TS SSC Exams: తెలంగాణలో యథాతథంగా పదో తరగతి పరీక్షలు-the department of education has announced that the tenth standard annual examinations will be held as usual in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Ssc Exams: తెలంగాణలో యథాతథంగా పదో తరగతి పరీక్షలు

TS SSC Exams: తెలంగాణలో యథాతథంగా పదో తరగతి పరీక్షలు

HT Telugu Desk HT Telugu
Apr 04, 2023 08:47 AM IST

TS SSC Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం పరీక్షా సమయంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు వచ్చిన నేపథ్యంలో పరీక్షలపై ఆందోళన అవసరం లేదన్నారు.

తెలంగాణలో యథాతథంగా పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో యథాతథంగా పదో తరగతి పరీక్షలు

TS SSC Exams: తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు యథాతథంగా జరుగు తాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం పరీక్షా సమయంలో తెలుగు ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు రావడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో మిగతా పరీక్షలు వాయిదా పడుతాయని సోషల్‌మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర విద్యాశాఖ స్పందించింది.

ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, షెడ్యూల్‌ ప్రకారమే పదో తరగతి పరీక్షలను 13 వరకు నిర్వహిస్తామని శ్రీదేవసేన స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణపై విద్యార్థులు, తల్లిద్రండులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాండూరులో తెలుగు ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌ ద్వారా బయటకు పంపిన బయాలజీ ఉపాధ్యాయుడు బందెప్ప, ఫిజిక్స్‌ టీచర్‌ సమ్మప్పతో పాటు చీఫ్‌ సూపరింటెండెంట్‌ శివకుమార్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ గోపాల్‌ను సస్పెండ్‌ చేసినట్టు ప్రకటించారు.

ప్రశ్నాత్రాల లీకేజీకి బాధ్యులైన వారిపై మాల్‌ప్రాక్టీస్ యాక్ట్‌ 25/ 1997 ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ నారాయణరెడ్డిని ఆదేశించినట్లు చెప్పారు. పదో తరగతి పరీక్ష ఉదయం 9:30 ప్రారంభం అయితే, ఉదయం 9:37 గంటలకు బం దెప్ప వాట్సాప్‌ ద్వారా ప్రశ్నపత్రాన్ని సమ్మప్పకు పంపించారని తెలిపారు. ఈ ఘటనపై కలెక్టర్‌తో విచారణ చేయించామని చెప్పారు. పరీక్షా హాల్లోకి బయటి వ్యక్తులు రాలేదని, పరీక్ష సిబ్బంది ఎవరూ సెంటర్‌ను విడిచివెళ్లలేదని, ఇతరుల చేతికి ప్రశ్నపత్రం చేరడంవంటి ఉల్లంఘనలు జరగలేదన్నారు.

నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులు…

పది పరీక్షా కేంద్రాల్లో విధుల్లో ఉన్నవారు సెల్‌ఫోన్లు వినియోగించరాదని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు ముందే హెచ్చరించారు. గత ఏడాది కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతించలేదు. పరీక్షల విధుల్లో ఉన్న టీచర్‌ బందెప్ప నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ఫోన్‌ను పరీక్షాకేంద్రం లోపలికి తీసుకెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి ఇన్విజిలేటర్‌ సమ్మప్పకు పంపించాడు. ఈ విషయంపై శ్రీదేవసేన డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

పరీక్ష కేంద్రాల్లో కాపీయింగ్‌ జరిగితే జిల్లా, మండల విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. డీఈవోలు, ఎంఈవోలు ఫిర్యాదుల రిజిస్టర్‌ను నిర్వహించి, కాపీయింగ్‌పై వచ్చే ఫిర్యాదులను నమోదు చేయాలని సూచించారు. కాపీయింగ్‌ లేదా ఇతర ఉల్లంఘనలు చోటుచేసుకొంటే ఫిర్యాదు చేసేందుకు డీ ఈవో, ఎంఈవోల మొబైల్‌ నంబర్లను కేంద్రాల్లో కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. ఏ గదిలో కాపీయింగ్‌ జరిగితే ఆ గదిలోని ఇన్విజిలేటరే కాపీయింగ్‌కు బాధ్యత వహిస్తారని, వారికి కేటాయించిన గదిలో కాపీయింగ్‌ జరిగితే సంబంధిత టీచర్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకొంటారని ప్రకటించారు.

ఏడు నిమిషాలకే ప్రశ్నాపత్రం లీక్…

తాండూర్‌లోని నంబర్‌-1 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష ప్రారంభమైన తర్వాత 7 నిమిషాలకు తెలుగు ప్రశ్నపత్రం బయటకు వచ్చిందని వికారాబాద్‌ కలెక్టర్‌ సీ నారాయణరెడ్డి చెప్పారు. పరీక్ష మొదలు కావడానికి ముందు ప్రశ్నపత్రం బయటకు రాలేదని చెప్పారు. తాండూర్‌లోని నంబర్‌ వన్‌ ప్రభుత్వ పాఠశాల రూం నంబర్‌-5లో గైర్హాజరైన విద్యార్థికి చెందిన పశ్నపత్రాన్ని, రిలీవర్‌గా పనిచేస్తున్న బందెప్ప తన ఫోన్‌ ద్వారా ఫొటోలు తీసి ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అదే స్కూల్లో పనిచేసే ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ సమ్మప్పకు వాట్సాప్‌ ద్వారా పంపించే క్రమంలో ఓ మీడియా గ్రూప్‌లో షేర్‌ చేశాడని చెప్పారు.

కాసేపటి తర్వాత గమనించి ఫోటో డిలీట్‌ చేసినా గ్రూప్‌లో ఉన్న మిగతా సభ్యులు దాన్ని మిగతా వారికి షేర్‌ చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. బందెప్ప, సమ్మప్ప నుంచి ప్రశ్నపత్రం ఎక్కడికీ షేర్‌ కానందున పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన బందెప్ప, సమ్మప్పను విధుల నుంచి సస్పెండ్‌ చేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆ పరీక్షా కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ శివకుమార్‌ తో పాటు డిపార్ట్‌మెంటల్‌ అధికారి కే గోపాల్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్టు తెలిపారు. రికవరీ ప్రశ్నపత్రాన్ని క్లర్క్‌కు బదులు రిలీవర్‌కు అప్పజెప్పిన ఇన్విజిలేటర్‌ శ్రీనివాస్‌ను విధుల నుంచి తప్పిస్తున్నామని తెలిపారు.

ఉట్నూరులో ఆన్సర్ షీట్ మాయం…

ఆదిలాబాద్‌ జిల్లాలో విద్యా ర్థుల జవాబు పత్రాలు బండిల్‌ మిస్‌ కావడం కలకలం రేపింది. ఉట్నూర్‌లో విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను విద్యా శాఖ అధికారులు ప్యాక్‌ చేసి పోస్టాఫీసులో అప్పగించారు. పోస్టల్‌ సిబ్బంది పేపర్‌ బండిల్‌ను ఆదిలాబాద్‌ హెడ్‌పోస్టాఫీసుకు తరలించడానికి ఆటోలో ఉట్నూర్‌ బస్టాండ్‌కు తీసుకుపోతుండగా మార్గమధ్యలో పడిపోయింది. తర్వాత బండిల్ దొరికినా అందులో ఓ జవాబు పత్రం లేకపోవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సజావుగానే పది పరీక్షలు….

తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సజావుగా సాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తొలిరోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. 99.60 శాతం విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు 4,87,050 మందికి గాను 4,84,885 మంది హాజరయ్యారు. 2,165 మంది గైర్హాజరైనట్టు అధికారులు తెలిపారు.

Whats_app_banner