Renuka Chowdary logic: లాజిక్ మర్చిపోయిన రేణుకాచౌదరి..-what is the reason for renuka chaudharys outcry on sharmilas arrival ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Renuka Chowdary Logic: లాజిక్ మర్చిపోయిన రేణుకాచౌదరి..

Renuka Chowdary logic: లాజిక్ మర్చిపోయిన రేణుకాచౌదరి..

HT Telugu Desk HT Telugu
Sep 04, 2023 08:16 AM IST

Renuka Chowdary logic: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై అక్కసు వెళ్లగక్కడం చర్చనీయాంశంగా మారింది. షర్మిలకు తెలంగాణతో ఏమి సంబంధం ఉందని ప్రశ్నించడం వైరల్‌గా మారింది.

రేణుకా చౌదరి
రేణుకా చౌదరి

Renuka Chowdary logic: రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని రేణుకా చౌదరి వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్‌ పార్టీలోకి రానున్నారనే వార్తలపై భగ్గుమంటున్నారు. షర్మిల కాంగ్రెస్‌ పార్టీలోకి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారిలో రేణుకా కూడా చేరిపోయారు. కాంగ్రెస్‌ పార్టీలో ఇలాంటి అసమ్మతులు సహజమే అయినా షర్మిల చేరికతో రేణుకకు కలిగే నష్టం ఏమిటనే చర్చ మొదలైంది.

రేణుకా చౌదరి కొద్ది నెలల క్రితం ఏపీలో పర్యటించారు. అమరావతి రైతులకు సంఘీభావ ర్యాలీల్లో పాల్గొన్నారు. టీడీపీ వైసీపీ మధ్య నెలకొన్న వివాదాల్లో భాగంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి కమ్మ సామాజిక వర్గం నాయకుల వ్యాఖ్యలపై రేణుక ఘాటుగా స్పందించారు. రేణుకా చౌదరి రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే ప్రారంభమైనా ప్రస్తుతం ఆమె కాంగ్రెస్‌ నాయకురాలిగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేసే రేణుకా చౌదరి చాలా కాలంగా సైలెంట్‌గానే ఉన్నారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైన తర్వాతే ఆమె యాక్టివ్ అయ్యారు.

విశాఖలో పుట్టిన రేణుకా చౌదరి తనకు ఆంధ్రా మూలాలు ఉన్నాయని గతంలో పలుమార్లు చెప్పారు. తండ్రి ఉద్యోగ రీత్యా దేశంలోని అన్ని ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగడంతో తాను ఏ ప్రాంతానికి పరిమితమైన నాయకురాలిని కాదని గతంలో చెప్పుకున్నారు. ఆంధ్రాలో కూడా తనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందని రేణుక పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు.

చంద్రబాబుకు, వైసీపీ నేతలకు మధ్య తలెత్తిన వివాదాల్లో వైసీపీ వర్గం చేసిన విమర్శలు, ఆరోపణలకు రేణుక కౌంటర్ ఇచ్చారు. అమరావతి నిర్మాణం ఓ సామాజికి వర్గానికి మేలు చేసేందుకు జరుగుతున్నదంటూ వైసీపీ ఆరోపణలకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. తన సామాజిక వర్గం జోలికి వస్తే ఊరుకోనంటూ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసి కొడాలి నానిని ఓడిస్తానని ప్రకటించారు.

ఆంధ్రాలో పోటీ చేస్తానని….

ఆంధ్రాలో ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన రేణుకా చౌదరి తాజాగా వైఎస్ షర్మిలపై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశం అయ్యింది. బిఆర్‌ఎస్‌ నేతలు, తెలంగాణ వాదుల నుంచి ఈ తరహా విమర‌్శలు వచ్చి ఉంటే పెద్దగా రియాక్షన్ ఉండేది కాదేమో కాని రెండు తెలుగు రాష్ట్రాలు తనవేనని భావించే రేణుకా చౌదరి ప్రాంతాల గురించి ప్రస్తావించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఎయిర్‌ ఫోర్స్‌ ఉద్యోగికి విశాఖపట్నంలో జన్మించిన రేణుకా చౌదరి ఖమ్మంకు చెందిన శ్రీధర్‌ను వివాహం చేసుకున్నారు. షర్మిల సైతం తెలంగాణ స్థానికుడైన అనిల్‌ను వివాహం చేసుకున్నారు. ఇద్దరిది స్థానికత విషయంలో ఒకే రకమైన నేపథ్యమైనపుడు షర్మిలను విమర్శించడమేంటని వైఎస్‌ వర్గం ప్రశ్నిస్తోంది. మరోవైపు ఖమ్మంలో షర్మిల రాకను మల్లు భట్టి విక్రమార్క వంటి వారు స్వాగతిస్తున్నారు. గతంలో వైఎస్‌తో ఉన్న విభేదాలతోనే షర్మిల రాకను రేణుక వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నారు.

షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా రేణుకకు నచ్చక పోవచ్చంటున్నారు. తన ఆధిపత్యానికి గండి పడుతుందనే ఉద్దేశంతోనే ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నట్లు చెబుతున్నారు.

తెలంగాణ కోడలు అని వైఎస్ షర్మిలకు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా అంటూ నిలదీయాడానికి ఇదే కారణమని చెబుతున్నారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే తాను ఖమ్మం జిల్లా ఆడబిడ్డనని, పాలేరు నుంచి పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

షర్మిల పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు అని మండిపడ్డారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో మా అధిష్టానం చెబుతుందని, ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పనంటూ రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిల ఎంతనో ఏపీలో తాను కూడా అంతే అన్నారు. తాను కూడా వెళ్లి ఆంధ్రలో పోటీ చేస్తానని రేణుకా చౌదరి చెప్పారు. షర్మిల ఏదైనా అడగొచ్చు, ట్యాక్స్ ఏం లేదు కదా? కానీ అడగడానికి అర్హత ఉండాలన్నారు. వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల, రాహుల్, సోనియాను కలిశారంతే అన్నారు.

ఫర్మిల తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదోననే స్పష్టత ఇంకా రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె సేవలు వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ తెలంగాణల్లో షర్మిలతో ప్రచారం చేయించడం ద్వారా పార్టీకి కొంతైన పూర్వ వైభవాన్ని తీసుకురావొచ్చని యోచిస్తోంది. షర్మిల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదంటున్న రేణుకా చౌదరి తాను మాత్రం గుడివాడలో పోటీ రెడీ అంటూ ఎవరి ఆమోదంతో ప్రకటించారనేది తేలాల్సి ఉంది.

Whats_app_banner