Nizamabad Child Murder: పోషణ భారమై మనుమడి హత్య.. మహిళకు జీవిత ఖైదు విధించిన కోర్టు
Nizamabad Child Murder: మనుమడిని పోషించలేక వరద కాల్వలో పడేసి హత్య చేసిన మహిళకు న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన ఘటన నిజామాబాద్‌లో జరిగింది.
Nizamabad Child Murder: మనుమడిని వరద కాలువలో పడవేసి హత్య చేసిన వృద్ధురాలికి జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల బుధవారం తీర్పు వెలువరించారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండల కేంద్రం లోని పెద్దమ్మ కాలనీకి చెందిన గంగవ్వ కుమారుడు గంగాధర్ కు మూడున్నరేళ్ల కుమారుడు లక్కీ ఉండేవాడు. గంగవ్వ చిత్తుకాగితాలు ఏరుకుంటు జీవించేది. ఆమె భర్త చాలా రోజుల క్రితమే చనిపోయాడు. ఆమెకుఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.
గంగవ్వ పెద్ద కొడుకు గంగాధర్ తన భార్య గంగామణిని హత్య చేశాడనే అభియోగాలతో జైలుకు వెళ్లి, బెయిలుపై తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో గంగాధర్ కొడుకు అయిన మూడున్నరేళ్ల లక్కీ పోషణను గంగవ్వ చూసుకునేది. డెబ్భై ఏళ్ల ముసలి తల్లిని తానే పోషించడం గంగవ్వకు భారం, కష్టం అయ్యింది.
మనుమడు లక్కీ బాగోగులు చూడటం భారంగా మారడంతో ఆ బాలుడిని చంపి వేయాలనుకుని గంగవ్వ నిర్ణయించింది. కొడుకు గంగాధర్ లేని సమయంలో గత ఏడాది మే10న మధ్యాహ్నం రెండు గంటలకు చిత్తు కాగితాలు ఏరుకోవడానికని మనువడిని వెంట తీసుకునివెళ్లి కమ్మర్ పల్లి గ్రామ శివారులోని ఉప్లూర్ గ్రామానికి వెళ్లే రహదారిలో గల వరద కాలువలో మనుమడు లక్కీని పడవేసింది.
వరదకాలువలోని నీటిలో బాలుడు ఊపిరాడక మరణించడంతో హత్య అభియోగాలు నమోదు చేశారు. కోర్టు విచారణ లో నేరం నిరూపణ కావడంతో సెషన్స్ జడ్జి సునీత జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు. హత్య నేరం రుజువు అయినందున గంగవ్వ కు జీవిత కారాగార శిక్ష విధిస్తూ పద్నాలుగు పేజీల తీర్పు వెలువరించారు.
బైకు కొనివ్వలేదని యువకుని ఆత్మహత్య
ఇంటి పనులు అన్ని చేస్తున్నా, బైకు కొనివ్వలేదని జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో బుధవారం చోటుచేసుకుంది.
ఉప్పల్వాయి గ్రామానికి చెందిన ఒంటరి నవీన్ (23) 20 సంవత్సరాల క్రితం సదాశివ నగర్ నుండి ఉప్పల్వాయి ఒంటరి భూపతిరెడ్డి ఇంటికి దత్తపుత్రునిగా వచ్చాడు. నాలుగు సంవత్సరాల క్రితం తల్లి చనిపోవడంతో, ఇంటి పనులన్నీ కుమారుడే చేస్తున్నాడు.
మంగళవారం రాత్రి 9 గంటలకు తండ్రి పొలం వద్దకు కాపలా వెళ్లి, ఉదయం తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పెట్టుకొని, ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి భూపతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వివాహం కావడంలేదని వ్యక్తి ఆత్మహత్య
వివాహం కావడం లేదని తీవ్ర మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా భికనూర్ మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్ (36) కొంతకాలంగా ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరడం లేదని తీవ్ర మనస్తాపం చెందాడు.
ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు.
(రిపోర్టింగ్ మిసా భాస్కర్, నిజామాబాద్)