Mahabubabad District : కర్రలతో వెళ్తున్న లారీ బోల్తా - ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు స్పాట్ డెడ్
Mahabubabad District Latest News : మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కర్రల లోడ్ తో ఉన్న లారీ బోల్తా పడి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mahabubabad District Crime News : విధులకు హాజరయ్యేందుకు బస్సు కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు ఉద్యోగులను లారీ ప్రమాదం కబలించింది. కర్ర లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడటం, దాంట్లో ఉన్న దుంగలు బస్సు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులపై పడటంతో ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దీంతో నడిరోడ్డుపై రక్తం మడుగుతో అక్కడ భయంకర పరిస్థితులు నెలకొనగా, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా వారివారి బంధువులు హైవే పై పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన కారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కేంద్రంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రత్యక్ష్య సాక్షులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గూడూరు మండలంలోని కొంగర గిద్దకు చెందిన ధనసరి పాపారావు(34) గూడూరు పోలీస్ స్టేషన్ లో సీఐ గన్ మెన్ గా పని చేస్తున్నాడు. మచ్చర్ల గ్రామానికి చెందిన సుంచా దేవేందర్(38) ములుగు జిల్లా రామన్నగూడెంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇద్దరూ వేర్వేరుగా ఇంటి నుంచి విధులకు హాజరవుతుండేవారు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం పాపారావు వ్యక్తిగత పని నిమిత్తం, విధులకు హాజరయ్యేందుకు సుంచా దేవేందర్ ఇద్దరూ గూడూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. గమ్య స్థానాలకు వెళ్లేందుకు బస్సు కోసం అక్కడే ఎదురుచూస్తున్నారు.
దూసుకొచ్చిన మృత్యువు
గూడూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధనసరి పాపారావు, సుంచా దేవేందర్ మరికొందరు బస్సు కోసం ఎదురు చూస్తుండగా, అకస్మాత్తుగా ఓ లారీ వారి వైపు దూసుకొచ్చింది. జామాయిల్ కర్ర లోడ్ తో ఉన్న ఆ లారీ డ్రైవర్ నిద్ర మత్తు వల్లనో.. ఇతర కారణం వల్లనోగానీ అదుపు తప్పింది.
గూడూరు బస్టాండ్ క్రాస్ వద్ద రాగానే లారీ ఒక్కసారిగా బోల్తా కొట్టింది. దీంతో అందులో ఉన్న కర్రలన్నీ పక్కనే బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్లపైనే పడ్డాయి. కర్రలన్నీ పాపారావు, దేవేందర్ పై పడిపోవడంతో వారిద్దరు కర్రల కిందనే ఇరుక్కుపోయారు. మరికొందరు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. లోడ్ మొత్తం ఒక్కసారి పక్కకు ఒరిగి పడిపోవడంతో కర్రల కింద చిక్కుకున్న పాపారావు, దేవేందర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అనూహ్య ఘటనతో స్థానికులంతా భయాందోళనకు గురి కాగా, లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
న్యాయం చేయాలని ఆందోళన
లారీ ప్రమాద విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రామ్ నాథ్, గూడూరు ఎస్సై నాగేశ్, ఇతర పోలీస్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం స్థానికులు, జేసీబీ సహాయంతో లారీని పక్కకు తొలగించారు. కర్రల కింద నలిగిపోయి ఉన్న మృత దేహాలను బయటకు తీశారు.
విషయం తెలుసుకున్న పాపారావు, దేవేందర్ కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గూడూరు బస్టాండ్ వద్ద మెయిన్ రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాల రాకపోలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా ఎస్పీ హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన విమరించారు.