తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Indian Predator The Diary Of A Serial Killer Review In Telugu: మనిషి మెదడును ఉడకబెట్టి రసంలా తాగే కిల్లర్.. ఏమైందంటే?

Indian predator the diary of a serial killer review in Telugu: మనిషి మెదడును ఉడకబెట్టి రసంలా తాగే కిల్లర్.. ఏమైందంటే?

08 September 2022, 15:42 IST

    • Indian predator: the diary of a serial killer Review in Telugu: 2000వ సంవత్సరంలో జర్నలిస్టు హత్యతో తెరపైకి వచ్చిన రాజా కొలందర్ అనే నేరస్తుడి ఆధారంగా తెరకెక్కిన డాక్యూ సిరీస్ ఇండియన్ కిల్లర్ ది ప్రెడేర్ ది డైరీ ఆఫ్ సీరియల్ కిల్లర్. వాస్తవిక ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ప్రెడేటర్ ది డైరీ ఆఫ్ సీరియల్ కిల్లర్
ఇండియన్ ప్రెడేటర్ ది డైరీ ఆఫ్ సీరియల్ కిల్లర్ (Twitter)

ఇండియన్ ప్రెడేటర్ ది డైరీ ఆఫ్ సీరియల్ కిల్లర్

Indian predator: the diary of a serial killer Review: వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాలు, వెబ్‌సిరీస్‌ల్లో డ్రామా కోసం కొంతమేర కల్పితాలను జోడించడం సహజంగా జరుగుతుంది. కానీ ఎలాంటి డ్రామా లేకుండా వాస్తవాలను వెలికితీస్తూ.. ఇదే సమయంలో కథను రసవత్తరంగా ప్రేక్షకులకు అందజేసేవే డాక్యూ సిరీస్‌లే. అయితే డాక్యూమెంటరీలకు మన వద్ద పెద్దగా ఆదరణ లేనప్పటికీ.. హాలీవుడ్ ప్రేక్షకులు వీటిని విపరీతంగా చూస్తారు. కానీ ఇటీవల కాలంలో ఇండియాలోనే డాక్యూ సిరీస్‍‌లు, డాక్యూమెంటరీలను చూసే వారి సంఖ్య పెరిగింది. కేవలం కథను ప్రేక్షకులకు చేరవేస్తూ.. అద్భుతమైన అనుభూతిని కలగజేస్తుంటారు. కథనం కంటే కూడా కథకే ఇక్కడ ప్రాముఖ్యత ఇస్తారు. అయితే కథతో పాటు ఆసక్తిని కూడా కలిగించే డాక్యూసిరీస్ ఒకటి బుధవారం నాడు నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అదే ఇండియన్ ప్రెడేటర్: ది డైరీ ఆఫ్ సిరీయల్ కిల్లర్. 2000వ సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌లో వాస్తవంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. అతి క్రూరంగా 14 మందిని చంపిన సైకో కిల్లర్ కథ ఇది. మరి ఈ డాక్యూ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

కథ..

ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లో జీతేంద్ర సింగ్ అనే విలకరి హత్య 2000వ సంవత్సరంలో పెద్ద దుమారం రేపుతోంది. నగరంలో ఓ ప్రముఖ వార్తాపత్రికలో పనిచేస్తున్న జీతేంద్ర సింగ్.. కుటుంబాన్ని చూసేందుకు గాను 2000 డిసెంబరు 14న పక్కనే ఉన్న తన గ్రామానికి బయల్దేరుతాడు. అయితే అతడు ఇంటికి వెళ్లడు. అలా అని అలహాబాద్‌కు తిరిగి చేరుకోడు. రెండు రోజులు గడుస్తున్నా జీతేంద్ర సింగ్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తారు బంధువులు. దీంతో విచారణ చేపట్టిన ఖాకీలు.. ఫోన్ రికార్డు ద్వారా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తారు. రాజా కొలందర్ అలియాస్ రామ్ నిరంజన్ అనే వ్యక్తికి జీతేంద్ర ఫోన్ చేయడం పోలీసులకు అనుమానంగా మారుతుంది. వెంటనే ఆ దిశగా దర్యాప్తును ప్రారంభిస్తారు.

అయితే పోలీసులు అనకున్నట్లే రాజా కొలందర్ ప్రవర్తన వారికి అనుమానంగా ఉంటుంది. తమదైన శైలిలో విచారించిన ఖాకీలకు అతడు విస్తుపోయే విషయాలను చెబుతాడు. జీతేంద్ర తల, పురుషాంగాన్ని నరికి వేరు వేరు ప్రదేశాల్లో శరీరాన్ని విసిరేశానని అతడు ఒప్పుకున్నట్లు పోలీసులు వివరిస్తారు. అంతేకాకుండా అతడి ఇంట్లో ఓ డైరీ దొరుకిందని, ఇందులోని సమాచారం ప్రకారం అతడు అంతకు ముందు 13 హత్యలు చేశాడని నిగ్గు తేలుస్తారు. మరి ఆ హత్యలు నిజంగా రాజా కొలందరే చేశాడా? లేక పోలీసులు కావాలని అతడిని ఇరికిస్తున్నారా? అంతకుముందు జరిగిన 13 హత్యలను ఎవరు చేశారు? ఆ డైరీలో ఏయే విషయాలు ఉన్నాయి? లాంటి సంగతులు తెలియాలంటే ఈ డాక్యూ సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

డాక్యూ సిరీస్ అనగానే ఎవరైనా స్టోరీ నేరేషన్ నిదానంగా సాగుతుందని అనుకుటారు. ఇంటర్వ్యూ మాదిరిగా తమకు తెలిసిన సమాచారాన్ని ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెబుతుండటంతో ప్రేక్షకులకు మొదట్లో అంతగా ఆసక్తిగా అనిపించదు. కానీ ఇండియన్ ప్రెడేటర్ ది డైరీ ఆఫ్ ఏ సీరియల్ కిల్లర్ దర్శకుడు ధీరజ్ జిందాల్ మాత్రం ఆరంభం నుంచి కథను ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేశాడు. జర్నలిస్టు హత్యతో కథను ప్రారంభించి.. చిన్నగా ఒక్కొక్కటిగా కథలోని మలుపులను విప్పే ప్రయత్నం చేశాడు. మూడు ఎపిసోడ్‌లు ఉండే ఈ సిరీస్‌ను చాలా వరకు ఉత్కంఠ రేపేలా ఉంది. మొదటి ఎపిసోడ్ అంతా జర్నలిస్టు హత్య చుట్టూనే తిరుగుతుంది. తలతో పాటు పురుషాంగాన్ని నరికడమే కాకుండా వాటిని చేరువలో విసిరేయడం, శరీరాన్ని పొలాల్లో ఉంచడం లాంటి విషయాలన్నింటినీ కళ్లకు కట్టినట్లు చూపించారు. కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ..వాస్తవికంగా ఇది జరిగిందని తెలిసేటట్లుగా సంఘటన గురించి తెలిసే పేపర్ కటింగ్స్, ఫొటోలతో ఆసక్తిని రేకెత్తిస్తారు.

ఫామ్ హౌస్‌కు రప్పించుకుని 13 మందిని అతి కిరాతకంగా రాజా కొలందర్ చంపాడనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. డైరీలో ఉన్న సమాచారం ప్రకారం అతడు మనిషి మెదళ్లను ఉడకబెట్టుకుని రసంలా తాగేవాడని, క్షుద్ర పూజలు చేసేవాడని పోలీసులతో చెప్పించడం, కోర్టు దీన్ని నిజమని రూఢీ చేయడం అన్నీ ఆసక్తిగా సాగుతాయి. రాజా కొలందర్ అలా చేయడానికి గల కారణాలను కూడా సైకాలజిస్టు, సామాజిక కార్యకర్త, అతడి స్నేహితులు ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తారు.

బలాలు..

ఈ సిరీస్‌లో స్టోరీ టెల్లింగ్ అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కో ముడిని విప్పుతూ.. ఆద్యంతం ఆసక్తిగా తీయడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ఈ హత్యలన్నీ చేసి దోషిగా శిక్ష అనుభవిస్తున్న రాజా కొలందర్ అలియస్ రామ్ నిరంజన్‌ ఏమంటున్నాడో కూడా ఇందులో చూపిస్తారు. ఇంటర్వ్యూలో అతడు చెప్పిన మాటలు ఆసక్తిగా ఉంటాయి. పోలీసులు కావాలనే తనపై నిందమోపారని, తను అలాంటి వాడిని కాదని అతడు చెప్పడం, కొన్ని సందర్భాల్లో అతడు చెప్పిన విషయాలకు, జరిగినవాటికి పొంతన లేకపోవడం, మరికొన్ని విషయాల్లో అతడు చెప్పింది కూడా నిజమే కదా అనిపించేలా ప్రేక్షకులను ఆలోచింప జేసేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. దోషి మాటలు ప్రకారం పాపం ఇతడు ఎలాంటి నేరం చేసి ఉండడు అనుకుంటూనే.. ఇతర సాక్ష్యాల ఆధారంగా నిజంగానే చేసి ఉంటాడని రెండు రకాలుగా ప్రేక్షకులు అనుకునేలా చూపించారు.

రామ్ నిరంజన్ ఆదివాసి కమ్యునిటీ అయిన కోల్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆ సామాజిక వర్గంలో అభద్రతా భావాన్ని, వారి వెనుకబాటుతనాన్ని మాటల ద్వారే తెలిసేలా చేశారు దర్శకుడు. ఈ సిరీస్ పూర్తి స్థాయి సైకో కిల్లర్ జోనర్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే సాధారణంగా సైకో కిల్లర్ అంటే ఎలాంటి కక్ష, పగ లేకుండా కేవలం మానసిక ఆనందం కోసం క్రూరాతి క్రూరంగా చంపేవారని అనుకుంటారు. కానీ ఇందులో రాజా కొలందర్ కేవలం తన రాజకీయ ఎదుగుదలకు అడ్డు వచ్చేవారిని, తనతో విభేదం ఉన్నవారిని మాత్రమే చంపుతుంటాడు.

బలహీనతలు..

సిరీస్ ఉంది మూడు ఎపిసోడ్‌లే అయినప్పటికీ.. తొలి రెండు ఎపిసోడ్‌ల్లో ఉన్నంత ఆసక్తిగా చివరి ఎపిసోడ్ ఉండకపోవడం ఇందులో బలహీనత. ఇంకో విషయమేమంటే రాజా కొలందర్ మనిషి మెదళ్లను ఉడకబెట్టి రసంలా తాగేవాడని పోలీసులు పేర్కొంటారు. అయితే నిజంగా అలా జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు ఆ ఆరోపణలు కొట్టి వేయడం గమనార్హం. నిజంగా అంత ఘోరం జరిగి ఉండి 14 హత్యలు జరిగేంత వరకు నిందితుడిని పట్టుకోకుండా పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? అనే ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. ఫలితంగా పోలీసు, న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని తగ్గించేలా అనిపిస్తుంది. వాస్తవికంగా తీసే ప్రయత్నంలో కొన్ని సీన్లు మరీ ఎబ్బెట్టుగా ఉంటాయి. ముఖ్యంగా మనిషి మెదడును ఉడకబెట్టే సన్నివేశం అందరూ చూడలేకపోవచ్చు.

చివరగా.. ఈ డాక్యూ సిరీస్ ఉత్కంఠను రేపే వెబ్‌సిరీస్‌లకు ఏ మాత్రం తక్కువ కాదు. అయితే డ్రామా, నటీనటులు కాకుండా..కథను తెలుసుకునేవారికి ఈ సిరీస్ బాగా నప్పుతుంది. డాక్యూమెంటరీలను చూసే అలవాటున్న ఉన్నవారు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫ్రాంఛైజీలో జులైలో విడుదలైన మొదటి పార్ట్ 'ఇండియన్ ప్రెడేటర్; ది బచర్ ఆఫ్ దిల్లీ' అనే డాక్యూ సిరీస్ కంటే కూడా ఇది ఆసక్తికరంగా, ఉత్కంఠను కలిగించేలా ఉంటుంది.

రేటింగ్- 3.5/5

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం