తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Power Holiday: ఏపీలో విద్యుత్ కోతలు..పరిశ్రమలకు పవర్ హాలీడే

AP Power Holiday: ఏపీలో విద్యుత్ కోతలు..పరిశ్రమలకు పవర్ హాలీడే

HT Telugu Desk HT Telugu

04 September 2023, 6:35 IST

    • AP Power Holiday: ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు విద్యుత్‌ కోతలతో విలవిల్లాడుతున్నాయి.  పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో సతమతం అవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించారు. 
ఏపీలో రేపటి నుంచి పవర్ హాలీడే
ఏపీలో రేపటి నుంచి పవర్ హాలీడే

ఏపీలో రేపటి నుంచి పవర్ హాలీడే

AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్‌ హాలిడే ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఏపీలో డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ సరఫరా జరగట్లేదు. ఈ సీజన్‌లో వర్షాలు లేకపోవడంతో డిమాండ్ పెరిగిపోయింది. వ్యవసాయ అవసరాలతో పాటు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగిపోయింది. మరోవైపు రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో విద్యుత్ కోతలు అనివార్యం అయ్యాయి. మార్కెట్లో కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో మంగళవారం నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు వారంలో ఒకరోజు అదనంగా పవర్ హాలీడే అమలు చేయాలని నిర్ణయించారు.

ట్రెండింగ్ వార్తలు

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

AP EAPCET 24: నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్‌ 2024… విద్యార్థులకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ నిబంధన

విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న అటంకాలను అధిగమించేందుకు పవర్ హాలీడే అమలు చేయాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. వైద్య సంబంధిత పరిశ్రమలతో పాటు రైస్‌ మిల్లులకు మాత్రమే పవర్ హాలీడే నుంచి మినహాయింపు ఇచ్చారు. పవర్ హాలీడే కోసం పంపిణీ సంస్థలు విజ్ఞప్తి చేయడంతో విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతించింది.

గృహ అవసరాలకు అవసరమైన విద్యుత్‌తో పాటు , వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా చేసేందుకు పరిశ్రమలకు పవర్‌ హాలిడే అమలుకు అనుమతించాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు చేసిన విజ్ఞప్తికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి అంగీకారం తెలిపింది. ఆగష్టు 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు షరతులతో కూడిన పవర్‌ హాలిడేకి అనుమతిస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది.

ఏపీఈఆర్సీ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల సీఎండీలు ప్రకటించారు. గృహ, పారిశ్రామిక రంగాలతోపాటు వ్యవసాయానికి 9 గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకు విద్యుత్తు పంపిణీ సంస్థలు, ప్రభుత్వం కృషి చేస్తున్నా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏర్పడిన విద్యుత్‌ సరఫరాలో కొరత ఇబ్బందికరంగా ఉంటోంది.

రాష్ట్రంలో రోజువారీ అవసరాలకు ప్రస్తుతం 230 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం ఉందని, థర్మల్, హైడల్, గ్యాస్, పవన, సోలార్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 190 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. వర్షాలు లేకపోవడంతో వ్యవసాయానికి బోర్లపై ఆధారపడిన వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఏపీఈఆర్సీకి ప్రతిపాదనలను సమర్పించాయి.

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా, డిమాండ్‌ స్థితి, విద్యుత్‌ కొనుగోళ్ల పరిమాణం, వాటి ప్రస్తుత ధరలను పరిశీలించిన కమిషన్‌.. రాష్ట్రంలోని పరిశ్రమల విద్యుత్‌ వినియోగంపై నియంత్రణ చర్యలను చేపట్టేందుకు అనుమతించింది.

రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలోని పరిశ్రమలకు వారానికి ఒకరోజు పవర్‌ హాలిడే అమలు చేయనున్నారు. విధిలేని పరిస్థితుల్లో మాత్రమే పవర్‌ హాలిడే అమలు చేస్తున్నామని, విద్యుత్‌ లభ్యత మెరుగైతే పవర్‌ హాలిడే ఎత్తివేస్తామని సీఎండీలు పేర్కొన్నారు.

పవర్ హాలీడే నిబంధనలు ఇవే….

పరిశ్రమలు ప్రస్తుతం అమలు చేస్తున్న వారానికోరోజు వారాంతపు సెలవులకు అదనంగా మరో రోజు పవర్‌ హాలిడే అమలు చేయాలి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు ఒక షిఫ్ట్‌ మాత్రమే పనిచేయాలి.

సాయంత్రం 6 గంటల తరువాత విద్యుత్‌ వినియోగించకూడదు. పరిశ్రమలు రోజువారీ విద్యుత్‌ వినియోగంలో 70 శాతం వినియోగించుకునే విధంగా ఆయా పరిశ్రమలు అవసరమైన చర్యలు చేపట్టాలి. పవర్‌ హాలిడేని జిల్లాల వారీగా రెగ్యులేట్‌ చేస్తారు. ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు వారాలు పవర్‌ హాలిడే అమల్లో ఉంటుంది.

నియంత్రణ చర్యలు పాటించని పరిశ్రమలపై కమిషన్‌ నిర్దేశించిన జరిమానా చార్జీలు విధిస్తారు. ఈ నియంత్రణ చర్యల నుంచి బల్క్‌డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, వైద్య ఆక్సిజన్‌ ప్లాంట్లు, రైస్‌ మిల్లింగ్‌ యూనిట్లకు సంబంధించిన పరిశ్రమలకు మినహాయింపు ఉంది. రోజూ విద్యుత్‌ సరఫరా తీరును సమీక్షించి వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం అధికారులు తగిన నిర్ణయం తీసుకుంటారు.

తదుపరి వ్యాసం