GI tag from Telangana: తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు-union government has granted gi tags to tandur redgram of telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gi Tag From Telangana: తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు

GI tag from Telangana: తాండూరు కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు

HT Telugu Desk HT Telugu
Dec 15, 2022 06:56 AM IST

Tandur Redgram of Telangana: తాండూరు కందిపప్పునకు అరుదైన గుర్తింపు దక్కింది. భౌగోళిక గుర్తింపు (GI tag) లభించింది. ఈ మేరకు కేంద్రం వివరాలను వెల్లడించింది.

తాండూరు కందిపప్పు
తాండూరు కందిపప్పు

GI tags to Tandur Redgram of Telangana: తాండూరు పప్పు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి నేల స్వభావంతో పప్పు రుచికరంగా ఉండడంతో దీనికి అధిక డిమాండ్ ఉంది. ఇక్కడి పప్పు త్వరగా ఉడుకుతుంది. వండిన పప్పు రెండు రోజులైనా పాడవకుండా ఉండడం మరో ప్రత్యేకత ఉంటుందన్న పేరు ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లోనూ ఇక్కడి కంది పప్పునకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తాండూరు కందిపప్పునకు (Tandur Redgram) అరుదైన గుర్తింపు లభించింది.

రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా పండించే ఈ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు (GI tag) లభించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు బుధవారం వివరాలను వెల్లడిచింది. దీంతో పాటు అస్సోం గమోసా, మహారాష్ట్రకు చెందిన అలీబాగ్‌ వైట్‌ ఆనియన్‌కు సైతం జీఐ ట్యాగ్‌ లభించిందని వాణిజ్య పరిశ్రమల శాఖ బుధవారం తెలియజేసింది. వీటితో దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు పొందిన వాటి సంఖ్య 432కి చేరిందని వివరించింది.

తాండూరు కందిపప్పు ప్రత్యేకత...

ఇతర ప్రాంతాల్లో పండించిన కందిపప్పు కంటే తాండూరు కందిపప్పు టేస్ట్ వేరుగా ఉంటుంది. త్వరగా పాడవకుండా ఉంటుంది. పలు రాష్ట్రాల్లో తాండూరు కందిపప్పు పేరుతో దీన్ని విక్రయిస్తారంటే దీని ప్రత్యేకత గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతుంది. ప్రతి ఏటా తాండూరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది. ఇక తెలంగాణలో ఇప్పటివరకు పోచంపల్లి ఇక్కత్‌, నిర్మల్‌ కొయ్యబొమ్మలు, నిర్మల్‌ ఫర్నీచర్‌, నిర్మల్‌ పెయింటింగ్స్‌, గద్వాల చీరలు, హైదరాబాద్‌ హాలీమ్‌, చేర్యాల్‌ పెయింటింగ్స్‌, సిద్దిపేట గొల్లబామ, నారాయణపేట హ్యాండ్లూమ్‌ చీరలు, పోచంపల్లి ఇక్కత్‌ బొమ్మ, ఆదిలాబాద్‌ డోక్రా, వరంగల్‌ రగ్గులకు భౌగోళిక గుర్తింపు లభించింది. తాజాగా తాండూరు కందిపప్పు కూడా ఈ జాబితాలో చేరినట్లు అయింది. భౌగోళిక గుర్తింపు పొందిన సంస్థలు, వ్యక్తులు మాత్రమే జీఐ పేరును వినియోగించాల్సి ఉంటుంది. ఇతరులు వినియోగిస్తే సివిల్‌, క్రిమినల్‌ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకునే వెసులుబాటు కల్పించారు.

జీఐ ట్యాగ్‌ సాధించిన రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి బనగానపల్లి మామిడి, బొబ్బిలి వీణ, ధర్మవరం చేనేత పట్టుచీరలు, నిమ్మలకుంట తోలుబొమ్మలు, ఉప్పాడ జామ్దానీ చీరలు కూడా ఉన్నాయి.

IPL_Entry_Point