Khammam Tragedy: ఖమ్మం జిల్లాలో విషాదం.. బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. భార్య, భర్త మృతి-wife and husband died due to electric shock in karepalli of khammam district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam Tragedy: ఖమ్మం జిల్లాలో విషాదం.. బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. భార్య, భర్త మృతి

Khammam Tragedy: ఖమ్మం జిల్లాలో విషాదం.. బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్.. భార్య, భర్త మృతి

Basani Shiva Kumar HT Telugu
Aug 20, 2024 02:00 PM IST

Khammam Tragedy: వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు ప్రతీకగా కూతురు పుట్టింది. అల్లారు ముద్దుగా పెంచిన ఆ కూతురుకు ఘనంగా పెళ్లి చేశారు. ఆ దంపతులు ఇద్దరూ తమ ఇంట్లో ఆనందంగా ఉంటున్నారు. వారి ఆనందం నచ్చలేదేమో.. కరెంట్ షాక్ రూపంలో మృత్యువు కబళించింది.

బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్
బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ ((representative image ) (unsplash.com))

రాఖీ పండగ రోజు ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. భార్యభర్తలిద్దరు కరెంట్ షాక్‌తో మృతి చెందారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బస్వాపురం గ్రామంలో సోమవారం జరిగింది. బస్వాపురం గ్రామానికి చెందిన బానోతు సెమీన.. బట్టలు పిండింది. తన ఇంటి ముందు రేకుల కింద ఉన్న దండేనికి ఆరేద్దామని వెళ్లింది. బట్టలు ఆరేస్తుండగా దండేనికి కరెంట్ షాక్ వచ్చింది. దీంతో అరుపులు వేయగా.. ఇంట్లో ఉన్న భర్త శ్రీను వచ్చి భార్యను కాపాడబోయారు. ఈ క్రమంలో ఆయనకు కూడా కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వేర్వేరు కులాలకు చెందిన శ్రీను, సెమీన పెద్దలను ఎదురించి గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి అన్యోన్యంగా జీవిస్తున్నారు. వీరిద్దరికి కుమార్తె ప్రియాంక ఉంది. ఆమెకు ఇటీవలే పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు. శ్రీను వ్యవసాయ కూలీగా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో రాఖీ పండగ రోజున ఇద్దరు ఒకేసారి మృతిచెందారు. ఈ దంపతుల మృతితో బస్వాపురం గ్రామంలో విషాద నెలకొంది. తల్లిదండ్రులను చూసి కూతురు ప్రియాంక రోధిస్తున్న తీరు కంటతడి పెట్టించింది.

వర్షాకాలంలో జాగ్రత్త..

వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలని విద్యుత్తు అధికారులు సూచిస్తున్నారు. తడి కారణంగా కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుందని.. ఇంట్లో వైరింగ్ సరిగా చూసుకోవాలని సూచిస్తున్నారు. బయట కూడా కరెంట్ స్తంభాలను ఎవరూ తాకొద్దని స్పష్టం చేస్తున్నారు. తడి చేతులతో కరెంట్ ప్లగ్‌లను, వైర్లను ముట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. వాటర్ హీటర్లను, వాషింగ్ మెషిన్లను వాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు.