Telangana Congress : కాంగ్రెస్‍లోకి కసిరెడ్డి... కల్వకుర్తి సీటుపై రేవంత్ కీలక ప్రకటన!
TS Assembly Elections 2023: ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పిన జాతీయ అధ్యక్షుడు ఖర్గే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి… కల్వకుర్తి సీటుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు.
TPCC President Revanth Reddy: ఇటీవలే బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. శుక్రవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి… కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి కాంగ్రెస్ లో చేరారని… మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్ రెడ్డి పోటీ చేసే స్థానాన్ని నారాయణ రెడ్డి కి ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చారు. వంశీచందర్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మిగతా నాయకులు వంశీచంద్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
బిల్లా రంగాలు బయల్దేరారు…
ఇదే సందర్భంగా బీఆర్ఎస్ తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “తెలంగాణలో బిల్లా రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారు. కేసీఆర్ కు ముఖం చెల్లక బిల్లా రంగాలు తిరుగుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్ ను అడిగితే చెబుతారు. మీరు అనుభవిస్తున్న పదవులు, హోదా కాంగ్రెస్ పెట్టిన బిక్ష. ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ, రైతు రుణ మాఫీ, ఫీ రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు అమలు చేసింది కాంగ్రెస్. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లో చేస్తున్న అభివృద్ధి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు చేయడం లేదు...? ఎందుకు వివక్ష చూపుతున్నారు…? తెలంగాణలోనే సమాన అభివృద్ధి చేయని మీరు కాంగ్రెస్ ను విమర్శిస్తారా? ఛత్తీస్‌ఘడ్‌లో, హిమాచల్ లో అమలు చేస్తున్న పథకాలు మీ దగ్గర ఉన్నాయా? ఉచిత కరెంట్ హామీని రాజశేఖర్ రెడ్డి అమలు చేసి చూపించారు. ఏం చేశారో చెప్పుకోడానికి ఏమీ లేక కిరాయి మనుషులను తెచ్చుకుని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరుగుజ్జులు ఎవరో... ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుంది. ఓడిపోతే పారి పోదాం అని ఇతర దేశాల పాస్ పోర్ట్ లు తీసుకున్నారు. వాటి మీద అధికారంలోకి రాగానే విచారణ జరుపుతాం. మా దగ్గర ప్రభుత్వం లేదు. పదవులు లేవు. అయినా సరే.. కసిరెడ్డి, మైనంపల్లి, రేఖా నాయక్ పదవుల్లో ఉండి మా దగ్గరకు వచ్చారు. బీఆర్ఎస్ ప్రాధాన్యత ఎన్నికలు, ఓట్లు సీట్లు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రాధాన్యత ప్రజల సంక్షేమం. ప్రజలకు ఏం చేస్తామో మేం చెప్పాము” అని అన్నారు రేవంత్ రెడ్డి.
స్టీరింగ్ వారి చేతుల్లోనే….
బీజేపీ కి అభ్యర్థులు లేరు. మానిఫెస్టో లేదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. “తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ అధికారంలో లేదు. తెలంగాణ వచ్చాక రెండు సార్లు అధికారంలో ఉన్నది మీరే. ఉమ్మడి రాష్ట్రంలో మా పదేళ్ల పాలన... తెలంగాణలో మీ పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా…? రూ. 16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో రాష్ట్రం ఇస్తే, లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు. పదేళ్లు దోచుకున్నది చాలక ఇప్పుడు కొత్తగా మేనిఫెస్టోలో చెప్పడానికి ఏముంది? వాళ్ళు ఏం చెప్పినా ప్రజలు నమ్మరు. బీజేపీ స్టీరింగ్ అదానీ చేతిలో, బీఆర్ఎస్ స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. బీజేపీ వీళ్లకు అవినీతి నుంచి రక్షణ కల్పిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరూ కలిసే ఉన్నారని ప్రజలకు అర్థం అయింది. పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ మధ్య అవగాహన కుదిరింది.బాండ్ పేపర్ మీద రాసిచ్చిన వ్యక్తి పసుపు బోర్డు ఎక్కడ పెడతారో చెప్పాలి. అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుంది అని చెబుతున్నాయి” అని వ్యాఖ్యానించారు.
సంబంధిత కథనం