Police Patrol Vehicle Hijacked : కోపంతో పోలీసుల కారు తీసుకెళ్లిన యువకుడు !-youth drives away with police patrol vehcile ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Police Patrol Vehicle Hijacked : కోపంతో పోలీసుల కారు తీసుకెళ్లిన యువకుడు !

Police Patrol Vehicle Hijacked : కోపంతో పోలీసుల కారు తీసుకెళ్లిన యువకుడు !

HT Telugu Desk HT Telugu
Dec 16, 2022 10:36 AM IST

Police Patrol Vehicle Hijacked : ఓ యువకుడు పోలీసులపై కోపంతో పెట్రోలింగ్ వాహనాన్ని చోరీ చేశాడు. 40 కిలోమీటర్లు తీసుకెళ్లి.. కాసేపు పోలీసులని కంగారు పెట్టించాడు. జీపీఎస్ ఆధారంగా లొకేషన్ గుర్తించి పోలీసులు కారుని స్వాధీనం చేసుకున్నారు.

పెట్రోలింగ్ వాహనాన్ని చోరీ చేసిన యుకుడు (ప్రతీతాత్మక చిత్రం)
పెట్రోలింగ్ వాహనాన్ని చోరీ చేసిన యుకుడు (ప్రతీతాత్మక చిత్రం)

Police Patrol Vehicle Hijacked : పెట్రోలింగ్ వాహనాన్ని చోరీ చేసి పోలీసులకి కంగారు పుట్టించాడు ఓ యువకుడు . వాహనంలో 40 కిలోమీటర్లు ప్రయాణించి, డీజిల్ అయిపోవడంతో రోడ్డు పక్కనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆచూకీ అందుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని ఊపిరిపీల్చుకున్నారు. పోలీసు శాఖలో కలకలం రేపిన ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాలలో గురువారం చోటుచేసుకుంది. మానసిక స్థితి జరిగ్గా లేని వ్యక్తే ఆ పనిచేశాడని తేలింది. తన ద్విచక్రవాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారన్ని కోపంతోనే యువకుడు పెట్రోలింగ్ వాహనాన్ని తీసుకెళ్లిపోయాడని వెల్లడైంది.

ఏం జరిగిందంటే.. ?

మునగాల మండలం నారాయణ గూడెం గ్రామానికి చెందిన ముల్కలపల్లి అశోక్ ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. కొద్దికాలంగా మానసిక సమస్యలతో సతమతం అవుతున్నాడు. ఇందుకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ద్విచక్ర వాహనంపై సూర్యాపేటకు వచ్చిన అశోక్ ని .. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆపి ప్రశ్నించారు. ఈ క్రమంలో పోలీసులతో అశోక్ వాగ్వాదానికి దిగాడు. సరైన పత్రాలు లేకపోవడంతో బైక్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పత్రాలు తెచ్చి చూపించి బండి తీసుకెళ్లాలని చెప్పారు.

అయోమయంలో చాలా సేపు సూర్యాపేటలోనే సంచరించిన అశోక్.. బస్టాండ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడాన్ని గమనించాడు. వారి దగ్గరికి వెళ్లి తన బైక్ ను ఇవ్వాల్సిందిగా కోరాడు. వారు స్పందించకపోవడంతో.. కోపంతో ఆ పక్కనే ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని చూశాడు. తాళాలు కూడా ఉండటంతో చోరీ చేసి కోదాడ వైపు తీసుకెళ్లాడు. 40 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత కోదాడ శివారులో డీజిల్ అయిపోయింది. దీంతో అశోక్ వాహనాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

సూర్యాపేట బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ వాహనం లేకపోవడాన్ని గుర్తించిన పోలీసులు.. తొలుత తమ సిబ్బందే తీసుకెళ్లారని అనుకున్నారు. తర్వాత చోరీకి గురైందని తెలుసుకుని సీసీ కెమరాలు పరిశీలించారు. అశోక్ ఆ వాహనాన్ని తీసుకెళ్లినట్లు గుర్తించారు. జీపీఎస్ ద్వారా వాహనం లొకేషన్ ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అశోక్ ని సూర్యాపేట సమీపంలోనే అదుపులోకి తీసుకున్నారు.

Whats_app_banner