Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి చోటు ఎవరికి..?-who is likely to get a place in modi cabinet from telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి చోటు ఎవరికి..?

Modi 3.0 Cabinet: మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి చోటు ఎవరికి..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 09, 2024 07:19 AM IST

Modi 3.0 cabinet Updates : ఇవాళ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 30 మంది వరకు కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇందులో తెలంగాణ నుంచి ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది.

మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి ఎవరు..?
మోదీ కేబినెట్ లో తెలంగాణ నుంచి ఎవరు..?

Modi 3.0 cabinet Updates: కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటంతో మరోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టనున్నారు. ఇవాళ సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మోదీతో ప్రధానమంత్రిగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇదే సమయంలో 30 మందికిపైగా ఎంపీలు… కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని తెలుస్తోంది.

yearly horoscope entry point

తెలంగాణ నుంచి ఎవరికి ఛాన్స్…?

ఈసారి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది. దీంతో ఈసారి కేబిెనెట్ లో ఇద్దరికైనా బెర్త్ లు దక్కవచ్చన్న చర్చ జోరుగా జరుగుతోంది. అయితే  గెలిచిన వారిలో పలువురు కీలక నేతలు ఉండటంతో ఎవరిని అదృష్టం వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

గత కేబినెట్ లో సికింద్రాబాద్ నుంచి విజయం సాధించి కేబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు కిషన్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయనే ఉన్నారు. అయితే మరోసారి కేబినెట్ మంత్రిగా ఆయనకు మరో ఛాన్స్ దక్కొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో బీసీ స్టాండ్ ను బలంగా వినిపిస్తున్న బీజేపీ…ఆ వర్గాలకు చెందిన నేతకు ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ కోణంలో కరీంనగర్ నుంచి గెలిచిన బండి సంజయ్ తో పాటు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కూడా ఉన్నారు.

మరోవైపు దక్షిణ తెలంగాణలోని మహబూబ్ నగర్ స్థానం నుంచి డీకే అరుణ గెలిచారు. మహిళా కోటాలో భాగంగా… అరుణ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం… తెలంగాణకు ఒక కేంద్రమంత్రి, మరో రెండు సహాయ మంత్రి పదవి రావొచ్చన్న లీకులు వినిపిస్తున్నాయి.  అయితే కేబినెట్ లో బెర్తు కోసం ఈటల రాజేందర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పేరు కూడా తెరపైకి వస్తోంది. 

కేంద్రంలో కీలకంగా టీడీపీ….

మెజార్టీకి ముప్పై రెండు సీట్ల దూరంలో నిలిచిన బీజేపీకి ఎన్డీయేలోని టీడీపీ, జేడీయూల మద్దతు కీలకంగా మారింది. ఈరెండు పార్టీలకు 28 మంది ఎంపీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఈ రెండు పార్టీలకు కేబినెట్లో సముచిత స్థానం లభించడం ఖాయమే. అయితే, ఏ పార్టీకి ఎన్ని కేబినెట్ బెర్త్ లు లభిస్తాయన్నది ఉత్కంఠగా మారింది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నుంచి నలుగురికి, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ నుంచి ఇద్దరికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించనుంది.

టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, హరీశ్ బాలయోగి, దగ్గుమల్ల ప్రసాద్ కు మోదీ 3.0 కేబినెట్లో అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఈ ముగ్గురికి కీలక శాఖలు కూడా లభించే అవకాశం ఉంది. మరోవైపు, జేడీయూ కి లభించే రెండు కేబినెట్ బెర్త్ ల్లో సీనియర్ నాయకులైన లలన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు అవకాశం లభించనుంది. వీరిలో రామ్ నాథ్ ఠాకూర్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈయన ఈ సంవత్సరం భారత రత్న లభించిన బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ కుమారుడు. టీడీపీ, జేడీయూలకు కేబినెట్ స్థానాలు ఖరారైనప్పటికీ, మంత్రిత్వ శాఖల విషయంలో కొంత అనిశ్చితి నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జనసేన నుంచి గెలిచిన బౌలశౌరికి సహాయ మంత్రి పదవి రావొచ్చని సమాచారం.

 

Whats_app_banner