తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pathapatnam Election Fight: పాతపట్నంలో పాగా వేసేది ఎవరు…రెడ్డి శాంతి వర్సెస్ మామిడి గోవింద్ రావు

Pathapatnam Election Fight: పాతపట్నంలో పాగా వేసేది ఎవరు…రెడ్డి శాంతి వర్సెస్ మామిడి గోవింద్ రావు

Sarath chandra.B HT Telugu

26 April 2024, 8:46 IST

    • Pathapatnam Election Fight:  శ్రీకాకుళం జిల్లా  పాతపట్నంలో మూడోసారి  విజయం కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది. పాతపట్నంలో పాగా వేయడానికి టీడీపీ ఉవ్విళ్లూరుతోంది. 
పాతపట్నంలో ఈసారి పాగా వేసేది ఎవరు?
పాతపట్నంలో ఈసారి పాగా వేసేది ఎవరు?

పాతపట్నంలో ఈసారి పాగా వేసేది ఎవరు?

Pathapatnam Election Fight: శ్రీకాకుళం Srikakulam పాతపట్నం Pathapatnamలో ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో YCP వైసీపీ తరపున రెడ్డి శాంతి విజయం సాధించారు.TDP  టీడీపీ అభ్యర్థి వెంకటరమణపై 15,551ఓట్లతో విజయం సాధించారు. 2014లో రెడ్డి శాంతి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2014లో పాతపట్నం నుంచి వైసీపీ తరపున గెలిచిన కలమట వెంకటరమణ ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2019 Elections ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసి వైసీపీ అభ్యర‌్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

వైసీపీ ఎన్నికల హామీలు…

అధికారంలోనికి వచ్చిన వెంటనే వంశధార రిజర్వాయర్ నిర్మాణంలో నష్టపోయినవారికి 2013వ భూ సేకరణ చట్టం అమలు చేసి న్యాయం చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు గడిచినా 2013 భూ సేకరణ చట్టం అమలు కాలేదు. పెంచిన పరిహారం కొంతమందికే ఇచ్చారు. మిగిలిన వారికి ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

మెళియాపుట్టిలో మహిళా జూనియర్ కళాశాల మంజూరు చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. ఇది ప్రతిపాదనల దశలోనే ఉంది. పెద్దమడి కేంద్రంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేసి, గ్రామీణ, గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామన్నా అది నెరవేరలేదు.

పాతపట్నం నియోజకవర్గంలోని పలు గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో సిమెంటు, తారు రోడ్లు వేస్తామన్న హామీ నెరవేరలేదు. కొన్ని చోట్ల గిరిజన గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరై నప్పటికీ పనులు అరకొరగా చేసి, అక్కడితోనే నిలిపివేశారు.

ఎమ్మెల్యే రెడ్డి శాంతి హామీలు:

1.కడగండి రిజర్వాయర్ నుంచి ఎల్.ఎన్.పేట మండలానికి కాలువలు నిర్మిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాలువల నిర్మాణ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు.

2.ఎల్.ఎన్.పేట కూడలి నుంచి కొమనాపల్లి, మోదుగువలన రోడ్డు నుంచి గొట్టిపల్లి, ఎ.బి. రోడ్డు నుంచి ముంగెన్నపాడు రహదారులను అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆయా రహదారుల అభివృద్ధి జరగలేదు సరికదా మరమ్మతులకు సైతం నోచుకోలేదు. అధ్వానంగా మారడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

3.హిర మండలం మండలం జిల్లేడుపేట గ్రామం వద్ద మహేంద్రతనయ నదిపై వంతెన నిర్మాణం చేపడతామన్నారు. వంతెన కోసం రూ.9 కోట్ల నిధులు మంజూరయ్యాయి. శంకుస్థాపన చేసినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు.

3.పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం మంజూరు చేస్తామన్నా అది నెరవేరలేదు.

4. వంశధార ప్రాజెక్టు పనులు పూర్తిచేసి, సాగునీటిని అందిస్తామన్నారు. ప్రాజెక్టు పనులు తొంభై శాతం పూర్తయ్యాయి, మిగిలినవి సాగుతూనే ఉన్నాయి. నాగావళి, వంశధార అనుసంధానం జరగలేదు. వంశధార నదికి కొత్తూరు మండలంలో కరకట్టల నిర్మాణం చేపడతామన్నా పనులు ప్రారంభం కాలేదు.

5. కొత్తూరులో రైతు బజారు ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరలేదు.

సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఆరోపణలు…

రెడ్డి శాంతి భర్త రెడ్డి నాగభూషణరావు ఢిల్లీలో ఐ.ఆర్.ఎస్. అధికారిగా పని చేశారు. రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందారు. అధికారంలోకి వచ్చిన కొత్తలో నియోజక వర్గంలోని పలుచోట్ల ప్రభుత్వ భవనాలు, రహదారుల నిర్మాణ పనులు బినామీ పేర్లతో చేపట్టారు. ఎమ్మెల్యే కుటుంబానికి ఢిల్లీలో వ్యాపారాలు ఉన్నాయి.

భర్త చని పోయిన తర్వాత స్థానిక పనులన్నీ అనుచరులకు అప్పగించారు. కాంట్రాక్టు పనులు కార్యకర్తలు, మండల పార్టీ నాయకులకు ఇచ్చేశారు. పనుల అప్పగింతలో కొన్ని తేడాలు రావడంతోనే పార్టీలో వర్గాలు ఏర్పడ్డాయనే ప్రచారం ఉంది. నియోజక వర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థి తి నెలకొంది.

రెడ్డి శాంతిపై నేరుగా ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకపోవడం ఆమెకు కలిసొచ్చే అంశం. ఎమ్మెల్యే పేరుతో అనుచరులు పెద్దఎత్తున దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆమె దృష్టికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుకోవడంపైనే ఎమ్మెల్యేప్రత్యేక శ్రద్ద పెట్టారు.

కలవడానికి ఎవరొచ్చినా ఆమె బయటకి రారు. నియోజకవర్గంలో పర్యటనలు అంతంతమాత్రమే. ఎమ్మెల్యే పేరుచెప్పి మండలానికి ఒక నాయకుడు భవనాలు, రహదారుల కాంట్రాక్టుల్ని దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రెడ్డి శాంతి కుమార్తె రెడ్డి వేదిత ఐఏఎస్ అధికారిణిగా ఉన్నారు. ఏడాది కిందట వివాహం జరిగింది. రాజకీయ కార్యకలాపాల్లో తలదూర్చరు.కుమారుడు రెడ్డి శ్రావణ్ తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హిరమండలం జడ్పీటీసీ అభ్య ర్థిగా పోటీచేసి ఓడిపోయిన తర్వాత బయటకు రాలేదు.

ఎమ్మెల్యే అనుచరులపై ఆరోపణలు..

కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు సారివల్లి ప్రసాదరావు కీలకంగా ఉన్నారు. పనులు దక్కించుకున్న సర్పంచులు, కార్యక ర్తలు బలహీనంగా ఉన్నచోట్ల వాళ్ల దగ్గర నుంచి పనులు, కాంట్రాక్టులు లాక్కుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ తరలింపు ఆరోపణలు ఉన్నాయి.

మరో అనుచరుడు సూర్యనారాయణ పీఏసీఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. వంశధార నిర్వాసితులు స్థలాల ఆక్రమణ లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బలహీనంగా ఉన్న లబ్ధిదారులను ఎంపిక చేసుకుని వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి వారి స్థలాల్ని లాక్కుంటున్నారనే ప్రచారం ఉంది. ఆరు పంచాయితీల్లోని ప్రభుత్వ భవనాలు, రహదారుల పనులను బినామీ పేర్లతో దక్కించుకున్నారు.

తులసీ వరప్రసాద్ నిర్వాసిత గ్రామాల్లో స్థలాలను బినామీ పేర్లతో ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వంశధార ప్యాకేజీల్లో అధికారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. ఇతనికి అనువుగా ఉన్న వారి ఖాతాల్లో ప్యాకేజీ డబ్బులు పడేలా చేశారు. ప్రస్తుతం శ్రీనివాసరావుపై విజిలెన్సు దర్యాప్తు జరుగుతోంది.

ఎమ్మెల్యే దగ్గర పీఏలుగా వినయ్‌, సతీష్‌లు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేను కలవడానికి ఎవరు వచ్చినా వీరిని ప్రసన్నం చేసుకోవాల్సిందేనని ప్రచారం ఉంది.

పాతపట్నంలో ప్రధాన సమస్యలు:

పాతపట్నం మండల కేంద్రంలో రూసా నిధులతో ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల ఆవరణలో ప్రత్యేకంగా బాలికలకు వసతి గృహాన్ని నిర్మించారు. వసతి గృహంలో సుమారు రెండు వందల మంది బాలికలకు ప్రయోజనం కలగాల్సి ఉంది. నిర్మాణం పూర్తై సుమారు రెండేళ్లు గడిచినా వసతి గృహం ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో డిగ్రీ కళాశాలలో చదువుతున్న బాలికలు ఇబ్బందులు పడుతు న్నారు. సొంత డబ్బులు వెచ్చించి ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్నారు.

పాతపట్నం మండలానికి అగ్నిమాపక కేంద్రం మంజూరు కాకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు మారుమూల, శివారు ప్రాంతం కావడంతో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర నష్టాలు జరుగుతున్నాయి. సమీపంలో ఒడిశా ప్రాంతం ఉన్నప్పటికీ వారు అగ్నిమాపక వాహనం పంపిం చేందుకు నిరాకరించడంతో ఇక్కడ ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. .

ఆంధ్రా-ఒడిశా ప్రాంతాల ప్రజలకు సాగునీటిని అందిస్తున్న గుమ్మగెడ్డ గత కొన్నేళ్లుగా మరమ్మతులకు నోచుకోకపోవడంతో స్థానిక రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది. ఒడిశా ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా పడినట్లయితే అధికంగా వరదనీరు వచ్చి వరి పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. గుమ్మగెడ్డ కాలువ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

వంశధార నదికి 15 కిలోమీటర్ల పొడవున కరకట్టల నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉంది.గత 30 ఏళ్లుగా నిర్మాణం చేపట్టాలని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు కోరుతున్నా ఏ ఎమ్మెల్యే స్పందించ లేదు. 2019 ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతి కరకట్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వరదల సమ యంలో ఇబ్బందులు పడుతున్నారు.

2006లో జలయజ్ఞంలో భాగంగా కడగండి జలా శయ నిర్మాణం చేపట్టారు. కానీ ఇంతవరకు జలాశయా నికి కుడి, ఎడమ కాలువల నిర్మాణం చేపట్టి సాగునీరు విడిచిపెట్టలేదు. దీంతో రిజర్వాయరు నిర్మాణం చేపట్టినా ఉపయోగం లేకుండా పోయింది. అందులో చేరిన నీరు వృథాగా పోతోంది. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరిగితే ఎల్ఎన్పీట, సరుబుజ్జిలి మండలాల్లో సుమారు 950 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

పాతపట్నంలో తాజాగా ఎన్నికల్లో రెండోసారి రెడ్డిశాంతి పోటీ చేస్తుండగా టీడీపీ తరపున మామిడి గోవిందరావు పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

 

తదుపరి వ్యాసం