తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  మార్కెట్ విలువ పెంపు.. కొత్త జిల్లాల్లో కొత్త బాదుడు..!

మార్కెట్ విలువ పెంపు.. కొత్త జిల్లాల్లో కొత్త బాదుడు..!

HT Telugu Desk HT Telugu

07 April 2022, 14:28 IST

    • ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటై నాలుగైదు రోజులు గడిచాయో లేదో, రిజిస్ట్రేషన్‌ బాదుడు మొదలైంది.
స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్.. భూముల మార్కెట్ విలుప పెంపుతో మరింత కుదేలవనుందా?
స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్.. భూముల మార్కెట్ విలుప పెంపుతో మరింత కుదేలవనుందా? (unsplash)

స్తబ్ధుగా ఉన్న రియల్ ఎస్టేట్.. భూముల మార్కెట్ విలుప పెంపుతో మరింత కుదేలవనుందా?

పాలనా సౌలభ్యం., ప్రజలకు మెరుగైన సేవల మాటేమో కానీ కొత్త జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల చుట్టు పక్కల ప్రాంతాల్లో పెంచిన మార్కెట్ విలువలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. కొత్త జిల్లా కేంద్రాలు, వాటికి సమీపంలో ఉన్న నివాస ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా రివిజన్ అమలు చేస్తోంది. 

ట్రెండింగ్ వార్తలు

AP Petrol Bunks : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

జాతీయ రహదారులు, దుకాణాలు, పరిశ్రమలకు సమీపంలో ఉన్న ప్రాంతాలు, నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల ప్రతిపాదికగా భూముల విలువ పెంచారు. మార్కెట్ విలువ సవరించడంతో రిజిస్ట్రేషన్ ఛార్జీల రూపంలో రెవిన్యూ శాఖకు కోట్లాది రుపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. 

ప్రస్తుతం జిల్లా కేంద్రాలు ఏర్పడటంతో స్థానికంగా ఏర్పడే డిమాండ్‌కు అనుగుణంగా భూముల ధరలను ప్రభుత్వం సవరించింది. అయా ప్రాంతాల్లో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో భూముల మార్కెట్ విలువను 13 శాతం నుంచి 75 శాతం వరకు పెంచారు. మరోవైపు బాపట్ల, నరసరావు పేట ప్రాంతాల్లో ఇప్పటికే పెంచిన ధరలు అమలు కానున్నాయి.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర..

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఒక్కోవిధంగా ధరలు పెరిగాయి. తిరుపతి జిల్లాలోని నాలుగు సబ్ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 20 నుంచి 75 శాతం వరకు ధరలు పెరగాయి. ఇటు విజయవాడ శివార్లలోని పెదపులిపాక ప్రాంతం కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్లింది. ఈ ప్రాంతంలో 38 శాతం రిజిస్ట్రేషన్‌ విలువ పెరిగింది. 

విజయవాడ నగరంలో భాగమైన కానూరు, పోరంకి ప్రాంతాలు ఇటీవల కాలంలో వేగంగా విస్తరిస్తున్నాయి. నగరాన్ని అనుకుని ఉన్నా రాజకీయ కారణాలతో ఈ ప్రాంతాలు పంచాయితీలుగానే కొనసాగుతున్నాయి. ఇప్పుడు జిల్లాల విభజనతో ఇవన్ని కృష్ణా జిల్లాలో భాగం అయ్యాయి. ఇన్నాళ్లు విజయవాడ నగరంలో విలీనం అవ్వడానికి వ్యతిరేకించిన ప్రాంతాలకు ఇప్పుడు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న మచిలీపట్నం జిల్లా కేంద్రం అయ్యింది.

మార్కెట్‌ విలువ పెరిగినా కొనే వారేరి...

కానూరు ప్రాంతంలో మార్కెట్ విలువ రూ. 13, 500 నుంచి రూ. 17 వేలకు చేరింది. విజయవాడ బందరు రోడ్డుకు ఇరువైపులా గజం ధర లక్ష రుపాయలు దాటిపోయింది. నిజానికి ఈ ధరతో కొనుగోళ్ళు 2014లోనే నిలిచిపోయాయి. 

రిజిస్ట్రేషన్ లావాదేవీలు పెద్దగా జరగడం లేదు. గరిష్ట స్థాయికి భూముల విలువ చేరడంతో లావాదేవీలు క్రమంగా పడిపోతున్నాయి. వాణిజ్య కార్యకలాపాల కోసం మినహా ఈ స్థాయిలో విలువ చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి జనం వెనుకాడుతున్నారు.

పశ్చిమలో కూడా మోత....

ఉభయ గోదావరి జిల్లాలకు నడుమ ఉండే కొవ్వూరులో ఎకరం భూమి రూ. 35 లక్షల నుంచి రూ. 42 లక్షలకు చేరింది. రాజమండ్రికి దగ్గర్లో ఉండటం వల్ల ఇక్కడ భూములకు విలువ పెరిగింది. రాజమండ్రిలో గరిష్టంగా గజం విలువ పదివేలకు పైగా పెరిగింది. కోనసీమ జిల్లాల్లో ఒక్కో గజంపై 4500 రుపాయల వరకు విలువ పెరిగింది.

ఉత్తరాంధ్ర జిల్లాలో అనకాపల్లిలోని 76 ప్రాంతాల్లో సగటున 16 నుంచి 30 శాతం వరకు భూముల విలువ పెరిగింది. అటు గిరిజన ప్రాంతాల్లో సైతం భూముల విలువ పెరిగింది. మన్యం జిల్లాలో పార్వతీపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో 30 శాతం వరకు ధరలు పెరిగాయి.

అంచనాలు అందుకునేనా..

నిజానికి ఆంధ్రప్రదేశ్‌‌లో గత మూడేళ్లుగా భూముల విక్రయాల్లో స్తబ్థత కొనసాగుతోంది. రాజధాని మార్పు, వికేంద్రీకరణ నిర్ణయాలతో ఏ ప్రాంతంలోనూ దూకుడుగా రియల్‌ ఎస్టేట్ రంగం సాగడం లేదు. 

మొదట్లో విశాఖపట్నం కేంద్రంగా విక్రయాలు జోరుగా సాగినా తదనంతర పరిణామాలతో అచితూచి విక్రయాలు సాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో సహజమైన వృద్ధిలో భాగంగా శివారు ప్రాంతాలు విస్తరిస్తున్నాయి. 

ఈ క్రమంలో అపార్ట్‌మెంట్లకు ఇప్పుడిప్పుడే గిరాకీ పెరుగుతోంది. రెండేళ్లుగా కోవిడ్‌ ఇబ్బందులు ఎదురవడంతో చాలా చోట్ల క్రయవిక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం భూముల విలువ పెంచడంతో దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలియడానికి కొద్ది రోజుల సమయం పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ వాతావరణంలో నిలకడ.. మార్కెట్‌ నిలదొక్కుకోవడంలో ప్రధాన పాత్ర పోషించనుంది.

తదుపరి వ్యాసం