Railway Concessions : వికలాంగులకు ఆన్‌లైన్‌లో రైల్వే రాయితీ కార్డులు….
10 January 2023, 10:14 IST
- Railway Concessions రైలు ప్రయాణాల్లో వికలాంగులకు రాయితీతో ప్రయాణించేందుకు ధృవీకరణ పత్రాలను ఆన్లైన్‌లో మంజూరు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణ మధ్య రైల్వే దివ్యాంగ్‌జన్ రైల్వే రాయితీ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు.
ఆన్‌లైన్ రాయితీ కార్డులు
Railway Concessions దివ్యాంగులకు రైలు ప్రయాణాల్లో రాయితీలను వినియోగించుకోడానికి రాయితీ గుర్తింపు కార్డుల్ని ఆన్‌లైన్‌లో జారీ చేస్తున్నారు. రాయితీ ID కార్డ్‌ల జారీ కోసం దరఖాస్తు పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి వెబ్ ఆధారిత అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు.
విజయవాడ డివిజన్‌లోని వాణిజ్య విభాగం, దక్షిణ మధ్య రైల్వే డివిజన్ అంతటా రైల్వే రాయితీని పొందుతున్న దివ్యాంగ లబ్ధిదారులకు కలిగించేందుకు అంతర్గత వెబ్ ఆధారిత ‘దివ్యాంగ్ జన్ రైల్వే కన్సెషన్ ID కార్డ్ సిస్టమ్’ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు.
వెబ్ అప్లికేషన్ యొక్క ట్రయల్ వెర్షన్‌ను 22 డిసెంబర్ 2022న తెనాలి-గూడూరు సెక్షన్ వార్షిక తనిఖీ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఇటీవల ప్రారంభించారు. కొత్త విధానంలో విజయవాడ డివిజన్ పరిధిలో నివసిస్తున్న దివ్యాంగులకు పూర్తిగా అందుబాటులోకి వచ్చింది.
దివ్యాంగ్ జన్ కన్సెషన్ ఫోటో ID కార్డ్‌లను పొందడం కోసం ఆన్‌లైన్ ద్వారా నేరుగా రైల్వే అధికారులకు వారి దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. . వెబ్ ఆధారిత అప్లికేషన్ సేవలను దక్షిణ మధ్య రైల్వే వెబ్‌సైట్ https://scr.indianrailways.gov.in/ విజయవాడ డివిజన్‌లోని వాణిజ్య విభాగం అధికారిక పేజీలో అందుబాటులో ఉంటుంది.
దివ్యాంగుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వేలు ఇ-టికెటింగ్ ఫోటో గుర్తింపు కార్డు వ్యవస్థను ప్రారంభించాయి. లబ్దిదారులు రిజర్వేషన్ కౌంటర్లను సంప్రదించకుండా IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో రాయితీ ప్రయాణ టిక్కెట్‌లను పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ ఇ-టికెటింగ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ సిస్టమ్‌ను పొందడానికి, దివ్యాంగులు సాధారణంగా డివిజనల్ ఆఫీస్ లేదా సెక్షనల్ హెడ్ క్వార్టర్స్‌ను సంప్రదించి రైల్వే అడ్మినిస్ట్రేషన్ ద్వారా తగిన ధృవీకరణ తర్వాత ఇ-టికెటింగ్ ఫోటో గుర్తింపు కార్డును పొందాల్సి ఉంటుంది. ఇందు కోసం వారి ఆధారాలు, రాయితీ సర్టిఫికేట్లు మరియు ఇతర సూచించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఫోటో గుర్తింపు కార్డులు పొందేందుకు 'దివ్యాంగులు' పడుతున్న కష్టాలను తగ్గించేందుకు, డివిజనల్ ఆఫీస్/సెక్షనల్ హెడ్ క్వార్టర్స్‌కు భౌతికంగా రాకపోకల అవసరాన్ని తగ్గించడానికి, రాయితీ కార్డు ప్రాసెసింగ్ సమయాన్ని తగ్గించడానికి, వెబ్ ఆధారిత 'దివ్యాంగుల సేవలను' ప్రారంభించింది. దివ్యాంగులు తమ ఆన్‌లైన్ వెబ్ అప్లికేషన్ కోసం https://scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,291,358,748,2677 లింకు ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దివ్యాంగులు దరఖాస్తుదారుల రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అవసరమైన వివరాలు పూరించిన తర్వాత ఆన్‌లైన్ ద్వారా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్‌ను సమర్పించే విధానాన్ని వినియోగదారుల సౌలభ్యం కోసం YouTube లో అందుబాటులో ఉంచారు.
రైల్వే సిబ్బంది ధృవీకరించిన తర్వాత ఐడీ కార్డ్ జారీ చేస్తారు. దరఖాస్తుదారులు ప్రభుత్వ వైద్యుడు జారీ చేసిన వారి ఒరిజినల్ రైల్వే కన్సెషన్ సర్టిఫికేట్‌ను సరెండర్ చేయడం ద్వారా వారి సంబంధిత దివ్యాంగులు రైల్వే కన్సెషన్ ID కార్డును సీనియర్ డిసిఎం, సెక్షన్ కార్యాలయాల్లో పొందవచ్చు.