TSPSC AEE Exam : ఏఈఈ పరీక్షకు సర్వం సిద్ధం.. గ్రూప్ 2 ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడవు పెంపు
TSPSC AEE Exam : జనవరి 22న జరగనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పరీక్షకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 1540 పోస్టుల భర్తీకి నిర్వహిస్తోన్న పరీక్షకు.. 81, 548 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువుని బీసీ స్టడీ సర్కిల్ జనవరి 25 వరకు పొడిగించింది.
TSPSC AEE Exam : జనవరి 22న ఆదివారం జరగనున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హన్మకొండ, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 176 కేంద్రాల్లో..... ఉదయం పేపర్ 1, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షలు జరుగుతాయి. పేపర్ 1 లో జనరల్ స్టడీస్.. జనరల్ ఎబిలిటీస్ సబ్జెక్టులు ఉండగా... పేపర్ 2 లో ఇంజినీరింగ్ సబ్జెక్టుకి సంబంధించిన ప్రశ్నలు ఉండనున్నాయి. పేపర్ 1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 : 30 గంటల వరకు... పేపర్ 2 మధ్యాహ్నం 2 : 30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 81, 548 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవనున్నారు.
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు.... పేపర్ 1 కి ఉదయం 8 : 30 నుంచి 9: 45 గంటల వరకల్లా పరీక్ష హాల్ కి చేరుకోవాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 : 15 గంటల వరకే హాల్ లోకి వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను పరీక్షకు అనుమతించమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. హాల్ టికెట్లో ఫోటో, సంతకం లేని వారు.. 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్ట్ చేయించి తీసుకురావాలని సూచించింది.
1540 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకి టీఎస్పీఎస్సీ గతేడాది సెప్టెంబర్ 9న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 14 వరకు అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు స్వీకరించింది. జనవరి 16 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది. పరీక్ష ప్రారంభమయ్యే 45 నిమిషాల ముందు వరకు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
మహిళా, శిశు సంక్షేమ శాఖ పరిధిలో 181 విస్తరణ అధికారి పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన నియామక పరీక్ష ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. జనవరి 21 నుంచి 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని ప్రకటించింది. 181 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు 33 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర బీసీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్-2 పరీక్షకు ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువుని పొడిగించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 25వ తేదీ వరకు https://tsbcstudycircle.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ కోరారు. హైదరాబాద్ నయాపూల్ లోని సిటీ కాలేజ్ లోని బీసీ స్టిడీ సర్కిల్ లో 200 మందికి ఫిబ్రవరి 1 నుంచి ఉచిత శిక్షణ ఇస్తామని వెల్లడించారు. తల్లిదండ్రుల ఆదాయం సంవత్సరానికి రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు.
టాపిక్