Lulu mall Traffic: లులు మాల్‌కు జనం పోటెత్తడంతో ట్రాఫిక్ చిక్కులు
Lulu mall Traffic: హైదరాబాద్ కూకటిపల్లిలో నూతనంగా ప్రారంభించిన లులూ మాల్ కు జనం పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో మాల్ ను సందర్శించడానికి రావడంతో లులు మాల్ లో తీవ్ర రద్దీ ఏర్పడింది.
Lulu mall Traffic: హైదరాబాద్ కూకటిపల్లిలో నూతనంగా ప్రారంభించిన లులూ మాల్ కు జనం పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో మాల్ ను సందర్శించడానికి రావడంతో లులు మాల్ లో తీవ్ర రద్దీ ఏర్పడింది. మాల్ లో ఉన్న దుకాణాలు జనాలతో కిటకిటలాడాయి. ఫలితంగా బిల్లింగ్ కౌంటర్ల వద్ద పొడవైన క్యూలు ఏర్పడ్డాయి. పెరుగుతున్న రద్దీని నిర్వహించడానికి మాల్ సిబ్బంది సైతం శ్రమపడ్డారు. ఓవర్‌లోడ్ కారణంగా మాల్‌లోని ఎస్కలేటర్లు కూడా పనిచేయడం మానేశాయి. ఫలితంగా కొనుగోలు దారులకు గంటల తరబడి మాల్ లో ఆలస్యం అయ్యింది.
తప్పని ట్రాఫిక్ కష్టాలు
లులు మాల్ కు జనం పోటెత్తడంతో మియాపూర్ నుండి అమీర్ పేట మరియు JNTU నుండి హైటెక్ సిటీ ప్రయాణించే వాహనదారులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ తో నరకయాతన అనుభవించారు.ఏకంగా ఫ్లైఓవర్ ల మీదే పార్కింగ్ చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ కష్టాలు కూకట్‌పల్లి వై జంక్షన్, బాలానగర్, కూకట్‌పల్లి, JNTU మరియు మియాపూర్ వరకు విస్తరించడంతో రెండు మూడు కిలోమీటర్లు ప్రయాణించే వాహనదారులకు సైతం గంట సేపు పట్టడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి.
ట్రాఫిక్ సమస్యలను అనుభవించిన కొందరు సామాజిక మాధ్యమాల్లో వారి అనుభవాలను పంచుకుంటున్నారు. వారిలో కొందరు ట్వీట్ చేస్తూ రెండు కిలోమీటర్ల ప్రయాణానికి తనకు గంటన్నర సమయం పట్టిందంటూ సదరు ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఇంకో ప్రయాణికుడు ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులును ట్యాగ్ చేస్తూ లులు మాల్ రద్దీ కారణంగా NH 65 పై భారీ ట్రాఫిక్ ఏర్పడింది అని అలాగే మెట్రో పిల్లర్ నంబర్ A906 నుండి A713 వరకు స్తు తీవ్రమైన ట్రాఫిక్ ఉందంటూ ట్వీట్ చేశాడు.
అటు ట్రాఫిక్ పోలీసులు సైతం హెవీ ట్రాఫిక్ ని క్లియర్ చేయలేకపోతున్నారు. ఎవరైనా లులు మాల్ ను సందర్శించుకోవాలని ఉంటే శని ఆదివారాల్లో కాకుండా సాధారణ రోజుల్లో సందర్శిస్తే అటు వాహనదారులకు, మాల్ సందర్శకులకు,మాల్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని పోలీసులు సూచిస్తున్నారు.
రిపోర్టింగ్ తరుణ్, హైదరాబాద్