తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలీడే ఆంక్షల తొలగింపు

AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు పవర్ హాలీడే ఆంక్షల తొలగింపు

HT Telugu Desk HT Telugu

05 September 2023, 7:54 IST

    • AP Power Holiday: ఆంధ్రప్రదేశ్‌లో  విద్యుత్‌ కొరతతో పరిశ్రమలకు విధించిన పవర్ హాలీడే ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి విజయానంద్ ప్రకటించారు. వాతావరణం మారిపోవడం, వర్షాలు కురుస్తుండటంతో  ఆంక్షల్ని తొలగించినట్లు వెల్లడించారు. 
పరిశ్రమలపై పవర్ హాలీడే ఆంక్షల తొలగింపు
పరిశ్రమలపై పవర్ హాలీడే ఆంక్షల తొలగింపు

పరిశ్రమలపై పవర్ హాలీడే ఆంక్షల తొలగింపు

AP Power Holiday: ఏపీలో విద్యుత్‌ కొరత కారణంగా పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాలో ఆంక్షల్ని రద్దు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రకటించింది. వారాంతపు సెలవుతో పాటు మరో రోజు అదనంగా పవర్ హాలీడే ఇవ్వాలని విద్యుత్ పంపిణీ సంస్థలు పరిశ్రమల్ని ఆదేశించాయి. గత రెండు రోజులుగా వాతావరణం చల్లబడిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ప్రారంభం కావడంతో ఆంక్షల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

రాష్ట్రంలో మారిన వాతావరణం, అల్పపీడన ప్రభావంతో విద్యుత్ వినియోగం తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న అల్పపీడన పరిస్థితులతో విద్యుత్తు వినియోగం గణనీయంగా తగ్గడంతో పరిశ్రమలకు విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.విజయానంద్‌ ప్రకటించారు.

వర్షాల కారణంగా పవర్‌ గ్రిడ్‌‌లో కొంత డిమాండ్‌ తగ్గిందని, గత రెండు రోజులుగా ఎలాంటి విద్యుత్‌ కొరత ఏర్పడ లేదని చెప్పారు. విద్యుత్‌ పంపిణీపై ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీపీసీసీ అధికారులతో విజయవాడలోని విద్యుత్‌ సౌధలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం లోడ్‌ కొద్దిమేర తగ్గి సరఫరా మెరుగుపడినందున పారిశ్రామిక వినియోగదారులకు అధికారికంగా ఆంక్షలు విధించే అవసరం లేదని భావిస్తున్నట్లు చెప్పారు.విద్యుత్‌ పంపిణీ సంస్థలు రెండు వారాల పాటు పవర్‌ హాలీడే అమలు చేయాలని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పవర్‌ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్‌ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడంలేదని విజయానంద్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నిరంగాలకు ఆదివారం ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసినట్లు తెలిపారు. ఆదివారం మొత్తం 206.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ సరఫరా చేశామని, సరఫరాలో ఎక్కడా అంతరాయాలు లేవని చెప్పారు.

సెప్టెంబర్‌ 1న రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్‌ డిమాండ్‌, సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొంత విద్యుత్‌ సరఫరా తగ్గించి, గృహ, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి, అంతరాయాలు లేకుండా విద్యుత్‌ సరఫరా చేశాయన్నారు.

వ్యవసాయ, గృహ వినియోగరంగాలను పాధాన్యతా రంగాలుగా పరిగణించి అంతరాయాలు లేని విద్యుత్‌ సరఫరా చేయాలని విద్యుత్‌ సంస్థలు భావించాయని, ఇందులో భాగంగానే డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేర సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో విద్యుత్‌ సరఫరా చేస్తామని విద్యుత్తు నియంత్రణ మండలికి అభ్యర్ధన పంపించాయని చెప్పారు.

విద్యుత్‌ పంపిణీ సంస్థల అభ్యర్ధన మేరకు మంగళవారం నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి విద్యుత్‌ వాడకంలో పరిమితులు విధించేందుకు ప్రభుత్వం అనుమతించిందని, సరఫరా మెరుగుపడటంతో పరిశ్రమలపై విధించిన ఆంక్షలను అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు స్వల్పకాలిక మార్కెట్‌ నుండి యూనిట్‌కు రూ.9.10 చొప్పున రోజుకి దాదాపు 40 మిలియన్‌ యూనిట్లను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు.

తదుపరి వ్యాసం