భందాల్చే అవకాశాలు ఎక్కువ!

Tips to Get Pregnant । ఆ సమయంలో కలిస్తే.. గర్భందాల్చే అవకాశాలు ఎక్కువ!

HT Telugu Desk HT Telugu

15 July 2023, 19:30 IST

    • Tips to Get Pregnant: స్త్రీలు గర్భవతి అయ్యే అవకాశాలను ఎలా పెంచుకోవాలి? ఆరోగ్య నిపుణుల సూచనలు ఈ విధంగా ఉన్నాయి.
Tips to Get Pregnant
Tips to Get Pregnant (istock)

Tips to Get Pregnant

Tips to Get Pregnant: వివాహం అయిన దాదాపు ప్రతీ జంట, వారి కుటుంబాలు సంతానం కోసం ఆత్రుతగా ఉంటారు. తల్లిదండ్రులుగా మారడం అనేది జీవితంలో చాలా అందమైన విషయాలలో ఒకటి. అయితే, ఇది ప్రతి జంటకు ఇదేమి అంత సులభమైన విషయం కాదు. కొంతమంది పిల్లలు కలగాలని చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోతారు. మీరు కూడా పిల్లలు కానాలనే ఆలోచనలో ఉంటే, అందుకోసం సరైన ప్లాన్ కలిగి ఉండటం చాలా ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

పూణేలోని నోవా IVF ఫెర్టిలిటీ కేంద్రంలో ఫెర్టిలిటీ కన్సల్టెంట్ అయినటువంటి డాక్టర్ నిషా పన్సారే, ఆరోగ్యకరమైన గర్భాధారణ కోసం స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గర్భవతి అయ్యే అవకాశాలను ఎలా పెంచుకోవాలి? అనేది సూచించారు. ఆమె సూచనలు ఈ విధంగా ఉన్నాయి.

ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి

స్త్రీ ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉన్నప్పుడు గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి. పీడియాట్రిక్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలలో ఊబకాయం ఉంటే అది సంతానోత్పత్తి సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీరు అధిక బరువును కలిగి ఉన్నట్లయితే, రోజూ వ్యాయామం చేయడం, ఇతర అవసరమైన చర్యలు తీసుకుంటూ బరువు తగ్గాలి. ప్రతిరోజూ 30 నిమిషాల చురుకైన నడక, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ లేదా రన్నింగ్ చేయాలని డాక్టర్ పన్సారే సిఫార్సు చేస్తున్నారు.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

మీ సంతాన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. సాఫీగా గర్భం దాల్చేందుకు తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోండి. అదే సమయంలో జంక్, క్యాన్డ్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి. కెఫిన్‌ ఉత్పత్తులను కూడా తగ్గించాలి.

గర్భం ధరించడానికి సరైన సమయం తెలుసుకోండి

మీ ఋతు చక్రంలో మీరు గర్భవతి కావడానికి నిర్దిష్ట సమయం అనేది ఉంటుంది. కాబట్టి గర్భం ధరించడానికి సరైన సమయం ఏంటనేది తెలిసుండాలి. అండోత్సర్గము ప్రక్రియకు ముందు మీ యోని శ్లేష్మం స్పష్టంగా, మృదువుగా, జారేలా మారుతుంది. ఇది అండోత్సర్గము సమయంలో కలుసుకోవడానికి స్పెర్మ్ సులభంగా అండాన్ని చేరుకునేలా పైకి ఈదడానికి అనుమతిస్తుంది. గర్భవతి కావడానికి సెక్స్ చేయడానికి కూడా ఇదే ఉత్తమ సమయం అని డాక్టర్స్ చెబుతున్నారు. కాబట్టి, మీరు కలిసేటపుడు మీ అండోత్సర్గ చక్రం లేదా ఋతు క్యాలెండర్‌పై నిఘా ఉంచండి.

రసాయన ఉత్పత్తులను నివారించండి

మీరు గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, మీ గర్భధారణ అవకాశాలను అడ్డుకునే అనవసరమైన రసాయనాల నుండి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. డాక్టర్ పన్సారే ప్రకారం, కొన్ని ఉత్పత్తులలోని రసాయనాలు స్త్రీ ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి, గర్భవతి అయ్యే అవకాశాలను తగ్గిస్తాయి. రసాయనాలతో కూడిన ఉత్పత్తులను, కాస్మోటిక్స్ వంటివి ఉపయోగించకుండా ఉండటం మంచిది.

నోటి పరిశుభ్రత పాటించండి

అనేక అధ్యయనాల ప్రకారం, మీ నోటిలోని బాక్టీరియా మహిళల్లో వంధ్యత్వం ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రెగ్నెన్సీని కోరుకునే స్త్రీలు తమ నోటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని చెప్తున్నారు. చిగుళ్ల వ్యాధులు గర్భధారణ సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి, నిర్ణీత వ్యవధిలో దంతవైద్యుడిని సందర్శించండి.

అంతర్లీన వ్యాధులను చెకప్ చేసుకోండి

మీకు అంతర్లీనంగా ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నట్లయితే, అది మీ సంతానోత్పత్తి అవకాశాలను ప్రభావితం చేస్తుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PCOS), ఎండోమెట్రియోసిస్, మధుమేహం సహా క్లామిడియా వంటి లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు (STIలు) గర్భాన్ని నిరోధిస్తాయి. ఇటువంటి పరిస్థితులను వైద్యులను సంప్రదించి చికిత్స చేసుకోండి. మీరు పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే గర్భధారణ కోసం ముందుకు సాగండి. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏవైనా సప్లిమెంట్లను తీసుకోండి.

గర్భవతి కావడానికి కృషి అవసరం, కేవలం సెక్స్ గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడటం లేదు, పైన పేర్కొన్న అన్ని అంశాలు ఆరోగ్యకరమైన గర్భధారణకు దోహదం చేస్తాయి. కాబట్టి, మీరు విజయవంతంగా గర్భం దాల్చాలనుకుంటే, ప్రీ కన్సెప్షన్ చెక్‌లిస్ట్‌లోని అన్ని విషయాలను సరిచేసుకొని సిద్ధంగా ఉండండి.

తదుపరి వ్యాసం