తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Balineni Issue: బాలినేని బాధేమిటి..? అంతుచిక్కని ఒంగోలు నాయకుడి అంతరంగం

Balineni Issue: బాలినేని బాధేమిటి..? అంతుచిక్కని ఒంగోలు నాయకుడి అంతరంగం

HT Telugu Desk HT Telugu

02 May 2023, 9:53 IST

    • Balineni Issue: ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాను కంటి చూపుతో శాసించిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు జిల్లాతో ఏ సంబంధం లేకుండా పోయింది. మూడు జిల్లాల సమన్వయకర్తగా ఉన్నా సొంత జిల్లాలో ఎలాంటి గుర్తింపు లేకపోవడం మాజీ మంత్రిని స్థిమితం లేకుండా చేస్తోంది. 
సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆరోపణ
సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆరోపణ

సొంత పార్టీ వారే కుట్రలు చేస్తున్నారని బాలినేని ఆరోపణ

Balineni Issue: మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మూడ్రోజుల క్రితం తన పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, కీలక నాయకులు బాలినేనిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అవి కొలిక్కి రాలేదు. గత వారం వైసీపీ ప్రాంతీయ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త పదవి నుంచి బాలినేని తప్పుకున్నారు. సమస్యపై మాట్లాడటానికి తాడేపల్లికి రావాలని వైసీపీ పెద్దలు పిలిచినా బాలినేని స్పందించలేదు. మూడు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. సొంత జిల్లాలో ప్రాధాన్యత లేకపోవడంతో బాలినేని అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీని తన కనుసన్నల్లో ఉంచుకునే వారు. ఇప్పుడా పరిస్థితిలో మార్పు వచ్చింది. తనకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని బాలినేని భావిస్తున్నారు. గత ఏడాది మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలో పదవి కోల్పోయినప్పటి నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. తనకు పదవి కోల్పోవడంతో పాటు మంత్రి ఆదిమూలపు సురేష్‌ను మంత్రి పదవిలో కొనసాగించడం బాలినేనిని పుండుమీద కారం చల్లినట్టైంది.

ప్రకాశం జిల్లాలో సురేష్‌ను మంత్రిగా కొనసాగించి తనను తొలగిస్తే అది తనకు అవమానమేనని బాలినేని వాపోయినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా బుజ్జగించి మంత్రి హోదాకు ఏ మాత్రం తగ్గని గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మూడు జిల్లాలకు సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించారు. అప్పట్నుంచి బాలినేని అసంతృప్తి కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ప్రకాశం జిల్లాలో ఈబీసీ నేస్తం నిధుల విడుదల కార్యక్రమంలొో హెలిప్యాడ్ వద్దకు వెళ్లే క్రమంలో పోలీసులు బాలినేని వాహనాన్ని అడ్డంగించారు. కాలి నడకనే వెళ్లాలని తేల్చి చెప్పడంతో అలిగి వెళ్లిపోయారు. కార్యక్రమం ముగిసే సమయానికి వేదిక మీదకు వచ్చినా తనను కావాలనే అవమానిస్తున్నారనే అనుమానం బాలినేనిలో పెరిగిపోయింది.

వైవీ సుబ్బారెడ్డితో విభేదాలు…

ప్రకాశం జిల్లా వైసీపీలో ఉన్న ప్రధాన గ్రూపుల్లో ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి వర్గం యాక్టివ్ కావడం కూడా బాలినేనికి రుచించడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న సుబ్బారెడ్డి సోదరిని బాలినేని వివాహం చేసుకున్నారు. జిల్లా రాజకీయాల నేపథ్యంలో ఆధిపత్యాన్ని నిలుపుకునే క్రమంలో సుబ్బారెడ్డికి, బాలినేనికి మధ్య దూరం పెరిగింది. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ టిక్కెట్ సుబ్బారెడ్డికి దక్కలేదు. ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశించినా అది కూడా దక్కలేదు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా నెరవేరలేదు. మరోవైపు బాలినేని ఒంగోలు ఎంపీ టిక్కెట్‌ ఈసారి వైవీ సుబ్బారెడ్డికి అనుమానిస్తున్నారని ప్రకాశం జిల్లా నేతలు చెబుతున్నారు.

జిల్లా రాజకీయాల నుంచి తనను పథకం ప్రకారం పక్కన పెట్టేయడం వెనుక వైవీ.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు కుట్ర పన్నారని బాలినేని వర్గం ఆరోపిస్తోంది. గౌరవం లేని చోట ఉండటం కంటే పదవి నుంచి తప్పుకోవడం మేలనే ఉద్దేశంతోనే రాజీనామా చేశారని చెబుతున్నారు.

మరోవైపు బాలినేని వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి కూడా అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తరచూ అలకబూనే వైఖరి ఇబ్బందికరమనే భావన పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాలినేని వర్గం మాత్రం జిల్లాలో తరచూ ప్రోటోకాల్ వివాదాలతో ఉద్దేశపూర్వకంగానే అవమానిస్తున్నారని ఆరోపిస్తోంది. సీఎం మీటింగ్ రోజున ప్రోటోకాల్ పేరుతో పోలీసులు ఆపడం కుట్రేనని ఆరోపిస్తోంది.

ఇటీవల విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేస్తున్న ఆరోపణలతో బాలినేని ఇరకాటంలో పడ్డారు. బాలినేని వియ్యంకుడు కుందా భాస్కర్ రెడ్డి విశాఖ జిల్లా అచ్యుతా పురంలో అటవీభూములు ఆక్రమించి లే ఔట్ వేశారని జనసేన నాయకుడు ఆరోపసిస్తున్నాడు. బాలినేని అండతోనే వియ్యంకుడు భూ దందాలకు పాల్పడ్డారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించాడు. ఈ ఆరోపణలు వెనుక వైసీపీ నాయకులు ఉణ్నారని బాలినేని అనుమానిస్తున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన డిఎస్పీల బదిలీల్లో ఒంగోలు డీఎస్పీని బాలినేనికి తెలియకుండా నియమించడం కూడా అక్కసుకు కారణమైంది.

ఒంగోలు ఎంపీ టిక్కెట్‌ను తన కుమారుడికి ఇప్పించాలని భావిస్తున్న బాలినేని దానికి వైవీ సుబ్బారెడ్డి నుంచి పోటీ ఉండటంతో రగిలిపోతున్నారని ప్రకాశం జిల్లా నేతలు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా బాలినేని వ్యవహారాన్ని చూసిచూడనట్లు వదిలేయడంతో సమన్వయకర్త పదవి నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. బాలినేని బెదిరింపులకు వైసీపీ పెద్దలు లొంగిపోతారో లేదో చూడాలి.

తదుపరి వ్యాసం