తెలుగు న్యూస్  /  క్రికెట్  /  India In Semifinal: సెమీఫైనల్లో టీమిండియా.. లంకపై రికార్డుల పరంపర

India in Semifinal: సెమీఫైనల్లో టీమిండియా.. లంకపై రికార్డుల పరంపర

Hari Prasad S HT Telugu

02 November 2023, 20:57 IST

    • India in Semifinal: వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది టీమిండియా. శ్రీలంకపై రికార్డుల పరంపర సృష్టిస్తూ.. వరుసగా ఏడో విజయం సాధించి ఈసారి టాప్ 4లోకి వెళ్లిన తొలి జట్టుగా నిలిచింది.
సెమీస్ లోకి దూసుకెళ్లిన టీమిండియా
సెమీస్ లోకి దూసుకెళ్లిన టీమిండియా (REUTERS)

సెమీస్ లోకి దూసుకెళ్లిన టీమిండియా

India in Semifinal: టీమిండియా వరల్డ్ కప్ 2023 సెమీఫైనల్లోకి వెళ్లింది. ఈసారి టోర్నీలో టాప్ 4లోకి వెళ్లిన తొలి జట్టు రోహిత్ సేనే కావడం విశేషం. ఆడిన ఏడు మ్యాచ్ లలోనూ గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. గురువారం (నవంబర్ 2) శ్రీలంకను ఏకంగా 302 పరుగులతో చిత్తు చేసింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. కేవలం 55 పరుగులకే కుప్పకూలింది.

ట్రెండింగ్ వార్తలు

CSK vs RCB: ప్లేఆఫ్స్ చేరిన బెంగళూరు.. చిన్నస్వామిలో అద్భుత విజయం.. వరుసగా ఆరో గెలుపు.. చెన్నై ఎలిమినేట్

RCB vs CSK: బాదేసిన బెంగళూరు.. డుప్లెసిస్, కోహ్లీ, పాటిదార్ మెరుపులు.. చెన్నై ముందు భారీ టార్గెట్.. ప్లేఆఫ్స్ చేరాలంటే..

Rohit Sharma: రోహిత్ శర్మతో మాట్లాడిన నీతా అంబానీ.. వీడియో వైరల్.. ఆ అంశం గురించే అంటున్న ఫ్యాన్స్

Virat Kohli : విరాట్​ కోహ్లీ గల్లీ క్రికెట్​ టీమ్​లో నలుగురు స్టార్​ ప్లేయర్స్​..

చివరిసారి ఆసియా కప్ ఫైనల్లో ఆడినప్పుడు కూడా శ్రీలంక 50 పరుగులకే చేతులెత్తేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కూడా టీమిండియా బౌలర్లను చూసి వణికిపోయింది. తొలి బంతికే వికెట్ కోల్పోయిన ఆ టీమ్.. మళ్లీ కోలుకోలేకపోయింది. బుమ్రా, సిరాజ్, షమిల ధాటికి ఆ టీమ్ బ్యాటర్లు పెవిలియన్ పరేడ్ చేశారు. షమి 5, సిరాజ్ 3, బుమ్రా, జడేజా చెరొక వికెట్ తీసుకున్నారు.

రికార్డులే రికార్డులు

ఈ మ్యాచ్ లో శ్రీలంక తొలి ఐదుగురు బ్యాటర్లు కలిసి కేవలం 2 పరుగులకే చేశారు. మెన్స్ వన్డే క్రికెట్ చరిత్రలో తొలి ఐదుగురు బ్యాటర్లు జోడించిన అతి తక్కువ స్కోరు ఇదే. ఇక మహ్మద్ షమి ఈ ఐదు వికెట్లతో ఇండియా తరఫున వరల్డ్ కప్ లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. తన 13వ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడిన షమి.. 45 వికెట్లు తీశాడు.

ఈ క్రమంలో జహీర్ ఖాన్, శ్రీనాథ్ 44 వికెట్ల రికార్డును అధిగమించాడు. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ లలో షమి ఐదు వికెట్లు తీయడం ఇది రెండోసారి. షమి 5 ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇక బుమ్రా, సిరాజ్ తాము వేసిన తొలి బంతులకే వికెట్లు తీశారు. వరల్డ్ కప్ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇక వరల్డ్ కప్ మ్యాచ్ లలో తొలి బంతికే వికెట్ తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా బుమ్రా నిలిచాడు.

శ్రీలంక టీమ్ లో ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. సిరాజ్ 16 పరుగులకు 3 వికెట్లు, బుమ్రా 5 ఓవర్లలో 8 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో ఇండియా ఏడు మ్యాచ్ లలో అన్నీ గెలిచి 14 పాయింట్లతో సెమీఫైనల్లోకి వెళ్లింది. మిగతా మూడు స్థానాల కోసం కనీసం ఐదు జట్లు పోటీ పడనున్నాయి.

తదుపరి వ్యాసం