తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Curd And Diabetes: రోజూ కప్పు పెరుగు తింటే డయాబెటిస్ మాత్రమే కాదు ఈ వ్యాధులను రాకుండా అడ్డుకోవచ్చు

Curd and Diabetes: రోజూ కప్పు పెరుగు తింటే డయాబెటిస్ మాత్రమే కాదు ఈ వ్యాధులను రాకుండా అడ్డుకోవచ్చు

Haritha Chappa HT Telugu

09 May 2024, 12:40 IST

    • Curd and Diabetes: పెరుగు తినడం వల్ల డయాబెటిస్‌ను అడ్డుకోవచ్చని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. కేవలం మధుమేహమే కాదు మరెన్నో రోగాలను అడ్డుకునే శక్తి పెరుగుకి ఉంది.
పెరుగుతో ఉపయోగాలు
పెరుగుతో ఉపయోగాలు (Pixabay)

పెరుగుతో ఉపయోగాలు

Curd and Diabetes: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం మంది తినే ఆహార పదార్ధం పెరుగు. దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని క్రీమీ ఆకృతి, రుచి ఎంతో మందికి నచ్చుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు దీనిలో ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పొట్టలో మంచి బ్యాక్టీరియాకు ఎదుగుదలకు పెరుగు చాలా ముఖ్యం. రోజుకో కప్పు పెరుగు తినడం వల్ల డయాబెటిస్‌ను మాత్రమే కాదు. ఇంకా ఎన్నో రోగాలు రాకుండా అడ్డుకోవచ్చని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. బయట నుంచి వచ్చే ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం దానికి ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణం పెరుగుకి ఉంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ శరీరంలోని రోగ నిరోధక ప్రతిస్పందనను పెంచుతాయి. దీనివల్ల జలుబు, ఫ్లూ, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. వియన్నా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన మరో పరిశోధనలో పెరుగు వంటి ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో యాంటీ బాడీల ఉత్పత్తిని పెంచుతాయని తేలింది. దీనివల్ల హానికారకమైన క్రిములు శరీరంలో చేరినా కూడా రోగనిరోధక వ్యవస్థ వాటితో పోరాడి నిర్వీర్యం చేస్తుంది.

పెరుగును ప్రతిరోజూ తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. పెరుగులో ఉండే బ్యాక్టీరియా పొట్టలోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల జీర్ణ క్రియ సవ్యంగా సాగుతుంది. కడుపుబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటివి రాకుండా అడ్డుకుంటుంది. జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ప్రతిరోజూ పెరుగు తినేవారిలో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ (IBS) వంటి పేగు వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతాయి.

హైబీపీ ఉన్నవారు ప్రతిరోజూ కప్పు పెరుగును కచ్చితంగా తినాలి. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటివి రాకుండా అడ్డుకునే శక్తి పెరుగుకి ఉంది. ఇది మీ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పెరుగును ప్రతిరోజు తినే పెద్దల్లో రక్తపోటును తక్కువగా కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

ఆస్టియోపోరోసిస్ వంటి కీలకవ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రతిరోజూ పెరుగును తినడం అలవాటు చేసుకోవాలి. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. పెరుగులో ఉండే కాల్షియం, విటమిన్లు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ క్యాల్షియం శోషణను పెంచుతాయి.

పెద్ద పేగు క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ పెద్ద పేగు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు. యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్లో ప్రచురించిన ఒక అధ్యయనంలో పెరుగులోని ప్రోబయోటిక్స్... మంచి బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడతాయని, దీనివల్ల పెద్ద పేగులో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని, పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు అని తేలింది.

ఇక డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ పెరుగు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంటాయి. పెరుగును క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ గ్లూకోజ్ జీవక్రియను నియంత్రిస్తాయి. అలాగే ఊబకాయం రాకుండా కూడా అడ్డుకునే శక్తి పెరుగుకు ఉంది. కాబట్టి ప్రతిరోజు ఏం తిన్నా, తినకపోయినా కప్పు పెరుగును మాత్రం ఖచ్చితంగా తినండి.

తదుపరి వ్యాసం