UNESCO : యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ జాబితాలో వరంగల్
వరంగల్ నగరానికి అరుదైన గుర్తింపు దక్కింది. UNESCO గుర్తించిన అభ్యాసన నగరాల ప్రపంచ నెట్‌వర్క్ జాబితాలో వరంగల్ చేరింది.
వరంగల్ నగరానికి మరో అరుదైన ఘనత లభించింది. వరంగల్ యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో చేరింది. యునెస్కోకు భారత శాశ్వత ప్రతినిధి బృందం అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ ప్రకటన విడుదలైంది.
ఈ సందర్భంగా వరంగల్‌ను అభినందిస్తూ, కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా శుభాకాంక్షలు తెలిపారు. 'తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ యునెస్కో గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో చేరింది. ఈ మహత్తర సందర్భంలో వరంగల్, తెలంగాణకు అభినందనలు. వరంగల్‌లోని గ్రేట్ రామప్ప ఆలయానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత , వరంగల్ రెండో గుర్తింపును పొందింది.' అని ఆయన ట్వీట్ చేశారు.
గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్‌లో వరంగల్‌కు చోటు లభించడంపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. దీని కోసం కృషి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు, ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
అభ్యాస నగరాలను నిర్మించడానికి నిర్దిష్ట వ్యూహాలను అభివృద్ధి చేయడంలో స్థానిక సంస్థలకు మద్దతు ఇవ్వడానికి యునెస్కో ఇన్‌స్టిట్యూట్ ఫర్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్ (UIL) UNESCO గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ (GNLC)ను స్థాపించింది. మెంబర్‌షిప్ దరఖాస్తుల కోసం “UNESCO గ్లోబల్ నెట్‌వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ (GNLC)” ఆగస్టు 2021లో ప్రారంభించింది. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ (GWMC) యునెస్కో-దిల్లీ జాతీయ కమిషన్ ద్వారా యునెస్కో GNLCకి దరఖాస్తును సమర్పించింది . ఇది జనవరి 2022లో ఆమోదించారు.