తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Loan Tax Benefits | హోం లోన్‌పై ఇన్‌కమ్ టాక్స్ ఎంత ఆదా చేయొచ్చు

Home Loan Tax benefits | హోం లోన్‌పై ఇన్‌కమ్ టాక్స్ ఎంత ఆదా చేయొచ్చు

12 April 2022, 10:53 IST

    • Home Loan Tax benefits | హోం లోన్ తీసుకుంటే ఇన్‌కమ్ టాక్స్ చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. రూ. 12 లక్షల నుంచి రూ. 14 లక్షల ఆదాయం ఉన్నప్పటికీ హోం లోన్ తీసుకోవడం ద్వారా మీ టాక్సేబుల్ ఇన్‌కమ్‌ను సున్నాకు తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇంతకీ హోం లోన్‌పై ఎంత మేర పన్ను ఆదా చేసుకోవచ్చు.
హోం లోన్ పై టాక్స్ బెనిఫిట్స్
హోం లోన్ పై టాక్స్ బెనిఫిట్స్ (unsplash)

హోం లోన్ పై టాక్స్ బెనిఫిట్స్

వేతనం నాలుగైదు లక్షలు ఉన్నా ఐటీ రిటర్నులు దాఖలు చేయాల్సిందే. వేతనం ఐదారు లక్షలు ఉంటే సులువుగా పన్ను బారిన పడకుండా బయటపడొచ్చు. అయితే మీ ఆదాయం పది లక్షలు దాటితే పన్ను శ్లాబు పెరగడమే కాకుండా మినహాయింపులు కోరేందుకు మార్గాలు ఉండవు. ఉన్న ఏకైక మార్గం హోం లోన్. ఏ ఇతర లోన్లపై మినహాయింపులు లభించవు. కానీ హోం లోన్ పై మాత్రమే పన్ను మినహాయింపులు లభిస్తాయి. అందరికీ ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చాలా కాలాంగా హోం లోన్లను ప్రోత్సహిస్తోంది. హోం లోన్ ద్వారా ఎంత మేర పన్ను ఆదా చేయవచ్చో చూద్దాం.

హోం లోన్ అసలుపై..

మనం హోం లోన్ తిరిగి చెల్లింపులో భాగంగా అసలు, వడ్డీ చెల్లిస్తాం. ఇందులో ‘అసలు’ నిమిత్తం చెల్లించే వాయిదా మొత్తంపై ఇన్‌కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 80 సీ పరిధిలో మినహాయింపు కోరవచ్చు. సెక్షన్ 80 సీ పరిధిలో ఏడాదికి గరిష్టంగా రూ. 1,50,000 మేరకు మినహాయింపు కోరవచ్చు. అప్పటికే ఒకవేళ పిల్లల ట్యూషన్ ఫీజులు, ఎల్ఐసీ ప్రీమియంలు, ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ పొదుపు, ఈపీఎఫ్, పీపీఎఫ్ వంటివి ఉంటే.. ఇక ఇది పెద్దగా గిట్టుబాటు కాదు. 

ఎందుకంటే సెక్షన్ 80సీలో ఏది మినహాయింపు కోరినా.. మొత్తంగా రూ. 1,50,000లకు మించరాదు. అది కూడా ఐదేళ్ల లోపు ఇల్లు అమ్మితే ఈ సెక్షన్ కింద డిడక్షన్ వర్తించదు. అలాగే ఇంటి రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీకి కూడా 80 సీ కింద మినహాయింపు కోరవచ్చు. ఇక హోం లోన్ వడ్డీపై ఎంత మినహాయింపు కోరవచ్చో చూద్దాం.

సెక్షన్ 24.. హోం లోన్ వడ్డీపై..

హోం లోన్ దీర్ఘకాలిక రుణం. పదిహేనేళ్లు, ఇరవై ఏళ్లు, ఇరవై ఐదు ఏళ్లు, ముఫ్ఫై ఏళ్ల కాలపరిమితితో రుణాలు తీసుకుంటారు. హోం లోన్‌లో అసలు ఎంత ఉంటుందో.. రుణ కాల వ్యవధి ముగిసే నాటికి వడ్డీ కూడా అసలుతో సమానంగా చెల్లించాల్సి వస్తుంది. అయితే మన ఆదాయంపై పడే ఇన్‌కమ్ టాక్స్ నుంచి ఈ హోం లోన్ వడ్డీని చూపి మనం పన్ను మినహాయింపు కోరవచ్చు.  సెక్షన్ 24 కింద మనం ఏడాదికి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు పన్ను మినహాయింపు కోరవచ్చు.

అయితే ఇందుకు కొన్ని షరతులు ఉన్నాయి. మనం ఉంటున్న ఇంటిపై అయితే ఏడాదికి రూ. 2 లక్షల రాయితీ కోరవచ్చు. ఒకవేళ ఆ ఇంటిని రెంట్‌కు ఇచ్చినట్టయితే గరిష్ట పరిమితి వర్తించదు. ఇందులో ఇంకో తిరకాసు ఏంటంటే సదరు నిర్మాణం పూర్తయితేనే ఈ మినహాయింపు కోరవచ్చు. ఒకవేళ మీరు అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ఇంటిని తీసుకుంటే ఇంటి నిర్మాణం పూర్తయ్యాక అంతకుముందు మీరు చెల్లించిన వడ్డీపై ఐదు సమాన వాయిదాల్లో పన్ను మినహాయింపు కోరవచ్చు. కానీ అప్పుడు కూడా రూ. 2 లక్షల పరిమితి దాటరాదు. నిర్మాణం పూర్తయ్యాక కోరే మినహాయింపు, నిర్మాణం పూర్తికాకముందు చెల్లించిన వడ్డీని చూపడం ద్వారా కోరే మినహాయింపు మొత్తంగా కలిసి రూ. 2 లక్షలు దాటరాదు. 

సెక్షన్ 80ఈఈఏ

అందరికీ ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో సెక్షన్ 24కు తోడుగా సెక్షన్ 80ఈఈఏ ద్వారా అదనంగా మరో రూ. 1.5 లక్షల మేర వడ్డీని మినహాయింపు కోరేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఇందుకు కొన్ని షరతులు వర్తిస్తాయి. ఈ ప్రాపర్టీ స్టాంప్ విలువ రూ. 45 లక్షలు దాటరాదు. లోన్ 1 ఏప్రిల్ 2019 నుంచి 31 మార్చి 2022 మధ్య తీసుకుని ఉండాలి. తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తున్న వారై ఉండాలి. సెక్షన్ 80ఈఈ పరిధిలో డిడక్షన్ కోరకుండా ఉండాలి.

సెక్షన్ 80 ఈఈ అంటే?

సెక్షన్ 80ఈఈ కింద రూ. 50 వేల మేర ఆదాయానికి పన్ను మినహాయింపు కోరవచ్చు. అయితే ఇక్కడ కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. లోన్ అమౌంట్ రూ. 35 లక్షలు మించరాదు. ప్రాపర్టీ విలువ రూ. 50 లక్షలకు మించరాదు. 

జాయింట్ లోన్ అయితే ఎక్కువ ప్రయోజనం..

భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు ఇరువురి పేరుపై హోం లోన్ తీసుకుంటే ఇద్దరూ బెనిఫిట్స్ క్లెయిం చేయవచ్చు. సెక్షన్ 80 సీ ద్వారా చెరో రూ. 1,50,000, సెక్షన్ 24 ద్వారా చెరో రూ. 2 లక్షల మేర పన్ను మినహాయింపు కోరవచ్చు. 

హోం లోన్ వల్ల పన్ను ఆదా ప్రయోజనాల పట్టిక

మినహాయింపుఐటీ సెక్షన్గరిష్ట పన్ను మినహాయింపు నిబంధనలు
హోం లోన్ అసలు80సీరూ. 1,50,000ఇంటిని ఐదేళ్లలోపు అమ్మరాదు
వడ్డీ24బీరూ. 2 లక్షలునిర్మాణం పూర్తయ్యాకే మినహాయింపు కోరాలి
వడ్డీ80ఈఈఏరూ. 1.,50,000ప్రాపర్టీ స్టాంప్ వ్యాల్యూ రూ. 45 లక్షలకు మించరాదు. మార్చి 31, 2022లోపు తీసుకున్న రుణాలకు వర్తిస్తుంది. 
వడ్డీ80ఈఈరూ. 50,000లోన్ రూ. 35 లక్షలకు మించరాదు. ప్రాపర్టీ విలువ రూ. 50 లక్షలకు మించరాదు. 
స్టాంపు డ్యూటీ80సీరూ. 1,50,000స్టాంపు డ్యూటీ చెల్లించిన సంవత్సరం మాత్రమే వర్తిస్తుంది

టాపిక్

తదుపరి వ్యాసం