తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram Porukeka: “విజయవాడ చేరుకున్న పోలవరం పోరుకేక” నేడు పాదయాత్ర ముగింపు

Polavaram PoruKeka: “విజయవాడ చేరుకున్న పోలవరం పోరుకేక” నేడు పాదయాత్ర ముగింపు

HT Telugu Desk HT Telugu

04 July 2023, 6:25 IST

    • Polavaram PoruKeka: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భారీ పాదయాత్ర విజయవాడ చేరుకుంది. సోమవారం  గన్నవరం నుండి బయలుదేరిన పోలవరం పోరుకేక మహా పాదయాత్ర  సాయంత్రానికి విజయవాడలో ప్రవేశించింది.  మంగళవారం విజయవాడ ధర్నా చౌక్‌లో  బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. 
నేడు విజయవాడలో పోలవరం నిర్వాసితుల మహాధర్నా
నేడు విజయవాడలో పోలవరం నిర్వాసితుల మహాధర్నా

నేడు విజయవాడలో పోలవరం నిర్వాసితుల మహాధర్నా

Polavaram PoruKeka: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్న పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పాదయాత్ర నేడు ముగియనుంది. పోరుకేక పేరుతో గత 14 రోజులుగా నిర్వాసితుల పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు సారథ్యంలో అడవి బిడ్డలు జూన్‌ 20న భద్రాచలంలోని నెల్లిపాకలో మొదలుపెట్టిన మహా పాద యాత్రకు అపూర్వ రీతిలో సంఫీుభావం లభించింది. గోదావరి తీరంలో కొండలు, కోనలు, గిరిజన గూడేల గుండా నిర్వాసితులు తమ హక్కుల కోసం కదం తొక్కుతూ, పదం పాడుతూ, డప్పులతో ఉద్యమ గీతాలు, రేలా నృత్యాల మధ్య దండులా కదులుతున్నారు.

నాలుగు జిల్లాలు 15 మండలాలు 235 గ్రామాల మీదుగా గోదావరి, శబరి నదులను దాటుతూ 390 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు. యాత్రలో 12 సంవత్సరాల బాలల నుంచి 70 సంవత్సరాల వృద్దుల వరకు పాదయాత్రలో నడిచారు. దారి పొడవునా ఈ మహా పాద యాత్రకు స్థానికులు నీరాజనాలు పలికారు.

అమరులైన పోరాట యోధుల స్థూపాల వద్ద నివాళులర్పిస్తూ, ప్రధాన కూడళ్లలో సభలు నిర్వహిస్తూ, నిర్వాసితులను చైతన్యపరుస్తూ ప్రవాహంలా సాగిపోతున్న ఈ పాదయాత్రలో గిరిజన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ప్రతి గ్రామంలో పేదలే ఇంటింటికి బియ్యం, పప్పుదినుసులు సేకరించి పాదయాత్రలో పాల్గొన్నవారికి భోజనం పెట్టారు. రాత్రి, మధ్యాహ్నం బసలో వెంట తెచ్చుకున్న చాపలపై చెట్ల నీడలో విశ్రమించారు.

48 డిగ్రీల ఎండలో బొబ్బలెక్కినా నిర్వాసితులు వెనకడుగు వేయలేదు. పాదయాత్ర జరుగుతున్న తీరును సామాజికమాధ్యమాల్లో చూసి అనేకమంది దాతలు చెప్పులు, బెడ్‌షీట్లు ఇచ్చారు. డాక్టర్లు వైద్యం చేశారు. ముంపు బాధితులకు మేమున్నాం అంటూ సిపిఐ, తెలుగుదేశం, వైసిపి, జనసేన తదితర రాజకీయ పార్టీలు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయకార్మికులు, కార్మికులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నేతలు, ప్రొగ్రెసివ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు సంఘీభావం తెలిపారు.

ప్రతిరోజూ పాదయాత్రలో సుమారు 350 మంది పాల్గొంటున్నారు. పాదయాత్ర వెళ్ళిన ప్రతి గ్రామం నుండి సంఫీుభావంగా మరో సుమారు 400 మంది పాల్గొని కొంతదూరం నడుస్తున్నారు. పోలవరం నుండి మరో ఉప పాదయాత్ర జూన్‌ 28న ప్రారంభమయి తరువాత ప్రధాన యాత్రలో భాగస్వామి అయ్యింది.

పాదయాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరినీ కలుస్తూ, వారి గోడును ఆలకిస్తూ, వారు ఇచ్చిన అర్జీలను స్వీకరిస్తూ, వారిని పోరాటోన్ముఖులను చేయడంలో పాదయాత్ర సారథులు, నాయకులు చాలా ఓర్పుగా, నేర్పుగా వ్యవహరిస్తున్నారు. పోలవరం కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణంతో అని గత ఏడాది గోదారి వరద పోటెత్తినప్పుడు ముంపు గ్రామాల ప్రజలు పడిన అవస్థలు వర్ణనాతీతమని బాధితులు చెబుతున్నారు. ఒక వైపు ఎడతెరపి లేకుండా భోరున కురుస్తున్న వర్షంలో ప్రాణాలు అరచేత పెట్టుకుని పిల్లా పాపలతో కొండలు, గుట్టలపైన దాదాపు నెల రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ గిరిజన కుటుంబాలు బతుకువెళ్లదీశాయి.

ఇప్పుడు మరోసారి అటువంటి ఉపద్రవం ముంచుకొచ్చే ప్రమాదమున్నందున ముందుగానే హెచ్చరిస్తూ, పోలవరం ముంపుగ్రామాల ప్రజల పునరావాసానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సిపియం పార్టీ ఉద్యమించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న వాదనలు, వాస్తవ పరిస్థితికి మధ్య ఉన్న తేడాను వివరిస్తూ తీసుకొచ్చిన బుక్‌లెట్‌కు విశేష స్పందన లభించింది.

లక్ష కుటుంబాలపై ముంపు ప్రభావం….

రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల పరిధిలో 8 మండలాలపై ముంపు ప్రభావం ఉంటోంది. దేవీపట్నం, చింతూరు, వి.ఆర్‌.పురం, కూనవరం, ఎటపాక, పోలవరం, కుక్కనూరు, వేలేరుపాడు మండలాల్లోని 222 పంచాయతీలు 373 గ్రామాలు, 1,06,006 కుటుంబాలు మొత్తం నీట మునిగి పోతాయి. ఇంత భారీ ఎత్తున గిరిజనులు, గిరజనేతరులు లక్షల కుటుంబాలు ప్రాజెక్టు నిర్మాణంతో సర్వ నాశనమైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయకపోవడం అత్యంత దుర్మార్గమని చెబుతున్నారు.

గిరిజన గూడేలు సమస్యల నిలయాలుగా ఉన్నాయని, రైతులకు విత్తనాలు ఆపేశారని, పంట కొనుగోలు చేయడం లేదని అదేమంటే మీది ముంపు గ్రామం అని అధికారులు చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ముంపు బాధితులకు పరిహారం చెల్లించండి అని అడిగితే మీది 41.5 మీ. కాంటూరు పరిధిలో లేదు. కాబట్టి ముంపుగ్రామం కాదంటున్నారని, అందువల్ల పరిహారం రాదని మళ్లీ ఇదే అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు.

41.5 మీటర్ల దగ్గర 20 గ్రామాలు మాత్రమే మునిగిపోతాయని నిర్ధారించారని, 20 వేల మందిని మాత్రమే నిర్వాసితులుగా తేల్చడం అన్యాయమంటున్నారు. గత వరదల్లో 40 మీటర్లకు కూడా చేరకముందే 193 గ్రామాలు మునిగిపోయాయయని ఇంతకీ ప్రభుత్వ లెక్కల్లో ముంపు గ్రామమా, కాదా తేల్చి చెప్పండని బాధితులు అడుగుతున్నారు.

ప్రాజెక్టు ప్రదేశంలోని గ్రామాలను వరద వస్తుందనే పేరుతో బలవంతంగా ఖాళీ చేయించారని, నిర్వాసిత గ్రామాలలో కనీస సౌకర్యాలైన విద్యుత్‌, నీరు, ఉపాధి, స్మశానం, వైద్యం అందుబాటులో లేవు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం లేదని చెబుతున్నారు.

పోలవరం నిర్వాసితులు కోరుతున్న వాటిలో గొంతెమ్మ కోర్కెలు ఒక్కటంటే ఒక్కటీ లేదని, 2013 భూసేకరణ చట్టం, పెసా, 1/70 యాక్ట్‌, రాజ్యాంగంలోని అయిదో షెడ్యూల్‌ కింద ఆదివాసీలకు కల్పించిన రక్షణలను అమలు చేయమని మాత్రమే వారు కోరుతున్నారన్నారు. ఎన్నికల ముందు పాలక పార్టీ ఇచ్చిన హామీలపై మడమ తిప్పకుండా, మాట తప్పకుండా అమలు చేయమని మాత్రమే డిమాండ్‌ చేస్తున్నారు. మహా పాదయాత్రకు ముగింపుగా జులై 4న విజయవాడలో మహా ధర్నాకు కదలి వచ్చారు. ఈ మహాధర్నాలో సిపియం పోలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, పాదయాత్రకు నాయకత్వం వహించిన రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ htతదితరులు పాల్గొంటారు.

తదుపరి వ్యాసం