Telangana DSC : డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు..! విద్యాశాఖ కీలక నిర్ణయం
Telangana DSC Updates: టీచర్ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్టీటీ(సెకండరీ గ్రేడ్ టీచర్) పోస్టులను డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులతోనే భర్తీ చేయనుంది.
Telangna SGT Posts : టీచర్ ఉద్యోగాల భర్తీపై తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టింది. ఇప్పటికే భర్తీ చేసే పోస్టులకు సంబంధించి వివరాలను పేర్కొంది. ఆయా పోస్టుల భర్తీకి అనుమతులు కూడా జారీ చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనుంది. మొత్తం కలిపి 5,089 ఉద్యోగాలను రిక్రూట్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్టీటీ పోస్టుల భర్తీ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ.
ఎస్జీటీ ఉద్యోగాలను డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పూర్తి చేసిన అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. రేపోమాపో అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి. ఫలితంగా బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు మాత్ర మే పోటీపడాల్సి ఉంటుంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో ఎన్సీటీఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవలే సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను డీఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పునిచ్చింది అత్యున్నత ధర్మాసం. ఈ తీర్పు ఆధారంగానే ఎన్సీటీఈ చర్యలు చేపట్టగా… ఆయా రాష్ట్రాలు కూడా సుప్రీంతీర్పునకు లోబడి ఎస్టీటీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి.
ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.పరీక్షల నిర్వహణపై కూడా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలిసోంది. డీఎస్సీ పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించాలని భావిస్తోంది. అన్ని కుదిరితే డిసెంబర్ రెండో వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఇప్పటికే జిల్లా కమిటీల ద్వారా రిక్రూట్ చేయాలని నిర్ణయించిన విద్యాశాఖ.... ఈసారి ఆఫ్ లైన్ లో కాకుండా సీబీటీ పద్ధతిలో నిర్వహించాలని చూస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లల విషయంపై ఇటీవలే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శాశ్వత టీచర్లను నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా.... రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని నిర్ణయించింది. 10 మంది విద్యార్థులకు ఒకరు చొప్పున మొత్తంగా 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్డ్ టీచర్ పోస్టులను కొత్తగా మంజూరు చేసింది. వీటి భర్తీకి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. డీఎస్సీలోని పోస్టులతో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కలిపి 6,612 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. అన్ని పోస్టులకు కలిపి ఒకేసారి డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది.
జిల్లాల వారీగా డీఎస్సీ ఖాళీలు(ఎస్టీటీ , స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కలిపి):
ఆదిలాబాద్ - 275
ఆసిఫాబాద్ - 289
భద్రాద్రి - 185
హన్మకొండ-54
హైదరాబాద్- 358
జగిత్యాల-148
జనగాం-76
జయశంకర్-74
జోగులాంబ- 146
కామారెడ్డి- 200
కరీంనగర్ - 99
ఖమ్మం- 195
మహబుబాబాద్-125
మహబూబ్ నగర్-96
మంచిర్యాల- 113
మెదక్- 147
మేడ్చల్- 78
ములుగు- 65
నాగర్ కర్నూలు- 114
నల్గొండ- 219
నారాయణపేట- 154
నిర్మల్- 115
నిజామాబాద్- 309
పెద్దపల్లి- 43
రాజన్న సిరిసిల్ల-
రంగారెడ్డి- 103
సంగారెడ్డి- 196
సిద్ధిపేట- 141
సూర్యాపేట- 185
వికారాబాద్- 191
వనపర్తి- 76
వరంగల్ - 138
యాదాద్రి -99