Samajavaragamana collections: కలెక్షన్‍ల జోరు కొనసాగిస్తున్న సామజవరగమన.. “ఊహలకు మించి”
06 July 2023, 18:21 IST
- Samajavaragamana collections: సామజవరగమన మూవీ కలెక్షన్‍లలో దూసుకుపోతోంది. ఏడు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లు సాధించిందంటే!
Samajavaragamana collections: కలెక్షన్‍ల జోరు కొనసాగిస్తున్న సామజవరగమన.. “ఊహలకు మించి”
Samajavaragamana collections: ‘సామజవరగమన’ సినిమాపై ప్రశంసలు, కలెక్షన్‍ల వర్షం కురుస్తూనే ఉన్నాయి. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం వసూళ్ల జోరు కొనసాగిస్తోంది. జూన్ 29న ఈ మూవీ విడుదల కాగా.. ఏడు రోజులుగా కలెక్షన్‍లలో దూకుడు కంటిన్యూ అవుతోంది. మంచి క్లీన్ కామెడీతో అలరిస్తున్న ఈ సినిమాకు మంచి మౌత్ టాక్ వస్తూనే ఉండటంతో దూసుకుపోతోంది. అల్లు అర్జున్, రవితేజ సహా చాలా మంది హీరోలు, ప్రముఖులు సామజవరమగన చిత్రాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. దీంతో పాటు వసూళ్లు హోరు కొనసాగుతోంది. ఈ మూవీ ఏడు రోజుల కలెక్షన్‍ల లెక్కలు బయటికి వచ్చాయి.
సామజవరగమన సినిమా ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.30.1 కోట్ల (గ్రాస్) కలెక్షన్‍లను సాధించింది. ఈ విషయాన్ని ఈ చిత్రాన్ని నిర్మించిన ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ ట్వీట్ చేసింది. బడ్జెట్ పరంగా రూ.10కోట్లలోపు ఖర్చుతో చిన్న మూవీగా తెరకెక్కిన సామజవరగమన.. సంచలన విజయం దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమాకు భారీ స్పందన వస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ చిత్రం ఆకట్టుకుంటోంది. టాలీవుడ్‍లో చాలా కాలం తర్వాత క్లీన్ కామెడీతో వచ్చిన ఈ మూవీ అదరగొడుతోంది. అమెరికాలోనూ ఈ చిత్రం మిలియన్ డాలర్ల దిశగా దూసుకుపోతోంది. మొత్తంగా హీరో శ్రీవిష్ణు కెరీర్‌లో భారీ హిట్‍గా ఈ మూవీ నిలిచింది. సామజవరగమన కలెక్షన్‍ల గురించి హీరో శ్రీ విష్ణు కూడా ట్వీట్ చేశాడు.
“ఊహించిన విజయాన్ని.. ఊహలకు మించి ఆదరించిన ప్రతీ కుటుంబానికి ధన్యవాదాలు. మీ ప్రేమకు, మద్దతుకు థాంక్యూ. నాకు అవే సర్వస్వం” అని శ్రీవిష్ణు ట్వీట్ చేశాడు. సామజవరగమన మూవీలో బాక్సాఫీస్ బాలు క్యారెక్టర్‌లో శ్రీవిష్ణు నటన అదిరిపోయింది. అతడికి తండ్రిగా నటించిన నరేశ్ కూడా అద్భుతంగా చేశారు. వీరి మధ్య కామెడీ విపరీతంగా పండింది. హీరోయిన్ మొనికా రెబ్బా జాన్ కూడా అదరగొట్టింది. సుదర్శన్ కూడా బాగా చేశాడు.
సామజవరగమన సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పించాడు. రాజేశ్ దండా నిర్మాతగా వ్యవహరించాడు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఉన్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్ దేవీప్రసాద్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. తొలి రోజు మోస్తరు కలెక్షన్‍లనే దక్కించుకున్న ఈ మూవీ.. మౌత్ టాక్‍తో ఆ తర్వాతి నుంచి కలెక్షన్‍లలో దుమ్మురేపుతోంది.