TS Assembly Elections 2023 : టికెట్ నీదా - నాదా..? ‘పటాన్ చెరు’ పొలిటికల్ సీన్ ఇదే!-who will be to win from patancheru assembly constituency in the next assembly elections 2023 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : టికెట్ నీదా - నాదా..? ‘పటాన్ చెరు’ పొలిటికల్ సీన్ ఇదే!

TS Assembly Elections 2023 : టికెట్ నీదా - నాదా..? ‘పటాన్ చెరు’ పొలిటికల్ సీన్ ఇదే!

Mahendra Maheshwaram HT Telugu
Jun 08, 2023 03:08 PM IST

Patancheru Assembly Constituency: ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ తెలంగాణ రాజకీయాలు హీట్ ను పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు రేసు గుర్రాలపై ఫోకస్ పెట్టగా… పలుచోట్ల పోటీ ఆసక్తిని రేపుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023

Telangana Assembly Elections 2023: ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలలోని నేతలు టికెట్లపై లెక్కలు వేసుకుంటున్నారు. తేడా అనిపిస్తే చాలు... స్వరాలు మార్చేస్తున్నారు. ఇప్పటికే అసమ్మతి నేతలు... పక్క పార్టీల వైపు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు కూడా ఏకతాటిపైకి వస్తున్నాయన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే... ప్రధాన పార్టీలన్నీ గెలిచే రేసు గుర్రాలపై దృష్టిపెట్టాయి. చాలా చోట్ల ఒకరిద్దరు నేతలు టికెట్ రేసులో ఉండటంతో... సీన్ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలో ఉన్న పటాన్ చెరులో పొలిటికల్ వార్ గట్టిగా నడుస్తోంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ఈ సీటు నుంచి ఎవరు గెలుస్తారన్న చర్చ వినిపిస్తోంది.

పటాన్ చెరు....నగర శివారులో ఉన్న అసెంబ్లీ సీటు. ప్రస్తుతం ఇక్కడ్నుంచి గూడెం మహిపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అధికార బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి కూడా పార్టీ నుంచి టికెట్ దక్కించుకొని హ్యాట్రిక్ విజయం కొట్టాలని చూస్తున్నారు. అయితే ఆయనపై సొంత పార్టీలోనే అసంతృప్తి ఉంది. అదే పార్టీకి చెందిన నీలం మధు ముదిరాజ్ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేకు ధీటుగా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇరువర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక్కడ ముదిరాజ్ కమ్యూనిటితో పాటు బీసీల ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో... తనకే టికెట్ వస్తుందని మధు ఆశలు పెట్టుకున్నారు. ఈ పరిణామం కాస్త మహిపాల్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. పైగా ఆయనపై కబ్జా ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో గులాబీ సీటు ఎవరికి అనే దానిపై అధికారికంగా క్లారిటీ వస్తే... కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. గత ఎన్నికలో కట్టా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసి.... 78 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఈసారి కూడా బరిలో ఉండాలని చూస్తున్నారు. ఇదే టైంలో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన గాలి అనిల్ కుమార్ కూడా పటాన్ చెరుపై కన్నేశారు. ఎలాగైనా కాంగ్రెస్ నుంచి సీటు సాధించి... గెలవాలని భావిస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ సీటుపై ఆశలు పెంచుకుంది. సెమీ అర్బన్ కావటం, దీనికితోడు అతిపెద్ద పారిశ్రామిక ఏరియాగా గుర్తింపు పొందింది పటాన్ చెరు. ఇక్కడ ఉత్తరాధి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉండే కార్మికులు ఇక్కడ నివాసం పొందుతున్నారు. స్థానికంగా ఉండే కంపెనీలలో పని చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో... వీరి ఓట్లపై కూడా కమలదళం ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి పోటీ చేయగా... ఈసారి కూడా బరిలో ఉండాలని చూస్తున్నారు. అయితే 2014లో బీజేపీ రెబల్ గా పోటీ చేసిన అంజిరెడ్డి కూడా...ఈసారి పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. వీరికి తోడు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కూడా బీజేపీలో ఉన్నారు. ఈ మధ్యనే పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో.... ఆయన పార్టీని వీడుతారనే చర్చ జోరందుకుంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తే.... పటాన్ చెరు పాలిటిక్స్ పీక్స్ కు చేరినట్లు అవుతుంది.

ప్రధాన పార్టీలన్నింటిలోనూ టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఇద్దరికి పైగా ఉండటంతో ఈసారి టికెట్ ఎవరికి రాబోతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. టికెట్ దక్కించుకున్నప్పటికీ.... ఓటర్ల మనసును గెలిచే నేత ఎవరనేది టాక్ ఆఫ్ ది పటాన్ చెరుగా మారిపోయింది. ఇక బీఎస్పీ, వైఎస్ఆర్టీపీతో పాటు మిగతా పార్టీలు కూడా పోటీకి సన్నద్ధం అవుతున్నాయి. మొత్తంగా గెలుపు లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్న నేపథ్యంలో... విజయం ఎవర్ని వరిస్తుందనేది చూడాలి...!

Whats_app_banner

సంబంధిత కథనం