తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cpm For Polavaram R&r: నిర్వాసితుల కోసం ముంపు మండలాల్లో సిపిఎం పాదయాత్ర

CPM For Polavaram R&R: నిర్వాసితుల కోసం ముంపు మండలాల్లో సిపిఎం పాదయాత్ర

HT Telugu Desk HT Telugu

22 June 2023, 12:04 IST

    • CPM For Polavaram R&R: పోలవరం నిర్వాసితులను గోదారిలో ముంచాలని ప్రభుత్వం చూస్తే,  ప్రభుత్వాన్నే గోదావరిలో ముంచుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రాజెక్టులో మునుగుతున్న గిరిజనులు, దళిత, పేద వర్గాల కోసం సిపిఎం చేపట్టిన పాదయాత్ర మూడో రోజుకు చేరింది. 
పోలవరంలో నిర్వాసితుల కోసం సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర
పోలవరంలో నిర్వాసితుల కోసం సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర

పోలవరంలో నిర్వాసితుల కోసం సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర

CPM For Polavaram R&R: పోలవరం ప్రాజెక్టు కోసం తమ ఊళ్లు, ఇళ్లు, భూములు త్యాగం చేసిన నిర్వాసితుల హక్కుల సాధనకై తాడోపేడో తేల్చుకుంటామని సిపిఎం హెచ్చరించింది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పోలవరంలో మునుగుతున్న లక్షకుపైగా కుటుంబాలకు చట్టాల ప్రకారం, ఇచ్చిన హామీల మేరకు సహాయ, పునరావాసం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

JD Lakshmi Narayana : అల్లర్ల సమయంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడమేంటి? -జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు

Chikkamagaluru : ప్రకృతి అందాలు, కొండల్లో కాఫీ తోటల్లో ట్రెక్కింగ్- చిక్కమగళూరు అద్భుతాలు చూసొద్దామా?

ప్రాజెక్టు కారణంగా నిరాశ్రయులైన చిట్టచివరి వ్యక్తి వరకు పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేసింది. నిర్వాసితుల పునరావాసం కోసం పదేళ్ల నుంచి ఆందోళనలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 'పోలవరం నిర్వాసితుల పోరు కేక' పేరిట మహా పాదయాత్రకు సిపిఎం శ్రీకారం చుట్టింది. జూన్‌ 20 నుంచి జులై 4 వరకు పదిహేనురోజుల పాటు నెల్లిపాక నుంచి విజయవాడ వరకు 400 కిలోమీటర్లు సాగే మహా పాదయాత్ర ఎటపాక మండలం నెల్లిపాక సెంటర్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది.

మూడో రోజుకు చేరిన పాదయాత్రకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సారథ్యం వహిస్తున్నారు. గిరిజన సంప్రదాయ కొమ్ముబూరతో శంఖారావం పూరించి ప్రారంభించిన యాత్రలో వేలాది మంది నిర్వాసితులు పాల్గొంటున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు విజ్జు క్రిష్ణన్‌ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు.

జీవన్మరణ పోరాటం

సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు విజ్జు క్రిష్ణన్‌ మాట్లాడుతూ నిర్వాసితులది జీవన్మరణ పోరాటమన్నారు. సిపిఎం చేపట్టిన పాదయాత్ర ఆరంభం మాత్రమేనని, వేరే ప్రదేశానికి సాగునీరు, అభివృద్ధి కోసం సర్వం త్యాగం చేశారని వారి విషయంలో బిజెపి, వైసిపి రెండు ప్రభుత్వాలూ స్పందించట్లేదని ఆరోపించారు. పోరాటాలతోనే ప్రభుత్వాలను కదిలించగలుగుతామన్నారు.

బ్రిటీష్‌ కాలంలోని 1894 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా అలుపెరగని పోరాటాలు చేసినందునే 2013 చట్టం వచ్చిందని దాని అమలుకు యుపి, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పోరాటాలు జరుగుతున్నాయన్నారు. మోడీ ప్రభుత్వం ఆదివాసీల భూములను బలవంతంగా అదానీ వంటి వారికి లక్షల ఎకరాలు సేకరిస్తోందని ఆరోపించారు. మూడు నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదికిపైన సాగిన పోరాటంతో మోడీ సర్కారు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. ఆ స్ఫూర్తితో పోలవరం నిర్వాసితులు పోరాడాలని పిలుపునిచ్చారు.

పోరుబాట పట్టిన పోలవరం నిర్వాసితులు

ప్రభుత్వాన్ని గోదారిలో ముంచుతాం…

నిర్వాసితులను పట్టించుకోకుండా వారిని గోదారిలో ముంచాలని ప్రభుత్వం చూస్తే ప్రభుత్వాన్నే గోదారిలో ముంచుతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఏపీలో పార్టీలన్ని పదవుల కోసం, అధికారం కోసం పాదయాత్రలు చేపడుతున్నారని, తమ పాదయాత్ర అందుక్కాదని ప్రాజెక్టులో మునుగుతున్న గిరిజనులు, ఎస్‌సిలు, బిసిలు, పేద వర్గాల భవిష్యత్తు కోసం చేపట్టామన్నారు.

నిర్వాసితుల న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. తరచూ ముఖ్యమంత్రి పోలవరం నిదుల కోసం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడి నుంచి కేంద్ర పెద్దలు, అధికారులు ఇక్కడికి వస్తున్నారని, కేంద్రం గల్లా పట్టుకొని నిధులు తెచ్చుకోమనే చెబుతున్నామని ఆ నిధులు తొలుత నిర్వాసితులకు కాకుండా కాంట్రాక్టర్లకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రాజెక్టు ఎత్తు ఎంత, డయాఫ్రంవాల్‌ దెబ్బతినడానికి మీరు కారణమంటే మీరు అని వైసిపి, టిడిపి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారని ముంపు ప్రాంతాల్లో విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగాలు ఏమీ లేవన్నారు. చిన్న వరదలకే అంచనాలకు మించి గ్రామాలు మునుగుతున్నాయని పోయిన వరదల్లో ముంపునకు గురైన వారికి పరిహారం ఇవ్వలేదన్నారు.

ఈ ఏడాది మళ్లీ వరదలొస్తున్నా ఏం చర్యలు చేపట్టారన్నారు మోడీ ఆర్డర్‌ వేస్తే జగన్‌ పని చేస్తున్నారని, నిర్వాసితుల సమస్య తీవ్రతను గుర్తించాలన్నారు. లేకపోతే పోరాటంతో గుర్తించేలా చేస్తామననారు. ప్రజలు పైసా పైసా వేసుకొని పాదయాత్రను నడిపిస్తున్నారని ఇది తెలుగు ప్రజలందరి ఉమ్మడి సమస్య అని చెప్పారు. పాదయాత్ర జయప్రదానికి అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు, సంఘీభావం, సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ నెల 26న సంఘీభావ దినాన్ని పాటించాలని కోరారు. జులై 1న ట్రేడ్‌ యూనియన్లు సంఘీభావం ప్రకటిస్తామని ముందుకొచ్చాయనిచెప్పారు.

55 వేలకోట్ల ప్రాజెక్టులో రూ.33 వేల కోట్లు పునరావాసమే ఉంటే అంత ప్రాధాన్యతగల అంశాన్ని పక్కనబెట్టేసి డ్యాం నిర్మాణం గురించే చర్చిస్తున్నారని అన్నారు. పునరావాసం సహజ న్యాయసూత్రమని, ప్రభుత్వాలు ఆ అంశాన్నే పట్టించుకోవడం లేదని తెలిపారు. నోరులేని గిరిజనులు పడుతున్న బాధలు కూడా బయట ప్రపంచానికి తెలియనీయడం లేదని, బెదిరింపులతో వారిని వెళ్లగొట్టే పని చేస్తున్నారని తెలిపారు. గ్రామాలకు గ్రామాలను వరదల్లో ముంచేసి కనీస పరిహారం కూడా ఇవ్వకుండా అక్కడ నుండి పంపించేస్తున్నారని అన్నారు.

45 మీటర్ల ఎత్తు వస్తే మునుగుతాయని చెప్పిన గ్రామాలు 41 మీటర్ల ఎత్తుకే మునిగిపోతున్నాయని, చింతూరు మండలం కూడా పూర్తిగా ముంపునకు గురైందని అన్నారు. గత పాలకులు రూ.6.50 లక్షలు ఇస్తామంటే జగన్మోహన్‌రెడ్డి రూ10 లక్షలు ఇస్తామన్నారని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. చింతూరు, ఎటపాక, వి.ఆర్‌.పురం, కూనవరం, దేవీపట్నం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ప్రజలు ప్రాజెక్టు కోసం తమ సర్వస్వాన్ని వదులకుని నేడు ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా రోడ్డున పడ్డారని అన్నారు.

పోలవరం నిర్వాసితుల డిమాండ్లివే…

నిర్వాసితులకు పునరావాసం, పరిహారం పూర్తిగా అమలు చేసే వరకు గ్రామాలు ఖాళీ చేయించరాదని మహాపాదయాత్ర డిమాండ్‌ చేస్తోంది. పది డిమాండ్లను పాలక ప్రభుత్వాల ముందు ఉంచింది. పోలవరం నిర్వాసితులకు పునరావాసం పూర్తయ్యే వరకూ ముంపు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని కోరుతోంది.

1986, 2022 నాటి వరద ముంపు ఆధారంగా ముంపు గ్రామాల రీ సర్వే చేయాలని, పునరావాసం దశల వారీగా కాకుండా ఏకకాలంలో అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తోంది. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని పునరావాసం, పరిహారం అర్హులందరికీ ఇవ్వాలని, ముంపు మండలాల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రతి ఎకరాకు రూ.20 లక్షలు చెల్లించాలని, ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిర్వాసిత కుటుంబానికీ కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా రూ.10.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది.

జీవో 224 అమలు చేయాలని, గ్రామాలు ఖాళీ చేయించే నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులందరికీ ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. పెండ్లి అయిన ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వాలని, సర్వం కోల్పోతున్న ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరుతోంది. ముంపు ప్రాంతాల ఉద్యోగులందరినీ యథాతధంగా తరలించే ప్రాంతాల్లో కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తదుపరి వ్యాసం