తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Election Bonds: ఇచ్చినోళ్లు.. తీసుకున్నోళ్లు ఓకే... ఎవరు ఎవరికి ఇచ్చారో మాత్రం తెలీదు, ఎస్‌బిఐ చిత్రాలు..

Election Bonds: ఇచ్చినోళ్లు.. తీసుకున్నోళ్లు ఓకే... ఎవరు ఎవరికి ఇచ్చారో మాత్రం తెలీదు, ఎస్‌బిఐ చిత్రాలు..

Sarath chandra.B HT Telugu

15 March 2024, 10:20 IST

    • Election Bonds: సుప్రీం కోర్టు ఆగ్రహంతో భారతీయ స్టేట్‌ బ్యాంక్ ఎలక్షన్‌ బాండ్ల వివరాలను వెల్లడించినా అందులో ఓ గమ్మత్తు చేసింది.  ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కార్పొరేట్లు, వాటిని స్వీకరించిన పార్టీల వివరాలను వెల్లడించింది. అయితే ఏ పార్టీకి ఏ కంపెనీ విరాళమిచ్చిందనే లెక్క మాత్రం దాచి పెట్టింది.
ఎన్నికల బాండ్ల నిధులు అందుకున్న పార్టీల వివరాలు వెల్లడించిన ఈసీ
ఎన్నికల బాండ్ల నిధులు అందుకున్న పార్టీల వివరాలు వెల్లడించిన ఈసీ

ఎన్నికల బాండ్ల నిధులు అందుకున్న పార్టీల వివరాలు వెల్లడించిన ఈసీ

Election Bonds: ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా కొన్నేళ్లుగా సాగుతున్న ఎలక్ట్రోరల్ బాండ్ల వ్యవహారంపై ఎట్టకేలకు లెక్కలు బయటపడ్డాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రుపాయల్ని ఎలక్షన్ బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు కప్పం చెల్లించాయి. ఇలా ఏకంగా రూ.11వేల కోట్ల రుపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో చేతులు మారినట్టు లెక్క తేలింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలక పార్టీలకు బాండ్ల రూపంలో వందల కోట్లు వచ్చి పడ్డాయి.

ట్రెండింగ్ వార్తలు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

Warangal News : పోలింగ్ ముగిసి ఐదు రోజులు, అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్!

ఎలక్షన్‌ బాండ్ల వ్యవహారంపై అనుమానాలను నిజం చేస్తూ అసలు లెక్కల్ని భారతీయ స్టేట్ బ్యాంక్ SBI వెల్లడించింది. ఎలక్ట్రోరల్ బాండ్ల వివరాలను వెల్లడించడానికి జూన్‌ వరకు గడువు కోరిన ఎస్‌బిఐ సుప్రీం కోర్టు ఆగ్రహంతో గురువారానికల్లా జాబితాను ఎన్నికల సంఘానికి Election commission అందచేసింది. దీంతో గత పదేళ్లలో ఎలక్షన్ బాండ్ల రూపంలో విరాళాలు అందుకున్న పార్టీలు వాటిని అందించిన కార్పొరేట్ Corporate దిగ్గజాల జాబితా బయటపడింది.

తెలుగు రాష్ట్రాల్లో అధికం...

తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ పనుల్లో ఉన్న ప్రముఖ Construction సంస్థలు భారీగా ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్టు తాజా జాబితాలో వెల్లడైంది. నవయగ, మేఘా, షిర్డిసాయి వంటి కంపెనీల పేర్లు విరాళాలు ఇచ్చిన కంపెనీల జాబితాలో ప్రముఖంగా కనిపించాయి.

వీటితో పాటు రియల్‌ ఎస్టేట్ సంస్థలు కూడా వీటిని కొనుగోలు చేశాయి. మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ ఎలక్ట్రోరల్ బాండ్ల కొనుగోలుకు రూ.966 కోట్లు వెచ్చించింది. షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ రూ.40 కోట్ల బాండ్లను కొనుగోలు చేసింది. నవయుగ 55కోట్ల బాండ్లను సేకరించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్‌బీఐ సమర్పించిన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పెట్టింది. ఎన్నికల బాండ్లు కొన్న కంపెనీలు, వాటిని అందుకున్న పార్టీల వివరాలను విడివిడిగా ఎన్నికల సంఘానికి అందచేసింది. వీటిలో రూ.11,671 కోట్ల విలువైన బాండ్లను వివిధ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేసినట్లు గణంకాలు పేర్కొంది.

అయితే ఈ వివరాల్లో ఏ సంస్థకు చెందిన ఎలక్ట్రోరల్ బాండ్లను ఏ రాజకీయ పార్టీకి వెళ్లాయనే వివరాలు మాత్రం ప్రకటించలేదు. ఈ లెక్కలు చెప్పడానికి 3 నెలల సమయం పడుతుందని ఎస్‌బీఐ చెబుతోంది. ఇక్కడే ఎస్‌బిఐ తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బాండ్ల ద్వారా పార్టీలకు కళ్లు చెదిరే ఆదాయం

ఈసీకి అందిన వివరాల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయనే లెక్కలను ఫ్యాక్ట్‌ ఫైండర్‌ మహమ్మద్‌ జుబేర్‌ వెల్లడించారు.జుబేర్‌ ప్రకటించిన మొత్తంలో ఎలక్షన్‌ బాండ్ల ద్వారా వసూలైన డబ్బులో బీజేపీకి రూ.6,061 కోట్లు, తృణమూల్‌ కాంగ్రెస్‌కు రూ.1,610 కోట్లు, కాంగ్రెస్‌కు 1,422 కోట్లు వెళ్లాయి.

ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీల్లో లక్ష్మీ మిత్తల్‌ స్టీల్స్‌, ఎయిర్‌ టెల్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌, అనిల్‌ అగర్వాల్‌, ఐటీసీ, మహీంద్ర అండ్‌ మహీంద్ర, తెలుగురాష్ట్రాలకు చెందిన నవయుగ, మేఘా ఇంజినీరింగ్‌, షిర్డీసాయి ఎలక్ట్రిక వంటి సంస్థలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మేఘా టాప్…

తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ పనుల్లో ప్రముఖ సంస్థ మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రాజకీయ పార్టీలకు రూ.966 కోట్ల విరాళం ఇచ్చింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజెక్టుల్లో మేఘా చేపడుతోంది.

మరో సంస్థ నవయుగ కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ బాండ్లను కొనుగోలు చేసింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి మేఘా ఇంజనీరింగ్ కోటి రూపాయల విలువైన 966 బాండ్లను కొనుగోలు చేసింది. షిర్డీసాయి ఎలక్ట్ట్రికల్స్‌ లిమిటెడ్‌ ఈ ఏడాది జనవరి 11వ తేదీన ఒక్క రోజే రూ.కోటి విలువైన 40 బాండ్లను కొనుగోలు చేసి రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. నవయుగ సంస్థ కూడా రూ.55కోట్ల రుపాయల బాండ్లను కొనుగోలు చేసింది.

తెలుగు కంపెనీలు ఇవే….

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ సంస్థలు పెద్దఎత్తున బాండ్లను కొనుగోలు చేశాయి. వీటిలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్‌ రూ.80 కోట్లు, నాట్కోఫార్మా రూ.70 కోట్లు, ఎన్‌సీసీ లిమిటెడ్‌ రూ.60 కోట్లు, హెటిరో గ్రూప్‌: రూ.60 కోట్లు, నవయుగ ఇంజినీరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ రూ.55 కోట్లు, దివీస్‌ లేబొరేటరీస్‌ లిమిటెడ్ రూ.55 కోట్లు, అరబిందో ఫార్మా లిమిటెడ్‌ రూ.50 కోట్లు బాండ్లను కొనుగోలు చేసింది.

సిఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌రూ.45 కోట్లు, చలమలశెట్టి కుటుంబానికి చెందిన గ్రీన్‌కో ఎనర్జీ రూ.35 కోట్లు, రియల్‌ ఎస్టేట్ దిగ్గజం్ అపర్ణా ఫామ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ సంస్థ రూ.30 కోట్లు, ఎన్‌ఎస్‌ఎల్‌ ఎస్‌ఈజెడ్‌ హైదరాబాద్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.29 కోట్లు, కల్పతరు ప్రాజెక్ట్స్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.26.50 కోట్లు,మైహోం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.25 కోట్లు, రాజపుష్ప గ్రూప్‌ రూ.25 కోట్లు, ఏపీఎల్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్లు బాండ్లను సేకరించింది.

నారా కన్‌స్ట్రక్షన్స్‌ రూ.10 కోట్లు, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్లు, సోమశిల సోలార్‌ పవర్‌ లిమిటెడ్‌ రూ.7 కోట్లు, శ్రీచైతన్య స్టూడెంట్స్‌ మేనేజ్‌మెంట్‌ రూ.6 కోట్లు, సుధాకర్‌ కంచర్ల రూ.5 కోట్లు, కేసీఆర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎల్‌ఎల్‌పీ రూ.5 కోట్లు, ఐల్యాబ్స్‌ హైదరాబాద్‌ టెక్నాలజీ సెంటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5 కోట్లు విలువైన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేశాయి.

ఏపీ, తెలంగాణల్లో అధికార పార్టీలకే అధికం...

ఎన్నికల బాండ్ల రూపంలో నిధులు అందుకున్న పార్టీల్లో వైసీపీకి రూ.337కోట్లు దక్కాయి. టీడీపీకి రూ.219 కోట్లు వచ్చాయి. జనసేనకు రూ.21 కోట్లు అందాయి. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీకి రూ.1,215 కోట్ల విరాళాలు అందాయి.

దేశంలో ఎన్నికల బాండ్లను దక్కించుకున్న పార్టీల్లో బీజేపీ, కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్, వైసీపీ, ఏఐఏడీఎంకే, టీడీపీ, శివసేన, డీఎంకే, జేడీఎస్‌, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, జేడీయూ, ఆర్జేడీ, ఆప్‌, సమాజ్‌వాదీ పార్టీ, జమ్మూ కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌, బిజూ జనతాదళ్‌, గోవా ఫార్వర్డ్‌ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్‌ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా, జేఎంఎం, సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌, జనసేన ఉన్నాయి.

ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిన కంపెనీలలో మేఘా ఇంజినీరింగ్‌, నవయుగ, స్పైస్‌ జెట్‌, ఇండిగో, గ్రాసిం ఇండస్ట్రీస్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, టొరెంట్‌ పవర్‌, భారతీ ఎయిర్‌టెల్‌, డీఎల్‌ఎఫ్‌ కమర్షియల్‌ డెవలపర్స్‌, వేదాంత లిమిటెడ్‌, అపోలో టైర్స్‌, లక్ష్మీ మిత్తల్‌, ఎడెల్‌వీస్‌, పీవీఆర్‌, కెవెంటర్‌, సులా వైన్‌, వెల్‌స్పన్‌, సన్‌ ఫార్మా, వర్ధమాన్‌ టెక్స్‌టైల్స్‌, జిందాల్‌ గ్రూప్‌, ఫిలిప్స్‌ కార్బన్‌ బ్లాక్‌ లిమిటెడ్‌, సియట్‌ టైర్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, ఐటీసీ, కేపీ ఎంటర్‌ప్రైజెస్‌, సిప్లా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ వంటి కంపెనీలు ఉన్నాయి.

ఎన్నికల బాండ్ల రూపంలో విరాళాలు అందించడం ద్వారా కార్పొరేట్ దిగ్గజాలు కాంట్రాక్టులు దక్కించుకోవడంతో పాటు ఆర్ధిక ప్రయోజనాలు పొందాయనే ఆరోపణలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం