తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  My Dear Donga Review: అభినవ్ గోమటం నయా కామెడీ మూవీ మెప్పించిందా?: రివ్యూ

My Dear Donga Review: అభినవ్ గోమటం నయా కామెడీ మూవీ మెప్పించిందా?: రివ్యూ

20 April 2024, 5:30 IST

    • My Dear Donga Review - Aha OTT: అభినవ్ గోమటం ప్రధాన పాత్రలో నటించి ‘మై డియర్ దొంగ’ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కామెడీ లవ్ మూవీ మెప్పించేలా, నవ్వించేలా ఉందా అనే విషయాలను ఈ రివ్యూలో చూడండి. 
My Dear Donga Review OTT: అభినవ్ గోమటం నయా కామెడీ మూవీ మెప్పించిందా?: రివ్యూ
My Dear Donga Review OTT: అభినవ్ గోమటం నయా కామెడీ మూవీ మెప్పించిందా?: రివ్యూ

My Dear Donga Review OTT: అభినవ్ గోమటం నయా కామెడీ మూవీ మెప్పించిందా?: రివ్యూ

My Dear Donga Review: స్టార్ కమెడియన్ అభినవ్ గోమటం, శాలినీ కొండేపూడి ప్రధాన పాత్రలు పోషించిన ‘మై డియర్ దొంగ’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ట్రైలర్‌తో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ లవ్ రిలేషన్‍షిప్ కామెడీ మూవీ ఏప్రిల్ 19న ఆహాలో అడుగుపెట్టింది. మరి ఈ ‘మై డియర్ దొంగ’ సినిమా ఆకట్టుకుందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Megalopolis Movie: 1977 లోఅనౌన్స్ - 2024లో రిలీజ్ - గాడ్ ఫాద‌ర్ డైరెక్ట‌ర్‌ వెయ్యి కోట్ల హాలీవుడ్ మూవీ ఏదో తెలుసా?

Raju Yadav: ఆ క్రికెటర్‌కు జరిగిన సర్జరీ ఆధారంగా గెటప్ శ్రీను రాజు యాదవ్ మూవీ: డైరెక్టర్

India Biggest Overseas Hit: చైనాలో 30 కోట్లకుపైగా టికెట్స్ అమ్ముడుపోయిన ఇండియన్ సినిమా ఇదే.. RRR కాదు!

Single Screen Theatres: సినీ ల‌వ‌ర్స్‌కు షాక్‌ - తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత - కార‌ణం ఇదే

సినిమా: మై డియర్ దొంగ, స్ట్రీమింగ్: ఆహా ఓటీటీ, ఏప్రిల్ 19 నుంచి

ప్రధాన నటీనటులు: అభినవ్ గోమటం, శాలినీ కొండేపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, శశాంక్ మందూరి, వంశీధర్ గౌడ్

సంగీతం: అజయ్ అరసాద, ఎడిటర్: సాయి మురళి, సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్, రచన: శాలినీ కొండేపూడి

నిర్మాత: మహేశ్వర్ రెడ్డి గోజల

దర్శకుడు: బీఎస్ సర్వజ్ఞ కుమార్

ఇదీ కథ  

ఓ డేటింగ్ యాప్‍లో కాపీ రైటర్‌గా పని చేసే సుజాత (శాలినీ కొండేపూడి).. డాక్టర్ విశాల్ (నిఖిల్ గాజుల) ప్రేమలో ఉంటారు. అయితే, తనకు విశాల్ అబద్ధాలు చెబుతూ తప్పించుకొని తిరుగుతున్నాడని సుజాత తెలుసుకుంటుంది. బాధతో తన ఫ్లాట్‍కు వెళుతుంది. అయితే, అప్పటికే ఆమె ఇంట్లో సురేశ్ (అభినవ్ గోమటం) దొంగతనం చేసేందుకు వెళతాడు. ఆ సమయంలో సుజాత కంట పడతాడు సురేశ్. ముందు కంగారు పడుతుంది సుజాత. అయితే, ఆ తర్వాత సురేశ్ మంచోడని గుర్తిస్తుంది. ఇద్దరూ తమ కుటుంబ కథలను చెప్పుకుంటారు. అయితే, ఆ అర్ధరాత్రి సుజాత పుట్టిన రోజు ఉంటుంది. దీంతో బర్త్ డే పార్టీ చేసుకునేందుకు విశాల్, సుజాత ఫ్రెండ్ బుజ్జీ (దివ్య శ్రీపాద), ఆమె లవర్ వరుణ్ (శశాంక్) ఆ ఫ్లాట్‍కు వస్తారు. అప్పటికే సురేశ్ అక్కడ ఉండటంతో అతడు ఎవరని సుజాతను వారు ప్రశ్నిస్తారు. సురేశ్‍ను తన చిన్ననాటి స్నేహితుడని, మెకానికల్ ఇంజినీర్ అంటూ పరిచయం చేస్తుంది సుజాత. అతడు చేసే పనులను సుజాత ఇష్టపడుతుంది. దీంతో సురేశ్‍పై కోపం పెంచుకుంటాడు విశాల్. సుజాత, విశాల్ లవ్ ఏమైంది? సురేశ్‍ను సుజాత నిజంగానే ఇష్టపడుతుందా? చివరికి ఏం నిర్ణయించుకుంటుంది? అనేదే ఈ మై డియర్ దొంగ మూవీలో ఉంటుంది.

కథనం ఇలా..

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన సుజాతగా నటించిన శాలినీ కొండేపూడినే స్వయంగా స్క్రిప్ట్ రాశారు. ప్రస్తుతం చాలా మంది ప్రేమికుల మధ్య రిలేషన్ ఎలా ఉంటోంది.. చిన్నచిన్న విషయాలకు మనస్పర్థలు ఎలా తలెత్తుతున్నాయన్న ప్రధాన అంశంపై ఈ కథను రాసుకున్నారు. ప్రేమికులు ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకోవటంతో పాటు స్వేచ్ఛను ఇవ్వాలనే అంశాన్ని కూడా చూపించారు. దీంతోపాటు రిలేషన్‍లో చిన్నచిన్న సంతోషాలను పంచుకోవడం ఎంత ముఖ్యమో.. వాటి వల్ల ఎంత అనందం కలుగుతోందో కూడా ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా యూత్‍కు కనెక్ట్ అయ్యే విషయాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ మూవీ స్క్రిప్ట్‌ను మెరుగ్గా రాసుకున్నారు శాలినీ.

పబ్‍లో వెయిటర్‌కు తన కథను సుజాత (శాలినీ) చెబుతున్నట్టుగా ఈ చిత్రాన్ని మొదట్లో ముందుకు నడిపించారు దర్శకుడు బీఎస్ సర్వజ్ఞ కుమార్. ప్రేమ గురించి తనకు అంతా తెలుసని సుజాత ఫీలవుతుంటుంది. అయితే నిజానికి ఆమెకే ఓ క్లారిటీ ఉండదనేలా మొదట్లో చూపించారు. విశాల్‍పై గుడ్డి నమ్మకంతో ఉండే సుజాత.. తనను అవాయిడ్ చేస్తున్నాడని తెలిసి ఫీలవుతుంది. అయితే, పుట్టిన రోజున గిటార్ పట్టుకొని పాట పాడితే మళ్లీ విశాల్‍తో కలిసిపోతుంది. దీంతో సుజాత అమాయకత్వాన్ని చూపించారు. దొంగే అయినా సురేశ్ మంచి మనసుకు, అతడు చేసే చిన్నచిన్న పనులకు కూడా సుజాత ఇంప్రెస్ అవుతుంది. విశాల్ నుంచి తాను ఏం మిస్ అవుతున్నానో గుర్తిస్తుంది. విశాల్, సురేశ్‍లలో ఎవరితో రిలేషన్‍లో సుజాత ముందుకు వెళుతుందనే ఆసక్తితో ఈ కథ సాగుతుంది. తాను పోషించిన సుజాత పాత్రను శాలినీ పకడ్బందీగా రాసుకోగా.. చిత్రం మొత్తం ఆమె ప్రధానంగా సాగుతుంది.

పండిన కామెడీ

ఈ సినిమాలో చాలా చోట్ల కామెడీ బాగానే పండింది. కామెడీ కోసం ప్రత్యేకంగా సీన్లు పెట్టకుండా.. కథలో భాగంగానే ఉండటంతో మెప్పిస్తాయి. సుజాత, సురేశ్ మధ్య సంభాషణలు.. బర్త్ డే పార్టీలో కొన్ని చోట్ల హ్యుమర్ మెప్పిస్తుంది. అలాగే, సుజాతకు సురేశ్ దగ్గరకాకుండా విశాల్ చేసే ప్రయత్నాలు కూడా చాలాచోట్ల నవ్విస్తాయి. సురేశ్ గురించి బుజ్జీ ప్రశ్నలు అడిగే సీన్ కూడా బాగుంటుంది. సురేశ్ పాత్రలో అభినవ్ గోమటం కామెడీ టైమింగ్‍తో మార్క్ చూపించారు. అయితే, సరదా సన్నివేశాలకు మరింత స్కోప్ ఉన్నా.. వాడుకోలేదనిపిస్తుంది. డైలాగ్స్ మరింత ఫన్నీగా ఉంటే బాగుండేదనిపిస్తుంది.

ఫీల్ గుడ్.. కానీ..

ఈ మూవీలో కొన్ని చోట్ల ఫీల్ గుడ్ సీన్లు ఉంటాయి. మనసును హత్తుకుంటాయి. అయితే, సురేశ్, సుజాత తమ తల్లిదండ్రుల గురించి చెప్పే విషయాలు అసలు ఎమోషనల్‍గా అనిపించవు. ఆ సీన్లు వచ్చేటప్పుడు ల్యాగ్ అయిన ఫీలింగ్ అనిపిస్తుంది. సుజాత, విశాల్ మధ్య కూడా చివర్లో పెద్దగా ఎమోషన్ వర్కౌట్ కాలేదనిపిస్తుంది. ఈ మూవీ క్లైమాక్స్ కాస్త మెరుగ్గా రాసుకోవాల్సింది. సరైన ఎండింగ్ లేదనిపిస్తుంది.

అభినవ్, శాలినీకి ఫుల్ మార్క్స్

మంచి దొంగైన సురేశ్ పాత్రలో అభినవ్ గోమటం అద్భుతంగా ఒదిగిపోయారు. అలవోకగా ఈ క్యారెక్టర్ చేశారు. ఆయన కామెడీ టైమింగ్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా ప్లస్ అయ్యాయి. అమాయకత్వాన్ని కూడా బాగా పలికించారు. సుజాత పాత్రలో శాలినీ కొండేపూడి కూడా చాలా నేచురల్‍‍గా చేశారు. తన పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. రైటర్‌గానూ సక్సెస్ అయ్యారు. సుజాత లవర్ విశాల్ క్యారెక్టర్ చేసిన నిఖిల్ కూడా బాగా చేశారు. దివ్య శ్రీపాదకు ముఖ్యమైన క్యారెక్టరే దక్కగా ఆమె మెప్పించారు. మిగిలిన వారు కూడా ఓకే అనిపించారు.

దర్శకుడు సర్వజ్ఞ కుమార్ చాలా శాతం ఓకే అనిపించినా.. ఎమోషనల్‍గా కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ చిత్రం మరింత ఆకట్టుకునేది. కాస్త డ్రామా కూడా మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది. అజయ్ అరసాద ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్, పాటలు జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ చిత్రానికి తగ్గట్టే ఉంది. చాలా తక్కువ లొకేషన్లలోనే ఈ మూవీ సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మోస్తరుగానే ఉన్నాయి. స్క్రీన్‍ప్లే మెప్పిస్తుంది.

చూసేయవచ్చు

ఓవరాల్‍గా చెప్పాలంటే.. మై డియర్ దొంగ చిత్రాన్ని ఓసారి కచ్చితంగా చూడొచ్చు. ముఖ్యంగా యూత్‍కు బాగా కనెక్ట్ అవుతుంది. ప్రేమలో ఉన్న వారికి ఇది తమ రిలేషన్‍లోనూ జరిగిందే అని గుర్తు తెచ్చుకునేలా ఏదో ఒక్క విషయమైనా ఉంటుంది. క్లీన్ కామెడీ ఉండడం కూడా ఈ చిత్రానికి ప్లస్. ఈ వీకెండ్‍లో టైమ్ పాస్ కోసం ఈ మూవీపై తప్పకుండా ఓ లుక్కేయవచ్చు. ఈ మూవీ 1 గంటా 43 నిమిషాల రన్ టైమ్ ఉండడం కూడా ప్లస్సే.

రేటింగ్: 3/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం