TS Assembly Elections 2023 : లైన్ క్లియర్... హస్తం గూటికి వేముల వీరేశం!-vemula veeresham to join congress party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Elections 2023 : లైన్ క్లియర్... హస్తం గూటికి వేముల వీరేశం!

TS Assembly Elections 2023 : లైన్ క్లియర్... హస్తం గూటికి వేముల వీరేశం!

HT Telugu Desk HT Telugu
Sep 22, 2023 06:54 PM IST

Vemula Veeresham News: వీముల వీరేశం కాంగ్రెస్ లో చేరికకు లైన్ క్లియర్ అయిపోయింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన వీరేశం…ఢిల్లీ పెద్దలను కలిసి పార్టీలో చేరనున్నారు.

వేముల వీరేశం
వేముల వీరేశం

Telangana Assembly Elections 2023: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఉమ్మడి నల్లగొండ జిల్లా, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయాలు ఓ కొలిక్కి వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. దీంతో వేముల వీరేశం పార్టీ కండువా కప్పుకునేందుకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలు దేరి వెళ్లారు.

ఎందుకీ ఉత్కంఠ..?

వాస్తవానికి హైదరాబాద్ లో ఈ నెల 16, 17వ తేదీల్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల సందర్భంగానే వేముల వీరేశం పార్టీలో చేరాల్సి ఉండింది. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, ఇదే జిల్లాకు చెందిన తుంగతుర్తి నియోజకవర్గ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేలు వంటి నాయకులు కాంగ్రెస్ లో చేరిపోయారు. కానీ, నెల రోజులుగా వేముల వీరేశం ఇవ్వాళ చేరుతున్నారు.. రేపు చేరుతున్నారంటూ వార్తలతై షికారు చేశాయి కానీ.. ఆయన చేరిక మాత్రం పెండింగులోనే ఉంది. చేరిక రోజు రోజుకూ ఆలస్యం కావడంతో.. ఇక, వేముల వీరేశం చేరికకు బ్రేక్ పడినట్లేనన్న ప్రచారం జరిగింది. కానీ, ఉత్కంఠకు తెరదించుతూ.. శనివారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ పెద్దల నుంచి పిలుపు వచ్చిందని వీరేశం అనుచరవర్గం నాయకుడు ఒకరు తెలిపారు.

నిజంగానే అడ్డుకునే ప్రయత్నం జరిగిందా..?

అసలు వేముల వీరేశాన్ని కాంగ్రెస్ లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది ఎవరు..? భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు ఇంతగా తాత్సారం చేయాల్సి వచ్చింది..? ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంతగా ప్రయత్నించినా.. ఇంతలా ఎందుకు ఆలస్యం అయ్యింది అన్న ప్రశ్నలు ఆసక్తి రేపాయి. ముందు నుంచీ నకిరేకల్ నియోజకవర్గం అభ్యర్థి ఖరారు విషయంలో కోమటిరెడ్డి సోదరుల అభిప్రాయానికి విలువ ఉండేది. చిరుమర్తి లింగయ్యకు మూడు సార్లు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకోవడంలో వీరిదే ప్రధాన పాత్ర. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడాక, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం ముఖ్యమైంది. ఆయన ఇప్పటికే ఇక్కడ ఇద్దరు నాయకులను తయారు చేశారు. దైద రవీందర్, వేదాసు శ్రీధర్ ఇద్దరినీ పనిచేసుకోమని పురమాయించారు. వీరికి అదనంగా.. జానారెడ్డి ప్రధాన అనుచరునిగా ఉన్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొండేటి మల్లయ్య కూడా ఇక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వేముల వీరేశం కూడా కాంగ్రెస్ లోకి రావాలని నిర్ణయించుకోవడం, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అండగా ఉండడంతో వీరేశం చేరిక తేలికవుతుందనుకున్నారు. కానీ, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని పార్టీలో చేర్చుకునేందుకు టీ పీసీసీ నాయకత్వం వెనకడుగు వేసింది. కానీ, ఇపుడు అందరికీ ఒప్పించడంతో.. ఇక్కడి నుంచి తమ గెలుపు గుర్రంగా భావించే ఏఐసీసీ నాయకత్వం వేముల వీరేశానికి ఢిల్లీ రావాలని కబురు పంపించిందని చెబుతున్నారు.

రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ

Whats_app_banner

సంబంధిత కథనం