TG DSC Resuts 2024 : వేగంగా కసరత్తు...! తెలంగాణ 'డీఎస్సీ' ఫలితాలు ఎప్పుడంటే..?-tg dsc results are expected to be released at the end of august 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dsc Resuts 2024 : వేగంగా కసరత్తు...! తెలంగాణ 'డీఎస్సీ' ఫలితాలు ఎప్పుడంటే..?

TG DSC Resuts 2024 : వేగంగా కసరత్తు...! తెలంగాణ 'డీఎస్సీ' ఫలితాలు ఎప్పుడంటే..?

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 14, 2024 04:29 PM IST

Telangana DSC Resuts 2024: తెలంగాణ డీఎస్సీ ఫలితాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను ts dsc అధికారిక వెబ్సైట్ అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెలఖారులోనే తుది ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తెలంగాణ డీఎస్సీ  2024 ఫలితాలు
తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలు

TG DSC Resuts 2024: త్వరలోనే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆలస్యం కాకుండా పరీక్షలు పూర్తి అయిన కొద్దిరోజుల్లోనే ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఫలితాలను కూడా ప్రకటించే యోచనలో విద్యాశాఖ ఉంది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ వెంటనే షెడ్యూల్ ప్రకటించటంతో పాటు పరీక్షలను కూడా పూర్తి చేసింది. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది.

అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ పూర్తి కాగానే.. ఆ తర్వాత తుది కీని ప్రకటించనుంది. అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టును అందుబాటులోకి తీసుకురానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత… నియామక పత్రాలను అందజేయనుంది. దాదాపు తుది జాబితా ప్రక్రియ అంతా కూడా ఈ ఈనెలాఖరులోనే పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది.

డీఎస్సీ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగానే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల కిందట ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలతో పాటు కొత్త టీచర్ల నియామకాలపై కూడా చర్చ జరిగింది. ఉపాధ్యాయ దినోత్సవంలోపు రిక్రూట్ మెంట్ పూర్తి అవుతుందన్న విషయం చర్చకు వచ్చింది.

నిజానికి డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరినప్పటికీ ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. గ్రూప్స్ పరీక్షలపై నిర్ణయం తీసుకున్నప్పటికీ… డీఎస్సీ పరీక్షలను యథావిథిగా నిర్వహించింది. నిర్ణయించిన షెడ్యూల్ లోపే పరీక్షలను పూర్తి చేసి… కొత్త టీచర్ల రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. మొత్తంగా చూస్తే… ఈ నెలాఖారులోపే ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2,79,966 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జులై 18 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోస్టుల వారీగా చూస్తే…. 2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 220 స్కూల్‌ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. రోజుకు రెండు విడతల్లో పరీక్షలను నిర్వహించారు.

డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 87.61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అంటే 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

Whats_app_banner

సంబంధిత కథనం