తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Phase1: లేదు లేదంటూనే..! దశల వారీగా పోలవరం నిర్మాణంపై కేంద్రం క్లారిటీ

Polavaram Phase1: లేదు లేదంటూనే..! దశల వారీగా పోలవరం నిర్మాణంపై కేంద్రం క్లారిటీ

HT Telugu Desk HT Telugu

26 July 2023, 6:52 IST

    • Polavaram Phase1: గడువులు, డెడ్‌లైన్‌లు పొడిగిస్తుండగానే పోలవరం విషయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ఇన్నాళ్లు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్న విషయం నిజమేనని తేలిపోయింది. దశల వారీగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు పార్లమెంటులో ఇచ్చిన సమాధానంతో తేలిపోయింది. 
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ:
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ:

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ:

Polavaram Phase1: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రకరకాల అవంతరాలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంతకంతకు పెరుగుతుంటే తాజాగా కేంద్రం మరో బాంబు పేల్చింది. పోలవరం మొదటి దశ అంటూ కొత్త మెలికను తెరపైకి తెచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి తొలిదశ, మలిదశ అనే ప్రతిపాదనలు ఏవి వినిపించలేదు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Akhila Priya Bodyguard Attacked : అఖిల ప్రియ బాడీగార్డ్ పై దాడి, సీసీ కెమెరాలో రికార్డు-ఐదుగురిపై కేసు నమోదు

Tadipatri Violence : తాడిపత్రిలో చెలరేగిన హింస- కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి

AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?

EAPCET Exam Centres: విద్యార్ధులకు అలర్ట్.. నంద్యాలలో ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాల మార్పు

ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత పోలవరం పనుల్ని 2018నాటికి పూర్తి చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2019నాటికి కూడా ఆ పనులు పూర్తి కాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ 2022 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీటిని అందిస్తామని చెప్పింది. అది కూడా సాంకేతిక కారణాలతో నెరవేరలేదు.

పోలవరం నిర్మాణంలో జాప్యానికి కారణం మీరంటే మీరని టీడీపీ, వైసీపీలు ఒకరినొకరు విమర్శించుకోవడమే సరిపోయింది. మరోవైపు పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున రాష్ట్రం చేతులెత్తేస్తే కేంద్రమే ఆ పని పూర్తి చేస్తుందని ఇటీవల బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి సూచించారు.

తెరపైకి తొలిదశ….

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రం బదులిచ్చింది. కేంద్ర జలశక్తి శాఖ ద్వారా వచ్చిన సమాధానాల్లో తొలిదశ నిర్మాణాలుగా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన సాగునీటి ప్రాజెక్ట్‌ తొలిదశలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి అదనంగా 12,911 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు వెల్లడించారు. ఈ మేరకు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబు చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్‌ తొలిదశ కింద చేపట్టిన నిర్మాణాల్లో మిగిలిన పనులు పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిలువ చేసేందుకు 10 వేల 911.15 కోట్ల రూపాయలు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మాణాల మరమ్మతుల కోసం మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి తమకు అభ్యంతరం లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్‌ 5న తెలిపిందని పేర్కొన్నారు. పోలవరం నిధులకు సంబంధించి గతంలో తీసుకున్న నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తాజా ప్రతిపాదనలను ఆమోదించాల్సి ఉందని మంత్రి వివరించారు.

పోలవరం తొలిదశ నిర్మాణంలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి సవరించిన అంచనాల ప్రకారం 17,144 కోట్ల రూపాయలు అవసరం ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గత జూన్‌ 5న తమకు ప్రతిపాదనలు సమర్పించిందని మంత్రి తెలిపారు. వీటిని త్వరితగతిన పరిశీలించి ప్రభుత్వ ఆమోదం పొందేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రక్రియ నిర్దిష్ట కాలపరిమితిలోగా పూర్తి చేయాలని కోరడం సబబు కాదని అన్నారు.

పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయంకు సంబంధించి మార్చి 15, 2022న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనల ప్రాతిపదికన తక్షణం 10 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి జూలై 15, 2022న రాసిన లేఖను కూడా ఆర్థిక శాఖ వ్యయ విభాగం పరిగణలోకి తీసుకున్న తర్వాత మొత్తం 12,911 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని మంత్రి పేర్కొన్నారు.

పునరావాస భారం తప్పించుకోడానికేనా…

పోలవరం ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యంతో నిర్మాణం చేపడితే నిర్వాసితులను తరలించడానికి పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుంది. దాదాపు లక్ష కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే గోదావరి వరదల కారణంగా పెద్ద ఎత్తున ముంపు ఏర్పడుతున్నందున పూర్తి స్థాయిలో అధ్యయనం చేపట్టాలని పొరుగు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 41.5మీటర్లకే పోలవరం ఎత్తును పరిమితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలవరం ప్రాజెక్టులో తొలిదశ, మలిదశ అంటూ ఏమి లేవని గతంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు కూడా స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించడానికి రాష్ట్ర ప్రభుత్వం అమోదం తెలిపిందని విపక్షాలు విమర్శించిన సమయంలో దానిని ఏపీ ప్రభుత్వం ఖండించింది. తాజాగా కేంద్ర జలశక్తి శాఖ పార్లమెంటులో ప్రకటించిన లేఖలో తొలి దశ అని స్పష్టంగా ప్రస్తావించడం, రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను ఉటంకించడంతో ఆరోపణలు నిజమేనని తేలింది.

ఈ సీజన్‌లో కూడా డ్యామ్‌ నిర్మాణం కష్టమే….

మరోవైపు పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మాణానికి మరో సవాలు ఎదురయింది. గోదావరి ప్రవాహాన్ని అడ్డుకట్ట వేస్తూ నిర్మించిన కాఫర్‌ డ్యామ్‌ల నుంచి నీరు లీకవుతుండటంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదకు మళ్లించి పనులు చేపట్టేలా రెండు కాఫర్‌ డ్యామ్‌లు నిర్మించారు.

వరదలు వచ్చినా నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని భావించారు. కాఫర్‌ డ్యామ్‌ల నిర్మాణం పూర్తయ్యాక తొలిసారి గోదావరికి వరద వచ్చింది. రెండు కాఫర్‌ డ్యామ్‌ల మధ్య కొంత సీపేజీ తప్ప ఇలా సమస్యలు ఉండకూడదు.

అయితే గోదావరికి అడ్డంగా నిర్మించిన ఎగువ కాఫర్‌డ్యాం సీపేజీ, లీకేజీ అంచనాలకు మించి ఉంది. రెండు కట్టల మధ్య భారీగా నీరు చేరింది. దీంతో పనులు పూర్తిగా నిలిపివేశారు. కాఫర్‌డ్యాంల మధ్య సులువుగా పనులు చేసుకోవాల్సిన ప్రాంతంలో ప్రస్తుతం 19.72 మీటర్ల మేర నీరు నిలిచింది. ఈ ప్రాంతంలో 14 మీటర్ల నీరు ఉంటే పనులు జరపడానికి ఎలాంటి అటంకం ఉండదని అధికారులు చెబుతున్నారు.

కాఫర్ డ్యామ్‌ల మధ్య 19 మీటర్లు ఎత్తున నీరు నిల్వ ఉండటంతో పనులు ఆపేశారు. కాఫర్ డ్యామ్‌ల మధ్య గంటకు ఒక సెంటీమీటరు చొప్పున ఆ మధ్య ప్రాంతంలో నీటిమట్టం పెరుగుతోందని లెక్కించారు. ప్రతి 4 రోజులకు ఒక మీటరు నీటిమట్టం పెరుగుతున్నట్లు గుర్తించారు. ఎగువ, దిగువ డ్యాంల మధ్య పని చేయాలంటే నీటిమట్టం 14 మీటర్లకన్నా దిగువే ఉండాల్సి ఉండటంతో ఈ సీజన్‌లో ఎర్త్ కమ్ రాక్‌ ఫిల్ డ్యామ్ నిర్మాణం కష్టమేనని అధికారులు భావిస్తున్నారు.

తదుపరి వ్యాసం