TSRTC Bus Ticket : టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ మీద ఇది గమనించారా?
టీఎస్ఆర్టీసీ తమ ప్రయాణికులకు ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేసింది. అరె.. ఈ విషయం గమనించలేదా? అనుకుంటారు. అదేంటో తెలుసా? మీ బస్ టికెట్ పూర్తిగా పరిశీలించండి అప్పుడు అర్థమవుతుంది.
ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) తమ ప్రయాణికులకు విషెస్ చెబుతోంది. ఈ వేడుకల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్ టికెట్లపై 'స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు' అని ఉంటుంది.
TSRTC బస్ టికెట్ పై మీరు ఏదైనా గమనించారా అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. ఏముందో చెప్పాలని కోరారు. ఆ టికెట్ కింద.. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని ఉంది. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని.. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టీఎస్ఆర్టీ సైతం తమ ప్రయాణికులకు.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది. ప్రతీ ఆర్టీసీ టికెట్ పై ఈ మేరకు కనిపిస్తుంది.
సజ్జనార్ ట్వీట్‌పై వినియోగదారులు భిన్నంగ స్పందిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ సందేశం బాగా చేశారని ఒకతను చెప్పారుడ. బస్సు ఛార్జీలను తగ్గించండని మరికొంతమంది కోరుతున్నారు. కొంతమంది తమ బస్ టికెట్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నగరంలో పలు బస్సులకు ఇరువైపులా జాతీయ జెండాలు దర్శనమిస్తున్నాయి.
మరోవైపు అజాదీ కా అమృత్ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉత్సవాల నిర్వహణలో భాగంగా 12 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు టిఎస్‌ఆర్టీసి ఏర్పాటు చేసింది. ఆగష్టు 15న పుట్టిన చిన్నారులకు 12ఏళ్లు వచ్చే వరకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు అనుమతించనున్నారు. అంటే 2022ఆగష్టు 15న పుట్టిన పిల్లలు 2034వరకు ఉచితంగా టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఉచిత ప్రయాణం సిటీ సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న సిటీ బస్సుల్లో 12ఏళ్ల లోపు పిల్లలు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతిస్తారు.
దీంతో పాటు 75ఏళ్లు పూర్తి చేసుకున్న వృద్ధులు ఆగష్టు 15న ఉచితంగా గమ్యస్థానాలకు ప్రయాణించేందుకు అనుమతిస్తారు. టీ -24 పేరుతో ఆర్టీసి విక్రయిస్తున్న రూ.120 రుపాయల టిక్కెట్‌ను రూ.75కే విక్రయించనున్నారు. ఆగష్టు 10 నుంచి 21 వరకు 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు ఆర్టీసి నిర్వహించనుంది. మంగళవారం నుంచి ఆర్టీసి ప్రాంగణాల్లో ఉదయం 11గంటలకు జాతీయ గీతాలాపన చేస్తారు. ఆగష్టు 13 నుంచి 15వరకు అన్ని బస్సులకు జాతీయ పతాకాలను ఏర్పాటు చేస్తారు. ఉద్యోగులకు అమృతోత్సవ్ బ్యాడ్జీలతో విధులకు హాజరు కావాలని ఆదేశించారు.
అజాదీకా అమృత్ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆర్టీసి బస్సుల్లో తిరుమలకు ప్రయాణించే భక్తులకు రూ75 రాయితీ ఇవ్వనున్నారు. ఆగష్టు 16-21 మధ్య ఇది వర్తిస్తుంది. కార్గో పార్సిల్స్ పంపే వారికి 75 కిలోమీటర్ల వరకు ఉచితంగా పార్సిల్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. ఆగష్టు 15న మాత్రమే ఇది వర్తిస్తుంది. టాప్ 75 ప్రయాణికుల్లో ఒకరికి ఉచిత ట్రిప్ టిక్కెట్ బహుమతిగా ఇస్తారు. శంషాబాద్ విమానాశ్రయానికి పుష్పక్ సర్వీసుల్లో ప్రయాణించే వారు 75శాతం టిక్కెట్ ధర చెల్లిస్తే సరిపోతుంది. 75ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు ఆగష్టు 15-22మధ‌్య కాలంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 75ఏళ్లలోపు వారికి రూ.750 రుపాయలకే వైద్య పరీక్షలు చేస్తారు.